https://oktelugu.com/

India Alliance: ఇండియా కూటమికి భారీ షాక్.. అసలు ఏం జరిగిందంటే?

ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న 32 రాజకీయ పార్టీలు ఏకతాటి పైకి వచ్చాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏను రద్దుచేసి.. ఇండియా కూటమిగా నామకరణం చేశాయి. కానీ కూటమి నాయకత్వ బాధ్యతల విషయంలో భాగస్వామ్య పక్షాల మధ్య విభేదాలు ఉన్నాయి.

Written By:
  • Dharma
  • , Updated On : January 26, 2024 / 02:58 PM IST
    Follow us on

    India Alliance: ఇండియా కూటమిలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు. ఎన్నికల ఫలితాల అనంతరం మాత్రమే కూటమిలో చేరాలా? వద్దా? అని నిర్ణయించుకుంటామని తేల్చి చెప్పారు. తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్ సైతం ఇండియా కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. దీంతో కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఏర్పాటైన విపక్ష ఇండియా కూటమి మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. మోదీ హవాను చెక్ చెప్పాలన్న విపక్షాల ప్రయత్నాలకు ఆదిలోనే గండి పడినట్లు అయ్యింది. అటు నితీష్ కుమార్ సైతం బిజెపితో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

    ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న 32 రాజకీయ పార్టీలు ఏకతాటి పైకి వచ్చాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏను రద్దుచేసి.. ఇండియా కూటమిగా నామకరణం చేశాయి. కానీ కూటమి నాయకత్వ బాధ్యతల విషయంలో భాగస్వామ్య పక్షాల మధ్య విభేదాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ బాధ్యతలు అప్పగించడం పై అభ్యంతరాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కీలక నేతలు విభిన్న ప్రకటనలు చేస్తూ వచ్చారు. తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కీలక ప్రకటనలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ రాష్ట్రాల్లో ఒంటరి పోరుకు సిద్ధమని ప్రకటించారు. పంజాబ్ తో సహా హర్యానా, ఢిల్లీ, గోవా, గుజరాత్లలో సీట్ల సర్దుబాటుపై చర్చల్లో ప్రతిష్ఠంభన నెలకొన్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పుడు నితీష్ సైతం అదే బాటలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    ఇండియా కూటమి ఏర్పాటులో నితీష్ కుమార్ ది కీలక పాత్ర. కానీ కూటమి చైర్మన్ గా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ఎన్నుకోవడం పై నితీష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కూటమి సారధ్య బాధ్యతలు ఆశించిన ఆయనను కన్వీనర్ పదవి స్వీకరించాలని మిగతా భాగస్వామి పక్షాలు కోరినా ఫలితం లేకపోయింది. అటు బీహార్ లో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి స్పష్టత లేకుండా పోయింది. దీంతో లోక్ సభ ఎన్నికల్లో తమకు ఎదురుదెబ్బ తప్పదని నితీష్ భావిస్తున్నారు. అందుకే బిజెపితో చేతులు కలపాలని చూస్తున్నారు. ఇప్పటికే ఆయన బిజెపి ఆగ్రనేతలతో చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించడం ద్వారా నితీష్ స్నేహ హస్తాన్ని అందించినట్టు తెలుస్తోంది. బిజెపికి వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేసేందుకు రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల్లో ఈ యాత్ర బీహార్ చేరుకోనుంది. ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ ఈ యాత్రలో పాల్గొనవలసి ఉంది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నితీష్ కుమార్ యాత్రకు దూరంగా ఉండడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం. తద్వారా ఇండియా కూటమి నుంచి వైదొలగి బిజెపికి చేరువయ్యేందుకు నితీష్ మార్గం సుగమం చేసుకుంటున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే నితీష్ మున్ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.