Idiot Syndrome: ఇంటర్నెట్ చౌకగా అందుబాటులోకి వచ్చాక, ఆన్‌డ్రాయిడ్ ఫోన్లు అరచేతిలో ఉన్నాక.. చిన్న పిల్లల నుంచి ఆరు పదులు దాటిన వృద్ధుల వరకు అందరూ గూగుల్‌నే నమ్ముకుంటున్నారు. ప్రతీ విషయానికి గూగుల్‌పైనే ఆధారపడుతున్నారు. తమకు కావాల్సిన ప్రతీ సమాచారాన్ని గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. సమాచార సేకరణ వరకు ఎలాంటి సమస్య లేదు.
వైద్యం, చికిత్స..
కొందరు గూగుల్‌ను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. అనారోగ్య సమస్యలకు చిట్కాలు వెతుకుతున్నారు. చికిత్స పద్ధతులు తెలుసుకుంటున్నారు. కొందరు వైద్య సిబ్బంది అయితే గూగుల్‌లో చూసి రోగులకు, రోగాలకి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ఇలా గూగుల్ డాక్టర్లుగా మారుతున్నారు.
ఇదే ఇడియట్ సిండ్రోమ్..
ఇలా వైద్యం కోసం డాక్టర్‌ను సంప్రదించకుండా అతిగా ఇటర్నెట్‌పై ఆధారపడే లక్షణాన్నే ఇడియట్ సిండ్రోమ్‌గా పేర్కొంటున్నారు. ఇంటర్నెట్ డిరైవ్డ్ ఇన్ఫర్మేషన్ అబ్ స్ట్రక్షన్ ట్రీట్‌మెంట్ అని పూర్తి అర్థం. దీనిని సైబర్ క్రోండియా అని కూడా పిలుస్తారు. ఇక సింపుల్‌గా చెప్పాలంటే అనారోగ్య లక్షణాలను ఇంటర్నెట్‌లో లభించే సమాచారంతో పోల్చుకోవడం.
పెరుగుతున్న బాధితులు..
అర చేతిలో ఫోన్ ఉంటే చాలు.. ఏ సమస్య వచ్చినా గూగుల్‌లో సెర్చ్ చేయడం చాలా మందికి అలవాటుగా మారింది. దీంతో ఇడియట్ సిండ్రోమ్ మాధితులు క్రమంగా పెరుగుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. ఇలా గూగుల్ తల్లిని నమ్ముకునేవారు తమకు తాము మేలుకన్నా కీడే ఎక్కువగా చేసుకుంటున్నట్లు అధ్యయనం తెలిపింది. వీరు ఆన్‌లైన్ సమాచారంతో స్వీయ చికిత్స చేసుకుంటున్నారని పేర్కొంది. కొందరైతే డాక్టర్లు ప్రిస్కిప్షన్‌లో సూచించిన వైద్యాన్ని పక్కన పడేసి గూగుల్ తల్లినే నమ్ముకుంటున్నారు. ఇది చాలా ప్రమాదమని అధ్యయనం తెలిపింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కు చెందిన క్యూరియస్‌లో ఇడియట్ సిండ్రోంపై అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి.