Japan Cat Facts : ఏదైనా పనికి వెళ్తుంటే పిల్లి అడ్డొస్తే మనకు కీడు.. జపనీయులకు మాత్రం మహా అదృష్టం..

చైనాలో లాఫింగ్ బుద్ధ ను అక్కడి ప్రజలు ఆరాధిస్తుంటారు. ఆ ప్రతిమను ప్రతి చోట పెట్టుకుంటారు. దానివల్ల సానుకూల దృక్పథం పెరుగుతుందని చైనీయులు నమ్ముతుంటారు. అలాగే జపాన్ లోనూ ప్రతి ఇంట్లోనూ పిల్లి ప్రతిమ కనిపిస్తుంది. దుకాణాలు, రెస్టారెంట్లు, ప్రైవేట్ కార్యాలయాలు, ప్రభుత్వ ఆఫీసులలోనూ పిల్లి ప్రతిమలు దర్శనమిస్తుంటాయి. పిల్లిని జపనీయులు అదృష్ట దేవతగా భావిస్తుంటారు

Written By: Anabothula Bhaskar, Updated On : July 27, 2024 1:58 pm
Follow us on

Japan Cat Facts : ఏదైనా పనిమీద మనం బయటికి వెళ్తుంటే.. హఠాత్తుగా పిల్లి ఎదురయిందనుకోండి.. ఏం చేస్తాం.. వెంటనే నాలుగు అడుగులు వెనక్కి వేస్తాం. కాసేపైన తర్వాత మళ్లీ మన పని ప్రారంభిస్తాం. ఎందుకంటే మన తాతల కాలం నాటి నుంచి పిల్లి ఎదురైతే చాలు కీడు అనే భావన మనలో పేరుకుపోవడమే. పిల్లి మాత్రమే కాదు, కుక్క గట్టిగా అరిచినా, కాకులు మన ఇంటి వైపు చూసినా, గుడ్లగూబలు మన ఇంటి చెట్ల కొమ్మలపై వాలినా కీడుకు సంకేతాలే అని భావిస్తాం. ఎందుకైనా మంచిదని పూజలు జరిపిస్తుంటాం. అక్కడిదాకా ఎందుకు ఇంట్లో బల్లుల బెడద ఎక్కువగా ఉన్నా.. వాటిని కనీసం చంపను కూడా చంపం. ఎందుకంటే బల్లులను చంపితే మహా కీడని మనలో అనాదికాలం నుంచి ఒక భావన పేరుకుపోవడమే. కానీ ఇదే జపాన్ లో మాత్రం ఇందుకు విరుద్ధమైన పరిస్థితులు ఉంటాయి. ఇంతకీ వారి నమ్మకాలు ఏ విధంగా ఉంటాయంటే..

చైనాలో లాఫింగ్ బుద్ధ ను అక్కడి ప్రజలు ఆరాధిస్తుంటారు. ఆ ప్రతిమను ప్రతి చోట పెట్టుకుంటారు. దానివల్ల సానుకూల దృక్పథం పెరుగుతుందని చైనీయులు నమ్ముతుంటారు. అలాగే జపాన్ లోనూ ప్రతి ఇంట్లోనూ పిల్లి ప్రతిమ కనిపిస్తుంది. దుకాణాలు, రెస్టారెంట్లు, ప్రైవేట్ కార్యాలయాలు, ప్రభుత్వ ఆఫీసులలోనూ పిల్లి ప్రతిమలు దర్శనమిస్తుంటాయి. పిల్లిని జపనీయులు అదృష్ట దేవతగా భావిస్తుంటారు. అందుకే అక్కడ పలు ప్రాంతాలలో పిల్లి కోసం ఆలయాలను కట్టించారు.

జపాన్ లోని అనేక ప్రాంతాలలో చిన్న పిల్లి బొమ్మ దర్శనమిస్తూ ఉంటుంది. దానిని చూస్తే మనల్ని పిలుస్తున్నట్టుగా ఉంటుంది. ఈ పిల్లి ప్రతిమ ఏర్పాటు చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని, వ్యాపారం లాభసాటిగా జరుగుతుందని, సానుకూల దృక్పథం పెరుగుతుందని జపనీయులు నమ్ముతుంటారు. అయితే ఈ పిల్లి ప్రతిమలను జపాన్లో సెరామిక్, ప్లాస్టిక్ వంటి పదార్థాలతో తయారు చేస్తుంటారు. జపాన్ రాజధాని టోక్యోకు సమీపంలో పెళ్లికి పెద్ద ఆలయాన్ని కూడా నిర్మించారు. ఈ ఆలయాన్ని ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శిస్తూ ఉంటారు.. తమ కోరికలు తీర్చాలని కోరుతుంటారు. అయితే పిల్లిని అదృష్ట దేవతగా జపనీయులు భావించడం వెనక పెద్ద కథ ఉంది.

కొన్ని వందల సంవత్సరాల క్రితం జపాన్లోని ఒక భూస్వామి పక్కనే ఉన్న గ్రామానికి ప్రయాణం చేస్తున్నాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత భారీ వర్షం కురవడం మొదలైంది. దీంతో అతడు తడవకుండా ఒక చెట్టు కింద తలదాచుకున్నాడు. కొంత సమయం గడిచిన తర్వాత ఒక పిల్లి తన కాలును పైకి లేపి పిలుస్తున్నట్టు అతడికి అనిపించింది. దీంతో అతడు చెట్టు కింద నుంచి ఆ పిల్లి ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ఒక్కసారిగా ఆ చెట్టుపై ఉన్నట్టుండి పిడుగు పడింది. దీంతో తనను పిడుగుపాటు నుంచి రక్షించిన ఆ పిల్లిని ఆ భూస్వామి దయవంగా భావించాడు. ఆ పిల్లి చనిపోయిన తర్వాత దాని జ్ఞాపకార్థం ఒక ఆలయాన్ని నిర్మించాడు. ఈ గుడిని జపాన్లో గోటో కూచి టెంపుల్ అని పిలుస్తారు. ఇప్పటికీ ఈ ఆలయం అలాగే ఉంది. ఈ ఆలయాన్ని సందర్శించే జపనీయులు ఒక పిల్లి బొమ్మను గుడి పరిసర ప్రాంతాల్లో పెడితే తమ కోరికలు నెరవేరుతాయి అని భావిస్తారు. ఇంకా కొంతమంది ఆ గుడి పక్కన ఉన్న బోర్డులపై తమ కోరికలను రాస్తారు. ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో వేలాది పిల్లి బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి.

Tags