Ayodhya: శబరి.. రాముడి భక్తురాలు. రాముడి కోసం ఎంత పరితపించిందో రామాయణంలో చదువుకున్నాం. సినిమాల్లో కూడా చూశాం. ఇప్పుడు అటువంటి శబరి ఒకరు.. ఈ కలియుగంలో కూడా రాముడి కోసం పరితపించారు. రాముడి కోసం పెద్ద వ్రతమే ఆచరించారు. అనుకున్నది సాధించారు. ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు.అయోధ్యలో రాములోరి విగ్రహ ప్రతిష్ట సమీపిస్తున్న తరుణంలో ఈమె గురించి బయటపడింది.
ఝార్ఖండ్ లోని ధన్ బాద్ కు చెందిన సరస్వతి దేవి రాముని భక్తురాలు. సుమారు 85 సంవత్సరాల వయసులో ఆమె భక్తి అనితర సాధ్యంగా నిలిచింది. రాముడంటే ఆమెకు విపరీతమైన భక్తి. అందుకే అయోధ్యలోని రామ జన్మభూమిలో ఆలయ నిర్మాణం జరిగే వరకు మౌనవ్రతం చేయాలని నిర్ణయించుకున్నారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ప్రతిజ్ఞ చేశారు. అప్పటినుంచి రోజుకు 23 గంటలపాటు మౌనవ్రతం పాటిస్తూ వస్తున్నారు. ఒక గంట మాత్రమే కుటుంబ సభ్యులతో మాట్లాడేవారు. అయితే 2020లో ప్రధాని మోదీ ఆలయ శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి 24 గంటల పాటు మౌనవ్రతంలోనే కొనసాగుతున్నారు.
ఈనెల 22 వరకు ఆమె మౌనవ్రతం కొనసాగనుంది. ఆరోజు అయోధ్యలో రామ మందిరం ప్రతిష్ట జరగనుంది. ఆరోజు విగ్రహ ప్రతిష్టను టీవీల్లో వీక్షించిన తర్వాత మౌనవ్రతం వీడనున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు అభినవ శబరి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆమె భక్తి ప్రపత్తులను అభినందిస్తున్నారు. శబరి గురించి రామాయణంలో చదవడమే కానీ.. స్వయంగా చూడడం సంతోషంగా ఉందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా అయోధ్యలో రామ మందిర ప్రతిష్ట కోసం ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. కనీ వినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.20,21,22 తేదీల్లో ఆలయ సందర్శనను నిషేధించారు. సామాన్యులకు ఈ మూడు రోజులపాటు ఆలయ దర్శనం ఉండదు. కేవలం ఆహ్వానం ఉన్న వాళ్లకు మాత్రమే అనుమతించనున్నారు. 23 నుంచి సామాన్యులకు కూడా దర్శన భాగ్యం ఉంటుంది.