RRR : క్యారక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ని మొదలుపెట్టి, ఆ తర్వాత హీరోగా తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఒకరు సత్యదేవ్. 2011 వ సంవత్సరం లో ప్రభాస్ హీరో గా నటించిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ అనే చిత్రం ద్వారా ఈయన ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘అత్తారింటికి దారేది’, ‘ముకుంద’, ‘క్షణం’ ఇలా ఎన్నో సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టు గా గుర్తింపు పొందిన సత్యదేవ్ , ‘బ్లఫ్ మాస్టర్’ అనే చిత్రంతో హీరోగా మంచి గుర్తింపుని దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఈయన హీరోగా నటించిన ‘బ్రోచేవారెవరురా’, ‘తిమ్మరుసు’, ‘ఉమామహేశ్వరరావు ఉగ్రరూపస్య’ వంటి సూపర్ హిట్ సినిమాలను అందుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈయన హీరో గా చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. సరిగ్గా ఆ సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో విలన్ గా నటించే ఛాన్స్ దక్కింది.
ఈ సినిమాలో ఆయన విలనిజం కి మంచి మార్కులే పడ్డాయి. ఇక్కడి నుండి ఆయన కెరీర్ మలుపు తిప్పుకుంటుంది అని అందరూ అనుకున్నారు కానీ, అది జరగలేదు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘నేను #RRR చిత్రంలో నటించాను అనే విషయం చాలా మందికి తెలియదు. 10 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాను. కానీ కథకు నా సన్నివేశాలు అడ్డంగా అనిపించడంతో నాకు సంబంధించిన 16 నిమిషాల ఫుటేజీ ని ఎడిటింగ్ లో తీసేసారు. ఇది చెప్పకూడదు కానీ, సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్పాల్సి వస్తుంది. కానీ పని చేసింది 10 రోజులు అయినా, నా సన్నివేశాలను కట్ చేసినా, రాజమౌళి లాంటి దర్శకుడితో పని చేశాను అనే అనుభూతి చాలు నాకు, జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన మధుర క్షణాలు అవి’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
ఇదంతా పక్కన పెడితే ఈ నెల 22వ తారీఖున ఆయన హీరోగా నటించిన జీబ్రా అనే చిత్రం విడుదల కాబోతుంది. ఇందులో పుష్ప చిత్రంలో జాలిరెడ్డి గా నటించిన డాలి ధనుంజయ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. టీజర్, ట్రైలర్ లతో విశేషంగా ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఈ చిత్రం ప్రొమోషన్స్ లో భాగంగా సత్యదేవ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. నెటిజెన్స్ సత్యదేవ్ కి జరిగిన అన్యాయం పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ సినిమాలో ఆయన కనిపించి ఉండుంటే సత్యదేవ్ కి బాగా కలిసొచ్చేది. కనీసం 22 వ తారీఖున విడుదల అవ్వబోతున్న జీబ్రా సినిమా అయినా సత్యదేవ్ కెరీర్ ని మలుపు తిప్పుతుందో లేదో చూడాలి.