https://oktelugu.com/

Viral News : ఏకంగా తలనే మార్చేస్తారు.. ప్రపంచంలోనే తొలి ప్రాజెక్టు!

ఇక్కడ ఒకరి నుంచి తలను తీసి మరో రోబోటిక్ శరీరంలోకి మార్పిడి చేస్తారు. ఇది చూడడానికి హాలీవుడ్ రేంజ్ సన్నివేశంలా కనిపిస్తుంది. ఇలాంటి అత్యాధునిక శస్త్రచికిత్సపైనే న్యూరబుల్, ఎమోటివ్, కెర్నల్ అండ్ నెక్ట్స్ మైండ్, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్ వంటి కంపెనీలు వర్క్ చేస్తున్నాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 23, 2024 / 09:24 PM IST

    World's first human head transplant project launched

    Follow us on

    వైద్య పరిజ్ఞానం రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ వైద్యరంగంలో అనేక వ్యాధులకు చికిత్స చేస్తున్నారు. మరోవైపు అవయవాలను మార్పిడి చేస్తున్నారు. కళ్లు, చేతులు, కిడ్నీలు, గుండె, లివర్‌ ట్రాన్స్ ప్లాంటేషన్లు ఇప్పటికే జరుగుతున్నాయి. ఇటీవల జంతువుల అవయవాలను కూడా మనుషులకు అమర్చే ప్రయత్నం జరుగుతోంది. తాజాగా ఓ మెడికల్ స్టార్టప్ కంపెనీ ఏకంగా తలనే మార్చే శస్త్ర చికిత్సను అభివృద్ధి చేస్తోంది. ఇది సఫలమైతే చికిత్స లేని వ్యాధులతో పోరాడుతున్న రోగులకు కొత్త జీవితం అందించవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు.

    ఏంటా వైద్య విధానం..
    అమెరికాలోని బ్రెయిన్ బ్రిడ్జ్, న్యూరోసైన్స్, బయో మెడికల్ ఇంజనీరింగ్ స్టార్టప్ ప్రపంచంలోనే తొలిసారిగా తల మార్పిడి వ్యవస్థను అభివృద్ధి చేసే ప్రక్రియ చేపడుతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ కంపెనీ ఇప్పటికే రహస్యంగా ఈ ప్రయోగాలు చేస్తోంది. తాము చేస్తున్న ఈ సరికొత్త వైద్యం గురించి ప్రపంచం తెలుసుకోవాలన్న ఉద్దేశంతో అధికారికంగా ప్రకటించారు.

    కొత్త జీవితం అందించేందుకు..
    చికిత్స లేని, చేయలేని స్టేజ్ 4లో ఉన్న కేన్సర్, పక్షవాతం, అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి న్యూరోడెజనరేటివ్ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు కొత్త జీవితం అందించడమే లక్ష్యంగా ఈ ప్రయోగానికి నాంది పలికినట్లు బ్రెయిన్ బ్రిడ్జ్ స్టార్టప్ పేర్కొంది. చిత్త వైకల్యంతో బాధపడుతున్న రోగి తలను ఆరోగ్యకరమైన బ్రెయిన్డ్ డోనర్ బాడీతో మార్పిడి చేయడం ఈ సరికొత్త వైద్య విధాన ప్రక్రియలో ఉంటుంది.

    వీడియో వైరల్‌..
    తల మార్పిడి శస్త్రచికిత్సకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో సంచలనం రేకెత్తించింది. ఇందులో రెండు రోబోటిక్ బాడీలకు ఏకకాలంలో శస్త్ర చికిత్స చేస్తున్న రెండు స్వయం ప్రతిపత్త రోబోలు కనిపిస్తాయి. ఇక్కడ ఒకరి నుంచి తలను తీసి మరో రోబోటిక్ శరీరంలోకి మార్పిడి చేస్తారు. ఇది చూడడానికి హాలీవుడ్ రేంజ్ సన్నివేశంలా కనిపిస్తుంది. ఇలాంటి అత్యాధునిక శస్త్రచికిత్సపైనే న్యూరబుల్, ఎమోటివ్, కెర్నల్ అండ్ నెక్ట్స్ మైండ్, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్ వంటి కంపెనీలు వర్క్ చేస్తున్నాయి.

    వైద్య సరిహద్దులు చెరిపేసే ప్రాజెక్టు..
    నూతన శస్త్ర చికిత్స విధానంపై బ్రెయిన్ బ్రిడ్జ్‌లోని ప్రాజెక్ట్ లీడ్ హషేమ్ అల్-మైలీ ప్రాజెక్టు గురించిన కీలక విషయాలు వెల్లడించారు. తాము మెదడు కణాల క్షీణతను నివారించేలా అతుకులు లేకుండా తల మార్పిడి చేసేందుకు హైస్పీడ్ రోబోటిక్ సిస్టం వినియోగించేలా ప్లాన్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఉన్న అధునాతన ఏఐ అల్గారిథమ్‌లు శస్త్ర చికిత్సలో నరాలు, రక్తనాళాలతోపాటు వెన్నుపాముని కచ్చితంగా తిరిగి కనెక్ట్ చేయడంలో రోబోలకు మార్గనిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును విస్తృతమైన శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా రూపొందించమని చెప్పారు. ఇది సక్సెస్‌ అయితే వైద్య సరిహద్దులను చెరిపేస్తుందన్నారు. ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న వారి ప్రాణాలను రక్షించడంతోపాటు వినూత్న పరిష్కారాలు అందిస్తుందని తెలిపారు.