Wadia Group: భారతదేశంలో టాప్ బిజినెస్ మాగ్నైట్స్ ఎవరంటే టక్కున గుర్తుకొచ్చేది టాటా, బిర్లా కంపెనీలు. ఎన్నో ఏళ్లుగా దేశంలోని వ్యాపార రంగంలో అత్యున్నత స్థాయిలో ఉంటూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు. అయితే వీరి కంటే పురాతన కాలంలోనే, అత్యధిక పెట్టుబడులు సక్సెస్ అయిన మరో గ్రూప్ ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. బ్రిటిష్ కాలంలోనే ఆంగ్లేయులతో ఒప్పందం చేసుకొని మరీ వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన ‘లోన్జీ వాడియా ’ గ్రూప్ గురించి తెలిస్తే షాక్ అవుతారు. రూ.1,20,000 కోట్ల ఆదాయాన్ని కలిగిన ఈ కంపెనీ గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..
భారతదేశంలో శతాబ్దానికి పైగా వ్యాపార చరిత్ర ఉంది. నాటి కాలం నుంచే చాలా మంది విదేశీయులు భారత్ లో వ్యాపారాలను చేసేందుకు వలసలు వచ్చారు. వారి దగ్గర మెళకువలు నేర్చుకొని ఇక్కడి వారు అనేక సంస్థలను నెలకొల్పారు. ఇప్పటి వరకు ఇండియాలో వ్యాపార సామ్రాజ్యాలను సృష్టించిన వారి గురించి చెప్పుకోవాల్సి వస్తే టాటా, బిర్లా, గోయెంకా పేర్లు మాత్రమే వినిపిస్తాయి. కానీ 300 సంవ్సరాల క్రితమే ఇండియాలో వాడియా కుటుంబం షిప్పింగ్ పరిశ్రమను ప్రారంభించింది. ముంబైలోని అరేబియా సముద్ర తీరాన ఉన్న ఉన్న ఇది దేశంలోనే అతి పురాతన కంపెనీగా పేర్కొంటారు.
గుజరాత్ రాష్ట్రానికి చెందిన చాలా మంది ప్రముఖులు ఇప్పుడు వ్యాపార రంగంలో ఏలుతున్నారు. ఈ రాష్ట్రంలోని సూరత్ కు చెందిన లోవ్ జీ నుసర్వాంజీ వాడియా 1736వ సంవత్సరంలోనే ‘వాడియా’ గ్రూపును ప్రారంభించారు. దీనికి అతని సోదరుడు సొరాబ్జీ కూడా సహకారం అందించాడు. ముంబైలో ఓడల నిర్మాణాలు చేపట్టే మొదటి డ్రై డాక్ గా వాడియా గ్రూప్ నిలుస్తుంది. అయితే ఈ ఓడరేవులను స్థాపించడానికి వాడియా గ్రూప్ బ్రిటిష్ ప్రభుత్వంతో ఒప్పందం ఏర్పరుచుకున్నారు.
వాడియా సోదరులు స్థాపించిన షిప్పింగ్ కంపెనీని వారి వారసులు కొనసాగించారు. ఆ తరువాత తమ వ్యాపారాలను విస్తరించారు. లోన్జీ వాడియా కుమారులు మానెక్టీ, బొమాంజీలు 1760లో సూరత్ కు సమీపంలో అటాష్ అదరన్ ను స్థాపించారు. తదనంతరం వాడియా వారసులు 1933లో మూవీటోన్ ను స్థాపించారు. ఇది ముంబైలోని చెబూర్ లోని లోన్జీ కాజిల్ లో స్డూడియోలను కలిగి ఉంది. అంచెలంచెలగా లోన్జీ వ్యాపారం విస్తరిస్తూ వివిధ ప్రొడక్ట్ లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. వీటిలో బాంబే డైయింగ్, బ్రిటానియా లు ప్రఖ్యాత చెందాయి. బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ కూడా ఈ గ్రూప్ నకు చెందినదే. ఇది ఇండియాలోని అతి పురాతనమైన వర్తక సంస్థగా నిలుస్తుంది. అంచెలంచెలుగా ఎదిగిన వాడియా గ్రూప్ ప్రస్తుతం రూ.1,20,000 కోట్ల ఆదాయాన్ని కలిగి ఉంది.