Divorce Celebrations : మారుతున్న కాలానికి అనుగుణంగా వివాహ వ్యవస్థలకు కూడా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అయితే ఇప్పుడు వివాహం తో పాటు విడాకులు కూడా పెరిగిపోతున్నాయి. ఆ మధ్య ఝార్ఖండ్ రాష్ట్రంలో తన కూతురికి విడాకులు మంజూరు కావడంతో.. దాన్ని ఒక భారీ వేడుక లాగా ఆమె తండ్రి నిర్వహించాడు. డప్పు చప్పులతో ఆమెను ఊరేగింపుగా తన ఇంటి వద్దకు తీసుకొచ్చాడు. ఇక హర్యానా రాష్ట్రంలో ఓ యువకుడు తన భార్యతో విడాకులు తీసుకున్న అనంతరం.. ఆమె లాంటి విగ్రహాన్ని తయారుచేసి.. ఆమె ముందు తన స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోవాలే గాని ఎన్నో ఉదాహరణలున్నాయి. మరెన్నో ఉదంతాలున్నాయి. స్థూలంగా చెప్పాలంటే ఒక పట్లగా వివాహ వ్యవస్థ బలంగా లేదు. ఆ వ్యవస్థ లో.. ఆ బంధంలో ఇమిడిపోవాలని కొంతమంది కోరుకోవడం లేదు. కడదాకా కలిసి ఉండాలని కోరుకుంటున్నారు.. పెద్దలు కుదుర్చిన బంధం ద్వారా ఒకటైన వారు.. ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు.. చివరిదాకా కలిసి ఉండడం లేదు. అభిప్రాయ బేధాలు లేదా సర్దుకుపోయే తత్వం లేకపోవడం.. కారణాలు ఏవైనా విడిపోవాలని నిర్ణయించుకుంటున్నారు. బంధాన్ని బలంగా ఉంచుకోవాల్సిన చోట “బ్రేకప్” అని ఎవరికివారు విడిపోతున్నారు. అయితే విడిపోవడానికి బాధాకరమైన సందర్భంగా ఇప్పటి తరం భావించడం లేదు. అంతేకాదు విడాకులు తీసుకున్న తర్వాత .. దానిని ఒక వేడుకలాగా జరుపుకుంటున్నారు. ఇలా విడిపోయిన వారు సామాజిక మాధ్యమాలలో బృందాలుగా ఏర్పడుతున్నారు..”కలిసి జీవించే పరిస్థితి లేదు. అందువల్ల విడిపోతున్నారు.. అందువల్లే ఇలా బృందాలుగా ఏర్పడి.. తమ బాధను ఇతరులతో పంచుకుంటున్నారు. మానసిక రుగ్మతల బారిన పడకుండా.. జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది
పల్లవి బర్నివాల్.. ఈమె టెలిగ్రామ్ లో విడాకులు తీసుకున్న వారితో ఒక గ్రూప్ నిర్వహిస్తోంది. ఆ గ్రూప్ కు ఈమె అడ్మిన్. ” ఎంతో గొప్పగా ఊహించుకున్నప్పటికీ.. కొంతమంది వివాహ బంధం బ్రేకప్ అవుతుంది. అలాంటప్పుడు విడిపోవడమే మంచిది. ఆ వేదన నుంచి త్వరగా బయటపడాలంటే పార్టీ చేసుకోవాలి. విడాకుల ద్వారా ఆ టాక్సిక్ రిలేషన్ నుంచి బయటికి రావాలి. సమాజం కోసం భయపడొద్దు. ఇంకొకరి కోసం ఏడవద్దు. ఆ బాధ నుంచి బయటపడాలంటే కచ్చితంగా పార్టీ చేసుకోవాలని” పల్లవి చెబుతోంది.. విడాకుల పార్టీ అనేది మొదట్లో మెట్రో నగరాలలో కనిపించేది. ఇప్పుడు పట్టణాలకు విస్తరించింది. గ్రామాల్లోకి ఇంకా చేరలేదు కాని.. రాబోయే రోజుల్లో విడాకుల పార్టీ కూడా జరిగే అవకాశాలు లేక పోలేదని క్లినికల్ సైకాలజిస్ట్ లు చెప్తున్నారు. ” విడాకులు అంటే విడిపోవడమే కాదు.. అది మరో కొత్త జీవితాన్ని ఆరంభం. విడాకులు తీసుకున్నవారు మానసిక ఒత్తిడికి గురికావద్దు. వారిని వారు స్వేచ్ఛ జీవులు లాగా భావించుకోవాలి. కొత్త అధ్యాయాలను ప్రారంభించాలి. వారిని వారు కొత్తగా ఆవిష్కరించుకోవాలని” సైకాలజిస్ట్ లు చెబుతున్నారు.
పార్టీ ఇలా చేసుకుంటున్నారు..
విడాకుల పార్టీలోను ప్రత్యేక నిబంధనలను పాటిస్తున్నారు. విడాకుల పార్టీ సమయంలో ఉమ్మడి స్నేహితులకు అవకాశం ఇవ్వడం లేదు. ఆ పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. పాత బంధానికి గుర్తులుగా ఉన్న వాటిని తొలగిస్తున్నారు. తమ స్వీకరించిన బహుమతులను పక్కన పడేస్తున్నారు.. విడాకులు అనంతరం సోలో గా బతకాలని భావిస్తున్నారు. దేశాలు మొత్తం చుట్టాలని వాగ్దానం చేస్తున్నారు. నచ్చిన ఉద్యోగం చేయాలని ప్రతిజ్ఞ చేస్తున్నారు.