Coldest place on Earth: ఈ భూమి మీద అత్యంత శీతల ప్రాంతం ఏదనే ప్రశ్న వస్తే.. వెంటనే అంటార్కిటికా అని చెప్పేస్తాం. కానీ అంతకుమించిన శీతల ప్రాంతం ఈ భూమి మీద ఉంది.. ఆ ప్రాంతంలో నీరు కూడా గాలిలో మంచుగా మారుతుంది. ఉదాహరణకి మీ చేతిలో ఒక బాటిల్లో వాటర్ ఉంటే.. ఆ నీటిని గనక గాలిలో వదిలితే అది భూమిని చేరే సమయానికి మంచుగా మారిపోతుంది. దీనినిబట్టి అక్కడ ఉష్ణోగ్రత ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి శీతల ప్రాంతం ఎక్కడ ఉంది? ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత ఏ స్థాయిలో నమోదవుతుంది? అక్కడ ఎవరైనా మనుషులు జీవిస్తున్నారా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.
రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఓమ్యా కోన్ అనే ప్రాంతం ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత శీతలమైన ప్రాంతంగా పేరు పొందింది. చలికాలంలో ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత -50 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటుంది. ఈ ఏడాది జనవరిలో ఈ ప్రదేశంలో -67.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. ఇప్పటివరకు నమోదైన అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలలో ఇది ఒకటి. ఈ గ్రామంలో మంచు తుఫాన్లు సర్వసాధారణంగా వస్తూనే ఉంటాయి. చెట్లు మొత్తం మంచుతో కనిపిస్తాయి. ఇక్కడ గాలులు కూడా అత్యంత శీతలంగా ఉంటాయి. దీంతో ఇక్కడి ప్రజలు ప్రత్యేకమైన దుస్తులు.. జంతువుల రోమాలతో తయారుచేసిన స్వెటర్లు.. ఎంత మందమైన బూట్లను ఉపయోగిస్తారు. ఇక్కడ నీరు సరఫరా అయ్యే పైపులు కూడా మంచుతో నిండి ఉంటాయి. ఎప్పటికప్పుడు మంచును కలిగించి ప్రజలు తాగునీటిని సిద్ధం చేసుకుంటారు..
ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు -52 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే పాఠశాలలను మూసివేస్తారు. ఇక్కడి ప్రజల జీవనశైలి విభిన్నంగా ఉంటుంది. వారు అత్యంత కఠినమైన శీతాకాలాన్ని కూడా గొప్పగా భావిస్తుంటారు. ఆ కాలాన్ని తన జీవన సంస్కృతిలో ఒక భాగంగా పేర్కొంటారు.. వ్యవసాయం, చేపల వేట, మాంసం విక్రయించడం, ఇతర వృత్తుల ద్వారా ఇక్కడ ప్రజలు ఉపాధి పొందుతుంటారు.. ఇంతటి శీతల ప్రాంతంలో నివాసం ఉండడం ఎందుకు అని స్థానికులను ప్రశ్నిస్తే.. తాము పుట్టిన ప్రాంతాన్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేదని అక్కడి వారు చెబుతుంటారు. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి పర్యాటకులు వేసవికాలంలో ఎక్కువగా వస్తూ ఉంటారు. వేసవికాలంలో కూడా ఇక్కడ ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువగా నమోదు అవుతుంటాయి. ముఖ్యంగా హిమపాతం ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూపిస్తూ ఉంటుంది. యూరప్ సంస్కృతి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది.
Also Read: మన ఇండియాలో మరో గోవా..
శీతల ప్రాంతం కావడంతో శరీరంలో వెచ్చదనాన్ని పెంపొందించుకోవడానికి ఇక్కడి ప్రజలు ఎక్కువగా వైన్ తాగుతుంటారు. మాంసాన్ని కాల్చి తింటారు. ప్రతి ఇంట్లో వేడిగాలులను ఉత్పత్తి చేస్తే యంత్రాలు ఉంటాయి. గదులలో ఉష్ణోగ్రతను పెంచడానికి ప్రత్యేకంగా చిమ్నీలు ఉంటాయి. వీటిల్లో వంట చెరుకు వేసి తరచూ మంటలు మండిస్తుంటారు. ఈ బొగ్గుల వేడికి ఉష్ణోగ్రత గదులలో స్థిరంగా ఉంటుంది. మంచు తుఫాన్లు ఏర్పడినప్పుడు.. ప్రజలు ఏమాత్రం బయటికి రారు. ఆ సమయంలో పాఠశాలలు తెరుచుకోవు. ఈ ప్రాంతానికి వచ్చే మార్గాలు కూడా మంచుతో కప్పి ఉంటాయి. ఆ సమయంలో ఈ ప్రాంతం హిమనగిరి లాగా కనిపిస్తుంది.. పర్యాటకంగా కూడా ఈ ప్రాంతానికి ఆదాయం భారీగానే వస్తుంది. అంటార్కిటికా కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ ఇక్కడ ప్రజలు నివసించడం విశేషం. అయితే ఈ ప్రాంతంలో ఈ స్థాయిలో మంచు ఎందుకు కురుస్తోంది? ఎందుకు వాతావరణంలో ఇంతటి వైవిధ్యం ఉంది? అనే విషయాలను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఇక్కడ కొంతకాలంగా ప్రయోగాలు చేస్తున్నారు.