Congress Politics Review : 2022 వెళ్లిపోయింది. 2023 వచ్చేసింది. కొత్త సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అని అందరికీ ఆసక్తి ఉంది. 2022 కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలకూ కలిసి వచ్చిందనే చెప్పాలి. మరి కొత్త ఏడాది.. ఎన్నికల ఏడాది పరిస్థితి ఏంటి.. పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది.. ఆ నిర్ణయాలు పార్టీని విజయ తీరానికి చేరుస్తాయా.. లేక కాంగ్రెస్ కథ కంచికి వెళ్తుందా అనేది తేల్చనుంది.

దశాబ్దాల తరబడి దేశాన్ని ఏలిన పార్టీ అది. ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించి తెలంగాణ దశాబ్దాల కళ నెరవేర్చిన పార్టీ అది. రాష్ట్రాన్ని ప్రకటించినా తెలంగాణలో ఆదరణ లేదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని విభజించి అక్కడ అతీ గతీ లేదు. ప్రస్తుతం రెంటికీ చెడిన రేవడిలా కాంగ్రెస్ పరిస్థితి మారింది. తెలంగాణలో ఎదగలేక పోతోంది.. ఏపీలో మళ్లీ ఖాతా తెరవలేకపోతోంది. దుబ్బాక, హుజూరాబాద్, హుజూర్‌నగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమితో పార్టీ తెలంగాణలో పూర్తిగా చతికిల పడింది. ఈ క్రమంలో ఎన్నికల ఏడాదిలోకి అడుగు పెట్టిన వేళ.. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ పై చర్చ జరుగుతోంది.
-మరిన్ని కష్టాలు తప్పవా..?
2021 వరకూ తెలంగాణలో కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్‌తో మాత్రమే పోటీ ఉండేది. అయినప్పటికీ గత ఎన్నికల్లో కేవలం 19 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. అందులోనూ ప్రస్తుతం ఉన్నది ఏడుగురు మాత్రమే. 2022 నుంచి బీజేపీ పుంజుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తోపాటు బీజేపీ నుంచి కూడా గట్టి పోటీ ఎదుర్కోనుంది. ఇప్పటికే టీపీసీ చీఫ్‌పై సీనియర్లు తిరుగుబాటు ప్రారంభించారు. ఇది కాంగ్రెస్ నాయకత్వాన్ని గందరగోళంలో పడేసింది. డిగ్గీ రాజా వచ్చిన తర్వాత పరిస్థితి సద్ధుమణిగినట్లు కనిపిస్తున్నా.. ఇది తుపాను ముందు ప్రశాంతతే అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు బీజేపీ కాసుకు కూర్చుందు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఆ పార్టీ కీలక నేతలంతా పక్కచూపులు చూస్తున్నారు. 2022లో దుబ్బాక, హుజూర్ నగర్, హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల క్షేత్రంలో విస్తృతంగా పనిచేసినా ఫలితం అనుకూలంగా రాకపోవడం వారిని తీవ్ర నైరాశ్యంలోకి నెట్టింది. పీసీసీ చీఫ్ మొదలు మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయి నేతల వరకు దుబ్బాకలో మకాం వేసి ఓటర్లను ఆకట్టుకొనేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడం, బీజేపీ 2, బీఆర్‌ఎస్ 2 గెలుపొందడంతో కాంగ్రెస్ నేతల్లో అయోమయం నెలకొంది. ఈ పరిస్థితుల్లో పార్టీ భవిష్యత్ పై జోరుగా చర్చ జరుగుతోంది.
-తేరుకోలేక చతికిల..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఘోర పరాభవం తర్వాత కాంగ్రెస్ పార్టీ తేరుకోలేకపోతోంది. అధికార పార్టీ దూకుడుతో.. విపక్ష హోదాను కోల్పోయింది. అంతర్గత కుమ్ములాటలు పార్టీకి పెద్ద శాపంగా మారుతున్నాయి.. అంతర్గత స్వేచ్ఛ, తామే అసలైన కాంగ్రెస్ వాదులం అన్న పేరుతో కొంతమంది పార్టీని చిలువలు పలువలు చేస్తున్నారు. ఇది చూసి మరికొంతమంది పార్టీలో ఇమమడలేక బయటకు వస్తున్నారు.
-గొడవలు మానకుండానే..
కాంగ్రెస్ నేతలు తమలోని పోరాట చేవను, వాడిని, వేడిని ప్రత్యర్థులైన బీఆర్‌ఎస్, బీజేపీపైన వాడడం మాని అంతర్గత తగాదాలకు ఉపయోగించడం ద్వారా ఆ పార్టీ నేతలు తమ సోయి లేనితనాన్ని నిరూపించుకున్నారు. మునుగోడులో డిపాజిట్ దక్కక బొక్కబోర్లా పడ్డారు. ఏడాది పొడవునా రేవంత్ వర్గానికి, సీనియర్లుగా వ్యవహరించే రేవంత్ వ్యతిరేక వర్గానికీ మధ్య గొడవలు కొనసాగాయి. ఎడతెగని ఈ ఘర్షణలను నివారించడంలో కాంగ్రెస్ హైకమాండ్ ఘోరంగా విఫలమైంది. చివరకు, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్ సైతం ఈ రొంపిలో ఇరుక్కున్నారు.
-వారు మారతారా?
కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందన్న అంశం పైనే బీఆర్‌ఎస్, బీజేపీ భవిష్యత్తు, ఎన్నికలలో గెలుపోటములు, పొందే స్థానాలు, ప్రభుత్వ ఏర్పాటు వంటి విషయాలు ఆధారపడి ఉంటాయి. కాంగ్రెస్ తన తీరును మార్చుకోకుండా, కొట్లాటను కంటిన్యూ చేస్తే బీజేపీ భారీగా లాభపడుతుంది. హస్తం గుర్తుకు పడే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ దాదాపుగా కమలానికి పడే అవకాశముంటుంది. హుజూరాబాద్‌లో లాగా దళిత, వామపక్ష ఓటుబ్యాంకు కూడా ఆ పార్టీకే మళ్లవచ్చు. ఒకవేళ, అంతర్గత గొడవల నుంచి బయటపడి ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ ఐక్యంగా పనిచేస్తే మాత్రం ఓట్లు చీలి అధికార పార్టీకి లాభించడం ఖాయం.
ఫైనల్‌గా, కాంగ్రెస్ పార్టీ అంతర్గత పరిణామాలపైనే 2023లో రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడనుందనే అంశం ఆధారపడి ఉంటుందని పక్కాగా చెప్పవచ్చు. ఆ పార్టీ సెట్‌రైట్ అయి గట్టి పోటీ ఇస్తే, బీఆర్‌ఎస్‌కే అధికారం దక్కవచ్చు. సొంతంగా మెజారిటీ రాకున్నా ఎంఐఎం సపోర్టుతో గట్టెక్కవచ్చు.