Pavan With People: ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల వ్యవధి ఉంది. అప్పుడే ఎన్నికలు జరుగుతున్న ఫీలింగ్ అయితే నెలకొంది. రాజకీయ హీట్ నడుస్తోంది. ప్రస్తుతం అయితే పొత్తుల చుట్టూ తిరుగుతున్నాయి. అధికార వైసీపీ కాస్తా దూకుడుగానే ఉంది. ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. అయినా సంక్షమ పథకాలే తమను గట్టెక్కిస్తాయని భావిస్తోంది. సింగిల్ గానే ఎన్నికలకు సిద్ధమైంది. కానీ విపక్షాలు పొత్తులతోనే బరిలో దిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకూ పొత్తులపై ఎటువంటి చర్చలు జరగకున్నా ఎన్నికల్లో మాత్రం కలిసి నడవాలన్న అభిప్రాయానికి వచ్చాయి. కానీ ఎవరికి వారుగా అన్నట్టు ఇప్పుడే పొత్తుకు ముందుకొస్తే త్యాగాలు చేయాల్సి ఉంటుందోనని వెనక్కి తగ్గుతున్నాయి. రాజకీయ పరిస్థితులను అంచనా వేసి కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయి. తొలుత వన్ సైడ్ లవ్ అంటూ పొత్తుల అంశాన్ని తెరపైకి తెచ్చిన చంద్రబాబు కీలక ప్రకటనలు చేస్తూ వచ్చారు. దానికి సారుప్యత ఉండేలా పవన్ కళ్యాణ్ ప్రకటనలు కొనసాగాయి. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలినివ్వనని చెప్పడం ద్వారా పవన్ కూడా పొత్తులకు సంకేతాలిచ్చారు. తన ముందున్న మూడు ఆప్షన్లు సైతం ప్రకటించారు. 2014, 2019 ఎన్నికల్లో మేము తగ్గాం.. ఇక్ మీరు తగ్గండంటూ పవన్ వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన తరువాత పరిణామాలు శర వేగంగా మారిపోయాయి. జాతీయ పార్టీ కదా.. దేశం మొత్తం ఏలుతున్న పార్టీ అని అనుకున్నారేమో కానీ.. బీజేపీ నేతలు పవన్ కూ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎన్నికలప్పుడే పొత్తుల గురించి మాట్లాడతామని పవన్ కు తేల్చిచెప్పారు. దీంతో జనసేన, టీడీపీ అలయెన్స్ ఖాయమని అంతా భావించారు. కానీ మధ్యలో ఏమైందో ఏమో.. ఇప్పుడు రెండు పార్టీల అధినేతల స్వరం మారింది. పొత్తులపై మాట మారుస్తున్నారు. దీంతో అసలు పొత్తు ఉండడం డౌటా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ మరింత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ.. పొత్తు వార్తల్లో కొత్త ట్విస్ట్ ఇచ్చారు. కౌలు రైతులకు సాయం అందించిన ఆయన.. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను సీబీఎన్ దత్తపుత్రుడిని కాదన్న పవన్.. సీఎం జగన్ సీబీఐ దత్తపుత్రుడు అని విమర్శించారు. ఈ సందర్భంగా పొత్తులపై క్లారిటీ ఇచ్చారు కూడా..
నోరుమెదపొద్దు
జనసేనతో పొత్తు విషయమై అధికార ప్రతినిధులు, నేతలు నోరు మెదపొద్దని టీడీపీ అధిష్టానం ఆదేశించినట్టు సమాచారం. జనసేన విస్తృతస్థాయి సమావేశంలో పవన్‌కల్యాణ్ మూడు ఆప్షన్లు పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో టీడీపీ, బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఒక ఆప్షన్‌గా ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ కాస్త తగ్గాలని కూడా పవన్ సూచించారు.పవన్ సూచనపై టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా పవన్క ల్యాణ్‌పై టీడీపీ యాక్టివిస్టులు తీవ్రస్థాయిలో ట్రోలింగ్‌కు దిగారు. అలాగే జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చెబుతున్నట్టు తానెప్పుడూ తగ్గలేదని టీడీపీ అధికార ప్రతినిధులు ఉతికి ఆరేస్తున్నారు. ఈ పరిణామాలు జనసేన, టీడీపీ మధ్య గ్యాప్ పెంచుతాయనే ఆందోళన ఇరు పార్టీల నేతల్లోనూ నెలకొంది. దీంతో టీడీపీ అధిష్టానం అప్రమత్తమైంది.జనసేనతో పొత్తుపై ఎవరూ మాట్లాడొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికలకు ఆరు నెలల ముందు పొత్తు విషయమై చర్చిద్దామని, అంత వరకూ ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించినట్టు సమాచారం. పొత్తుపై మౌనమే ఉత్తమమని టీడీపీ భావిస్తున్నట్టు సమాచారం. తద్వారా జనసేనను మరింత గందరగోళపరిచే ఆలోచనలో టీడీపీ ఉన్నట్టు, ఆ పార్టీ వ్యూహం తెలియజేస్తోంది. టీడీపీతో పొత్తుపై జనసేన ఆశలు సజీవంగా ఉంచాలని ప్రధాన ప్రతిపక్షం నిర్ణయించడం వెనుక వ్యూహం ఏమై వుంటుందనే చర్చకు తెరలేచింది.
మహానాడుతో కాస్తా మార్పు..
కాస్త నీరసం తగ్గితే తనంత వాడు లేడన్నాడట వెనకిటికి ఒకడు. తెలుగుదేశం వైఖరి అలాగే వుంటుంది. నిన్న మొన్నటి వరకు వన్ సైడ్ లవ్ అంటూ జనసేన పొత్తు కోసం తహతహలాడిపోయారు. జనసేన ను ఎలాగైనా కలుపుకుని వెళ్లాల్సిందే అనుకున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. కానీ ఇప్పుడు మహానాడుకు కాస్త జనాలు రాగానే జనసేనతో పొత్తు అవసరమా అని ఆలోచనలు మొదలయ్యాయి. పొత్తు పెట్టుకుంటే అనవసరం గా పాతిక లేదా ముఫై సీట్లు ఇవ్వాల్సి వుంటుంది అనే బాధ మొదలయినట్లుంది. వాస్తవానికి గడిచిన ఎన్నికల తరువాత టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో పదవులు వెలగబెట్టిన వారు పార్టీకి దూరమయ్యారు. కేసుల భయంతో కీలక నాయకులు సైలెంట్ అయిపోయారు. చంద్రబాబు వయసు మళ్లడం, లోకేష్ అవకాశాలను అందిపుచ్చుకోలేకపోవడం ఆ పార్టీకి మైనస్ గా మారింది. అందుకే వరుస ఎన్నికల్లో ఆ పార్టీకి సరైన గెలుపు దక్కలేదు. అయితే చెక్కు చెదరని కేడర్ మాత్రం ఆ పార్టీ సొంతం. అందుకే పవన్ ఈ విషయాన్ని గుర్తించి టీడీపీతో పొత్తుకు సంకేతాలిచ్చారు. కానీ టీడీపీ రాజకీయ ప్రయోజనాలను ఆశించి సైలెంట్ అయ్యింది.
Also Read: Adivi Sesh: ప్రేమించిన అమ్మాయి అలా చేసింది… పెళ్లి చేసుకునే ఆలోచన లేదన్న హీరో!
పెరిగిన గ్రాఫ్..
ఇటీవల జనసేన గ్రాఫ్ గణనీయంగా పెరిగింది. ఓటింగ్ శాతాన్ని సైతం పెంచుకుంది. గత రెండు ఎన్నికల్లో పవన్ పై అభిమానమున్నా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది విపక్షాలకు ఓటు వేశారు. అటువంటి వారంతా పశ్చాత్తాప పడుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఓటింగ్ కూడా పవన్ కు మళ్లినట్టు సంకేతాలు తెలుస్తున్నాయి. సమస్యలపై పోరాడుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు పవన్ మద్దతు ప్రకటించడం ఆయనకు కలిసి వచ్చే అవకాశం. తొలి నుంచి చంద్రబాబు అంటే ఆ వర్గాల్లో వ్యతిరేకత ఉంది. అలాగని జగన్ అన్యాయం చేయడంతో వారికి ఇప్పుడు పవన్ ప్రత్యామ్యాయంగా కనిపిస్తున్నారు. అందుకే వారంత గుంపగుత్తిగా జనసేనకు ఓట్లు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సగటున ఒక్కో నియోజకవర్గంలో 20 వేల ఓట్లకుపైగా జనసేనకు నిక్కచ్చి ఓట్లు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో టీడీపీ కానీ జనసేనను వదులుకుంటే బొక్కా బోర్లపడినట్టే.
Also Read: Singer Sunitha Daughter: సింగర్ సునీత కూతురిని చూశారా ఎంత అందంగా ఉందో… హీరోయిన్స్ ఏం సరిపోతారు!
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Pavan with people loss for tdp
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com