Unusual ritual mystery incident: బలగం సినిమా చూశారా.. అందులో చనిపోయిన తమ తండ్రికి పిట్టకు వేస్తారు. ఇద్దరు కొడుకులు, కూతురి మధ్య సయోధ్య లేకపోవడంతో పిట్ట ముట్టడానికి రాదు. వండిన ఆహారం అలానే ఉండిపోతుంది. దీంతో ఇద్దరు సోదరులు, సోదరి తీవ్రంగా కలత చెందుతారు. చివరికి కలిసిపోతారు. ఫలితంగా పిట్ట ముడుతుంది. తెలంగాణలో ఏదో కల్చర్. ఆంధ్రాలో ఎలా ఉంటుందో తెలియదు గానీ.. దేశం మొత్తంలో తెలంగాణలో మాత్రమే పితృదేవతలకు ఇలా సత్కరించుకోవడం ఉంటుంది.
ఆ మధ్య ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్మశాన వాటికలో ఓ వ్యక్తి మర్రి మొక్క నాటాడు. ఎందుకంటే స్మశాన వాటికలో మృతదేహాలను దహనం చేసిన తర్వాత.. మూడవరోజు, ఐదవ రోజు, పదవరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో.. పక్షులు వండిన ఆహారాన్ని ముట్టాలి. చెట్లు అనేవి లేకపోవడంతో పక్షులు కనిపించడం లేదు. దీంతో పిట్ట ముట్టకపోవడంతో వండిన ఆహార పదార్థాలను అలానే వదిలివేసి వస్తున్నారు.. చివరికి ఆ వ్యక్తి స్మశాన వాటికలో మర్రి మొక్కను నాటాడు. అది కాస్త చెట్టుగా ఎదిగింది. అప్పటినుంచి ఆ చెట్టును ఆవాసంగా చేసుకొని పక్షులు ఎదుగుతున్నాయి.
ఈ కథనంలో మాత్రం బలగం సినిమా రిపీట్ కాలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘటన పునరావృతం కాలేదు. కానీ ఇక్కడ పిండ ముట్టడానికి పెద్ద ప్రయాస పడాల్సి వచ్చింది. ఆధునిక కాలంలో పక్షులు లేకపోవడం వల్ల ఎంతటి ఇబ్బందికరమైన వాతావరణం మరోసారి ఏర్పడుతుందో మనుషులకు మరోసారి అనుభవంలోకి వచ్చింది. కాలుష్యం.. సెల్ టవర్లు.. ఇంకా రకరకాల పరిశ్రమల వల్ల పక్షుల మనుగడ ప్రమాదంలో పడింది. ఒకప్పుడు కనిపించే ఊర పిచ్చుకలు.. ఇతర పక్షులు చూద్దామన్నా దర్శనమివ్వడం లేదు. ఈ తరం వారు పక్షులను చూడాలంటే అయితే యూట్యూబ్ లేదా గూగులే దిక్కు.
పక్షులు లేకపోవడంతో పిండం ముట్టే దిక్కు లేకుండా పోయింది. దీంతో కర్మకాండ అనంతరం పిండాన్ని తాకడానికి కాకిని కొనవాల్సి వచ్చింది. హైదరాబాదులోని పురానాపూల్ స్మశాన వాటికలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కర్మకాండ అనంతరం పిండాన్ని తాకడానికి కాకులు రాకపోవడంతో.. ఓ కుటుంబ సభ్యులు గంటల తరబడి ఎదురు చూశారు. చివరికి ముర్గీ చౌక్ ప్రాంతం నుంచి 200 రూపాయలకు కాకిని కొనుగోలు చేసి.. చివరికి పిండాన్ని ముట్టించారు. ఈ సంఘటన ఆధునిక కాలంలో మనిషి జీవితాన్ని సూచిస్తోంది. ఇప్పటికే ఆన్లైన్లో అన్ని కొనుగోలు చేస్తున్నాం. కాళ్ళ ముందుకు అన్ని తెచ్చుకుంటున్నాం. చివరికి కాకిని కూడా కొనుగోలు చేసే స్థాయికి దిగజారి పోయాం. ఇంకా ఇటువంటి ఘటనలు ఎన్ని చూడాల్సి ఉంటుందో..