Wives Pocket Money: ఉద్యోగం పురుష లక్షణం అనేది పెద్దలు చెప్పిన మాట. ఒకప్పుడు ఇదే ఫాలో అయ్యేవారు. పురుషులు పనిచేసి సంపాదిస్తే.. మహిళలు ఇంటి బాధ్యతలు చూసుకునేవారు. పురుషులు ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బును ఇంట్లోని ఆడవారికి ఇస్తే.. వారు పొదుపుగా ఖర్చు చేసి, మిగిలింది ఆదా చేసేవారు. కానీ ఇప్పుడు పెరిగిన ఖర్చులు, ఇంటి అద్దెలు, ఫీజులు తదితర కారణాలతో ఇంట్లో ఒకరు ఉద్యోగం చేస్తే ఇల్లు గడిచే పరిస్థితి లేదు. దీంతో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. ఒకరికి ఒకరు చేదోడుగా ఉంటున్నారు. పిల్లలకు ఇబ్బందులు రాకుండా, ఆర్థికంగా స్థిరంగా ఉండేందుకు ఇద్దరూ కష్టపడుతున్నారు. పిల్లలు అడిగింది కాదనకుండా ఇస్తున్నారు. ఇక ఈ రోజుల్లో పాకెట్ మనీ తల్లిదండ్రులిద్దరూ ఇస్తున్నారు. సంపాదిస్తున్నారు. కాబట్టి పిల్లల కన్నా ఎక్కువ ఏం కాదు అన్నది వారి ఆలోచన. తమ పిల్లలు ఇతరుల ముందు చిన్నబుచ్చుకోవద్దని ఇలా చేస్తున్నారు. చదువులకు అవసరమైన పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు ఇతర స్టేషనరీ సామగ్రి కొనుగోలు చేసుకోవడానికి ఈ పాకెట్ మనీ ఉపయోగపడుతుంది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇందుకు భిన్నంగా ఓ దేశంలో భార్యలు.. భర్తలకు పాకెట్ మనీ ఇస్తున్నారు. ఎప్పటి నుంచో ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.
ఎక్కడంటే..
జపాన్‌లోని ఓ ప్రాంతంలో భర్తలు సంపాదించే మొత్తం డబ్బులను భార్యల చేతిలో పెడతారట. స్త్రీలు ఆ డబ్బును ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, సేవింగ్స్ వంటి విషయాలకు ఉపయోగిస్తూ వాటిలో నుంచి నెలనెలా తమ భర్తలకు పాకెట్‌మనీ ఇస్తున్నారు. ఇక భర్త ఖర్చులకు భార్య ఎంత ఇస్తే అంతే సరిపెట్టుకోవాలి. ఇంకా కావాలని అడగరు. ఈ సంప్రదాయాన్ని జపాన్లో ’కాజుకై’ అని అంటారు. మన దేశంలోనూ ఇలాంటి సంస్కృతి కొన్ని ప్రాంతాలో ఉంది. భర్తలు సంపాదించిన మొత్తం భార్యల చేతిలోపెడతారు. తర్వాత భర్తలు తమకు అవసమైన డబ్బులు అడిగి తీసుకుంటారు. సరిపోకుంటే ఎక్కువ అడుగుతారు. భార్యలు కూడా ఎంత అవసరం అని అడిగి మరీ ఇస్తారు. ఇక కొందరు భర్తలు ఏ పనీ చేయకుండా భార్యలపైనే ఆధారపడి జీవిస్తారు. వారు ఇచ్చే డబ్బులతోనే సొంత అవసరాలు తీర్చుకుంటుంటారు. జపాన్‌లో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.
74 శాతం మహిళలు ఇంట్లోనే..
ఇటీవల విడుదలైన ఓ నివేదిక ప్రకారం, జపాన్‌లో 74 శాతం మంది మహిళలు ఇంటి పనులు చూసుకుంటారు. భర్తలు ఇచ్చే డబ్బులను ఇంటి అవసరాలకు సర్దుబాటు చేస్తారు. ఆదా కూడా చేస్తున్నారు. ఇక ఇక్కడ భర్తలు భార్యలకు డబ్బులు ఇవ్వడానికి మూడు కారణాలు ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.
1. పురుషులు ఉద్యోగ బాధ్యతలు తీసుకుంటే స్త్రీలు ఇంటి ఆర్ధిక నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలనేది వారి సంప్రదాయం
2. సంపాదించిన డబ్బు అంతా భార్యకు ఇవ్వడం వల్ల వైవాహిక బంధంలో భార్యాభర్తల మధ్య నమ్మకం, పారదర్శకత పెరుగుతుంది.
3. ఇంటి బడ్జెట్ను నిర్వహించడంలో స్త్రీలకు బాధ్యతనివ్వడం వల్ల అనవసర ఖర్చులు నివారించడానికి
హోం మినిస్టర్‌గా..
ఇక మన తెలుగు రాష్ట్రాల్లో మహిళలను హోం మినిస్టర్‌గా అభివర్ణిస్తారు. భర్తలు సంపాదించే డబ్బులను వారికే ఇస్తారు. వారు ఇంటి అవసరాలు తీర్చడంతోపాటు పొదుపు, పిల్లల ఫీజులు, ఇంట్లో సరుకులు, బిల్లుల చెల్లింపు, భర్తకు అవసరమైన సహాయం వంటివి చేస్తుంటారు. అందుకే చాలా మంది భర్తలు భార్యలను హోం మినిస్టర్‌గా చెప్పుకుంటారు. తమ ఫోన్లలో కూడా చాలా మంది హోం మినిస్టర్‌గానే పేర్లు ఫీడ్ చేసుకుంటారు.