KCR : 2019 లోక్‌సభ ఎన్నికల్లో… బీఆర్‌ఎస్ అప్పటి టీఆర్‌ఎస్ నిజామాబాద్ లోక్‌సభ అభ్యర్థి కల్వకుంట్ల కవితపై 185 మంది రైతులు నామినేషన్లు వేసి అందరి దృష్టిని ఆకర్షించారు. పరోక్షంగా సిట్టింగ్ ఎంపీ కవిత ఓటమికి కారణమయ్యారు. ఇదే సమయంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ రైతులకు బాండ్ పేపర్ రాసి ఇచ్చి కవితపై విజయం సాధించారు.
2019లోనే ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి నుంచి కూడా భారీగా నామినేషన్లు వేసి అందరి దృష్టిని ఆకర్షించాలని అనుకున్నారు. అందుకోసం దాదాపు 50 మంది రైతులు ఒక ప్రత్యేక బస్సులో వారణాసి వెళ్లారు. ఆర్మూరు నుంచి వెళ్లిన 25 మంది రైతుల నామినేషన్లలో కేవలం ఒక నామినేషన్‌ను మాత్రమే ఆమోదించారు.
తాజాగా సీఎం కేసీఆర్‌పై గతంలో కవితపై సంధించిన నామినేషన్ల అస్త్రం సంధించబోతున్నారు కామారెడ్డి రైతులు. కామారెడ్డి ప్లాన్ రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కానీ దీనిపై ప్రభుత్వం స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రతీ గ్రామం నుంచి 15 నామినేషన‍్ల చొప్పున 100 నామినేషన్లు వేయాలని నిర్ణయించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్‌లో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితపై పసుపు రైతులు అనుసరించిన వ్యూహం తరహాలో కామారెడ్డి రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇరుకున పెట్టేందుకు సిద్ధమయ్యారు.
ప్రత్యేక సమావేశం..
కామారెడ్డి మున్సిపాలిటీలోని లింగాపూర్ గ్రామంలో సుమారు 200 మంది రైతులు సమావేశమయ్యారు. పార్టీలకతీతంగా రైతులంతా ఏకమై ఐక్య కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ‘గజ్వేల్‌లో భూములు అయిపోయాయి.. ఇప్పుడు కామారెడ్డిలో భూములను దోచుకునేందుకు వస్తున్నారా?’ అని ఓ రైతు నేత ఆగ్రహంగా ప్రశ్నించారు. తమ భూములను కాపాడుకునేందుకు ఎంతకైనా తెగిస్తామని చెప్పారు. ‘కష్టమైనా, నష్టమైనా భూములనే నమ్ముకొని వ్యవసాయం చేసుకొనే రైతులం మేము. డబ్బులకు, అధికారానికి లొంగేవాళ్లం కాదు. ఎంతకైనా పోరాడుతాం’ అని సమావేశం అనంతరం ఓ రైతు అన్నారు. లింగాపూర్ గ్రామంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణపై రైతులు సమావేశం నిర్వహించారు.
కేసీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం..
ఇటీవల సీఎం కేసీఆర్ గజ్వేల్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డిలో తనకు పని ఉండటం వల్లనే అక్కడికి వెళ్తున్నానని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కామారెడ్డి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు ఇక్కడేం పని ఉంది? గజ్వేల్‌లో భూములు అయిపోయాయి, ఇక ఇక్కడికి ఆ పని మీదే వస్తున్నారా..?’ అని రైతులు ప్రశ్నించారు. రైతు రాములు ఆత్మహత్య లాంటి ఘటనలు పునరావృతం కాకముందే.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని రైతులు డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నామని ప్రకటించిన తర్వాతే కామారెడ్డికి రావాలని సూచించారు. గవర్నర్ ద్వారా మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించాలని డిమాండ్ చేశారు. తమ భూములు కాపాడుకునేందుకు తాము ఎంత వరకైనా వెళ్తామని ప్రకటించారు. రైతులకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా.. వ్యవసాయ భూములు ఇండస్ట్రీయల్ జోన్ వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రద్దు చేయకుంటే తీవ్ర పరిణామాలు..
కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు కపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అసలు కేసీఆర్‌కు ఇక్కడేం పనని, మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించాకే కేసీఆర్ కామారెడ్డికి రావాలని హెచ్చరించారు. లేని పక్షంలో ప్రతీ గ్రామం నుంచి 15 చొప్పున కేసీఆర్‌పై 100 నామినేషన్లు వేస్తామని స్పష్టం చేశారు.