Pawan Kalyan : ఖుషి లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ తన స్వీయ దర్శకత్వం లో చేసిన చిత్రం జానీ. అప్పట్లో ఈ చిత్రంపై అంచనాలు మామూలు స్థాయిలో ఉండేవి కాదు. ఆంధ్ర, తెలంగాణ యూత్ మొత్తం పవన్ మ్యానియాలో మునిగి తేలింది. గడిచిన దశాబ్ద కాలం లో ‘బాహుబలి’ సిరీస్ కి విడుదలకు ముందు ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో ‘జానీ’ సినిమాకి అంతకి మించి క్రేజ్ ఉండేదట. అప్పట్లో జానీ బ్యాండ్స్ తలకి , చేతులకి కట్టుకొని ఆంధ్ర యూత్ మొత్తం తిరిగేవారని, ఆ సినిమా విడుదల రోజు ఆంధ్ర ప్రదేశ్ యువత మొత్తం థియేటర్స్ దగ్గరే ఉండిందని డైరెక్టర్ హరీష్ శంకర్ అనేక ఇంటర్వ్యూస్ లో తెలిపాడు. అలాంటి భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుండే ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది.
ఈ చిత్రానికి అలాంటి టాక్ రావడానికి కారణం, అప్పటి ఆడియన్స్ కి మోస్ట్ అడ్వాన్స్ గా ఉండడమే. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ గురించి ఈ సినిమాలో ఉన్నన్ని ఫైట్స్ ఇండస్ట్రీ కలిపి చూసిన మనకి కనిపించవు. పవన్ కళ్యాణ్ సొంతంగా కంపోజ్ చేసిన ఫైట్స్ అవి. ఈ సినిమా స్క్రిప్ట్ ప్రకారం హీరో చివర్లో చనిపోవాలి. కానీ తన అభిమానులు అలాంటి యాంటీ క్లైమాక్స్ ని జీర్ణించుకోలేరేమో అని భావించి షూటింగ్ మొదలయ్యే ముందు క్లైమాక్స్ ని మార్చేశాడు. ఇది ఇలా ఉండగా ఒక దర్శకుడిగా ఈ సినిమాకోసం పవన్ కళ్యాణ్ చేసినన్ని ప్రయోగాలు ఇండస్ట్రీ లో రాజమౌళి లాంటి డైరెక్టర్ కూడా చేయలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందులో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది లైవ్ డబ్బింగ్ గురించి.
సుమారుగా 90 శాతం వరకు షూటింగ్ లైవ్ లోనే వాయిస్ రికార్డు చేశారట. కొన్ని సన్నివేశాలకు మాత్రమే ప్రత్యేకించి డబ్బింగ్ చెప్పాడట పవన్ కళ్యాణ్. కేవలం హాలీవుడ్ లో మాత్రమే ఇలాంటి టెక్నాలజీ ని పలు సినిమాల కోసం ఉపయోగించారు. ఆ టెక్నాలజీ ని మన తెలుగు ఆడియన్స్ కి పరిచయం చేసాడు పవన్ కళ్యాణ్. కానీ ఇది వర్కౌట్ అవ్వలేదు. అదే విధంగా ఈ సినిమా కోసం ఆయన ప్రత్యేకించి ఐక్విదో ఫైట్స్ ని జపాన్ లో నేర్చుకున్నాడు. అందుకే ప్రతీ ఫైట్ సన్నివేశం చూసే ఆడియన్స్ కి చాలా కొత్తగా అనిపిస్తుంది. ఈ ఐక్విదో ఫైట్ ని పూర్తి స్థాయిలో డైరెక్టర్ సుజిత్ ప్రస్తుతం తానూ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఓజీ చిత్రంలో గ్రాండ్ గా చూపించబోతున్నాడు. జానీ సినిమా ఆరోజుల్లో విడుదలై మిస్ ఫైర్ అయ్యిందని, కాస్త ఎడిటింగ్ చేసి ఇప్పుడు రిలీజ్ చేస్తే పెద్ద హిట్ అవుతుందని డైరెక్టర్ సుజిత్ పలు ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తూనే దర్శకత్వం, స్క్రీన్ ప్లే, కథ మాత్రమే కాకుండా, రెండు పాటలు కూడా పాడాడు.