Walking : పాటల విషయంలో, వస్తువుల విషయంలో, ఫుడ్ విషయంలో ఇలా చాలా విషయాల్లో కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. ప్రస్తుతం ఎక్కడికి వెళ్లాలి అన్నా సరే ఇంటికి ఒక బైక్, లేదా కార్ వంటివి ఉన్నాయి. ఇక రోడ్డు మీద బస్ లు, రైల్వే ట్రాక్ లు, విమానాలు చాలా ఉన్నాయి. పైసామే పరమాత్మ అన్నట్టుగా డబ్బులను బట్టి లగ్జరీగా ఉండవచ్చు. కానీ పూర్వం మన భారత దేశంలో ఎవరు ఎక్కడికి వెళ్ళలనుకున్నా కాళ్లతో నడుస్తూనే వెళ్లేవారు. మరి నడవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
రాను రాను నడక పూర్తిగా తగ్గిపోయింది. కేవలం వాకింగ్, జాగింగ్ చేసేవారు మాత్రం పెరిగిపోతున్నారు.అయితే వీటికోసం కూడా ఎన్నోరకాల చెప్పులు, షూస్ అందుబాటులోకి వచ్చాయి.అవసరానికి అనుగుణంగా చెప్పులు, షూలు వచ్చాక డబ్బులు పెట్టి అందమైనవి కూడా కొంటున్నారు. ఇదిలా ఉంటే కాలి నడక ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ట్రెండ్ గా మారింది. ఒక వ్రతం లాగా దీన్ని పాటిస్తున్నారు అంటే నమ్ముతారా?. కొందరు మార్నింగ్ వాక్ కోసం కాలి నడకని ఎంచుకుంటే.. మరికొందరు చెప్పులు లేకుండా నడవాలి అని కోరుకుంటున్నారు.
మన దగ్గర ఇప్పటికే ఇలా చాలా మంది అలవాటు చేసుకున్నారు. ఆరోగ్యం కోసం చాలా మంది పాత పద్దతులనే వాడుతున్నారు. ఇందులో భాగంగా చెప్పులు లేకుండా భూమి స్పర్శను పొందడం అనేది మెల్లిమెల్లిగా మన దేశంలో చాలా మంది అలవాటు చేసుకుంటున్నారు. సామాన్య ప్రజలు మాత్రమే కాదు ప్రముఖులు కూడా ఇదే పని చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీలు పాదాలతో నడవడం గమనిస్తే ఈ విషయం చాలా అర్థం అవుతుంది. ఇలా ఎవరు ఎక్కడ చెప్పులు లేకుండా నడిచినా వాటి ఉపయోగాలు మాత్రం చాలా ఉన్నాయి అంటున్నారు నిపుణులు.
ప్రకృతి స్పర్శను అనుభవించాలి అంటే నేలను తాకాలట. నేల తగిలేలా కాలు కింద పెట్టి భూమికి ఉన్న రకరకాల స్వభావాలు తాకుతూ ఉంటే ప్రకృతితో ఒక బంధం ఏర్పడుతుంది అంటారు ప్రకృతి ప్రియులు. కాలి నడక వల్ల భూమిలోని నెగిటివ్ ఎనర్జీ శరీరంలోకి ప్రవేశిస్తాయి. మన నిత్యం వాడే ఎలక్ట్రానిక్ పరికరాల వల్ల శరీరంలో పేర్కొన్న అయాన్లను ఇవి బ్యాలెన్స్ చేస్తాయి అంటున్నారు నిపుణులు. ఇలా బ్యాలెన్స్ అవడం వల్ల శరీరంలో ఉన్న వాపులు తగ్గుతాయట. ఇలా జరగడం వల్ల నిద్ర కూడా బాగా పడుతుందట.
చెప్పులు లేకుండా నడవడం వల్ల పాదాలలో ఉండే నరాలు క్రమబద్దంగా తాకిడికి గురై దానివల్ల ఒత్తిడి దూరమయ్యే ఛాన్స్ కూడా ఉందట. శరీరం పూర్తిగా సేద తీరిన భావన కలుగుతుంది.ఇలా నడవడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. పాదంపై ఒత్తిడి పెంచడం వల్ల రక్తప్రసరణలో చురుకుతనం వస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యం కూడా పదిలంగా ఉంటుంది.