Tiger: ఒక వాహనదారుడు కి ఒక భారీ జంతువు కనిపించింది. ఆ వాహనం లైట్ల వెలుగులో చూడగానే భారీ ఆకారంలో పెద్దపులి.. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. వెంటనే తమ వాహనాలను వెనక్కి మళ్లించారు. ఆ పెద్దపులి అటు ఇటు చూస్తూ.. ఆ రోడ్డును దాటింది. దీనిని కొంత మంది తమ ఫోన్లలో వీడియోలు తీశారు. వాటిని కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియోలు ఒక్కసారిగా వైరల్ గా మారిపోయాయి. ఆ పెద్దపులి చాలా గంభీరంగా ఉంది. పదునైన చూపుతో ప్రయాణికులను చూస్తూ.. ఘాట్ రోడ్డును దాటింది. చుట్టూ దట్టమైన అడవులు ఉండడంతో ప్రయాణికులు పెద్దగా కేకలు వేయకుండా.. వెనక్కి వెళ్లారు. పులి రోడ్డు దాటేవరకు నిశ్శబ్దంగా ఉన్నారు. తమ వాహనాలను అక్కడికక్కడే నిలిపివేశారు. ఆ పులి ఆ చీకట్లో ఘాట్ రోడ్డు దాటి ఆ అడవుల్లోకి వెళ్లిపోయింది.
ఆహార అన్వేషణ కోసం
శీతకాలం మొదలైతే చాలు పులులు ఆహార అన్వేషణ కోసం బయలుదేరుతాయి. వాన కాలంలో వాటికి ఆహారపరంగా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఆ సమయంలో జంతువులు అడవులను మాత్రమే అంటిపెట్టుకొని ఉంటాయి కాబట్టి పనులకు ఆహారం విషయంలో ఆటంకాలు ఎదురు కావు. శీతాకాలం మొదలైన తర్వాత.. జంతువులు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతాయి. ఆ సమయంలో పులులకు ఆహారం లభించడం కష్టమవుతుంది. అలాంటి సమయంలో అవి ఆహార అన్వేషణ కోసం ఒక అడవి నుంచి మరొక అడవికి వెళ్తాయి. పొరపాటున కూడా ఇతర పులుల సామ్రాజ్యాలలోకి అడుగుపెట్టవు. వాటి వాటి పరిధిలోనే తిరుగుతూ.. ఆహారాన్ని అన్వేషించుకుంటాయి. వేట ముగించిన తర్వాత.. కడుపునిండా తిన్న తర్వాత.. విశ్రాంతి కోసం పులులు వెళ్లిపోతాయి. గుహలలో సేద తీరుతాయి. ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో వేటకు ఉపక్రమించవు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ – ఆదిలాబాద్ రోడ్డుపై కనిపించిన పులి ఆహార అన్వేషణ కోసమే ఘాట్ రోడ్డు దాటిందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ” పులి ఘాట్ రోడ్డు దాటింది. కొంతకాలంగా అది ఆహార అన్వేషణలో భాగంగా అటు ఇటు తిరుగుతోంది. అందువల్లే అది బయటికి వచ్చింది. ఆ సమయంలో ప్రయాణికులు గోల చేయలేదు. అందువల్ల ఆ పులి తన మానాన తాను వెళ్లిపోయిందని” అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. గత కొంతకాలంగా నిర్మల్ జిల్లాలో పులుల సంఖ్య పెరుగుతోందని.. మహారాష్ట్ర ప్రాంతం నుంచి పులులు ఆహార అన్వేషణ కోసం ఇక్కడికి వస్తున్నాయని.. ఆదివారం కనిపించిన పెద్దపులి మాత్రం తెలంగాణ ప్రాంతానికి చెందినదేనని.. పులుల సంరక్షణ కోసం సీసీ కెమెరాలు, నీటి గుంతలు, చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసినట్టు అటవీశాఖ అధికారులు వివరిస్తున్నారు.