Kailasa mountain : హిమాలయ పర్వతాలకు సమీపంలో ఉన్న రాష్ట్రాలలో ఉత్తరఖాండ్ ప్రత్యేకమైనది. ఈ రాష్ట్రాన్ని దేవ భూమిగా పిలుస్తారు. అమర్ నాథ్ యాత్ర ఈ రాష్ట్రం మీదుగానే సాగుతుంది. అయితే ఈ రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్న ఎవరెస్టు, కాంచన గంగ.. ఇతర పర్వతాలను అధిరోహించే యాత్రికులు.. కైలాస యాత్ర పరిధిలోని పర్వతాలపై అడుగు పెట్టేందుకు సాహసించడం లేదు..
రష్యా యాత్రికుడు వెనక్కి తిరిగి వచ్చాడు
గతంలో ఓ రష్యా యాత్రికుడు ఆ పర్వతాలను ఎక్కేందుకు ప్రయత్నించాడు. దూరం వెళ్లగా.. అతడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. ఆ తర్వాత కాళ్లు చేతులు ముందుకు సాగలేదు.. దీంతో అతడు వెనక్కి తిరిగి వచ్చేసాడు. ఇలాంటి అనుభవమే చాలామంది యాత్రికులకు ఎదురు కావడంతో.. కైలాస యాత్ర శ్రేణిలోని పర్వతాలను అధిరోహించాలంటేనే యాత్రికులు భయపడుతున్నారు..
ఓం ఆకారంలో కనిపిస్తాయట..
కైలాస యాత్ర పరిధిలోని ఎనిమిది పర్వతాల సమూహాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఓం ఆకారంలో కనిపిస్తాయని ప్రచారంలో ఉంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోర్ ఘర్ జిల్లాలోని కైలాస్ మానస సరోవర్ యాత్ర మార్గం మధ్యలో ఉన్న ఓం పర్వతంపై నిత్యం మంచు కురుస్తూనే ఉంటుంది. కాలాలతో సంబంధం లేకుండా మంచు కురవడాన్ని చూసి ఆ ప్రాంతానికి వెళ్లే యాత్రికులు ఆశ్చర్యానికి గురవుతుంటారు..
ఆశ్చర్యాన్ని కలిగించే గణేశుడి ఆకారం
కైలాస యాత్రలో జియో లింగ్ కాంగ్ ముందు గణేష్ పర్వతం ఉంటుంది. ఇందులో మంచు కురవడం తగ్గినప్పుడు గణేశుడి ఆకారం కనిపిస్తుంది. ఈ పర్వతం ముందు గణేష్ పేరుతో నాలా కూడా ఉంది. జూన్, జూలై నెలలో గణేశుడి ఆకారం అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ ఆకారం ఎందుకు ఏర్పడుతోందనే దిశగా పరిశోధనలు సాగినప్పటికీ.. అది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.
గ్రామం మొత్తం నాశనమైంది
ఇక కైలాస యాత్ర మార్గంలో మల్ఫా అనే ప్రదేశం ఉంది. కానీ ఇప్పుడు ఆ గ్రామం ఉనికిలో లేదు. 1998 వర్షాలతో కొండ చరియలు విరిగిపడి ఆ గ్రామం మొత్తం శిధిలాల కింద కూరుకుపోయింది. ఆ ప్రమాదంలో మొత్తం 300 మంది చనిపోయారు..
ఎవరు సాగు చేయకుండానే వరి
14 వేల అడుగుల ఎత్తులో ఉన్న కైలాస పర్వతానికి సమీపంలో వరి కనిపిస్తుంది. వాస్తవానికి ఆ ప్రాంతంలో ఎవరు కూడా వరి సాగు చేయరు. ఆ ప్రాంతంలో వరి దానంతట అదే పెరుగుతుంది. అజ్ఞాతవాసం సమయంలో పాండవుల్లో ఒకరైన భీముడు ఈ ప్రదేశంలో వరిని సాగు చేశాడని స్థానిక ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటారు. ఈ ప్రదేశంలో ప్రతి ఏడాది వరి ఏపుగా పెరుగుతూ ఉంటుంది..
పాండవుల బస
కైలాస యాత్రలో పాండవులు బస చేసిన భవనం తాలూకు అవశేషాలు ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటాయి.. కైలాస యాత్ర చివరి గ్రామమైన కుటీ లో ఇది కనిపిస్తుంది. ఈ ప్రదేశానికి పాండవుల తల్లి కుంతి పేరును పెట్టారు. ఇక్కడ ఆమెకు విగ్రహం ఏర్పాటు చేసి పూజలు చేస్తుంటారు. కుటి గ్రామం ముందు ఒక చిన్న ద్వీపం ఉంటుంది. అయితే ఈ ద్వీపంలోకి బయట వ్యక్తులకు ప్రవేశం నిషిద్ధం.
కుంతికి అమరత్వసిద్ధి లభించింది
ఈ ప్రాంతంలో పాండవులు ఒక రాజభవనాన్ని నిర్మించి, అక్కడే చాలాకాలం పాటు ఉన్నారని స్థానికులు చెబుతుంటారు. ఆ తర్వాత వారంతా కైలాసానికి వెళ్లిపోయారని అంటున్నారు. కుంతీ ఈ గ్రామంలోనే తన జీవితాన్ని త్యాగం చేసిందని.. ఆమెకు ఇక్కడే అమరత్వసిద్ధి లభించిందని అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.