Garo Tribe Lifestyle: గారో తెగ ప్రజలు ప్రధానంగా భారతదేశంలోని మేఘాలయ రాష్ట్రంలోని గారో హిల్స్ ప్రాంతంలో స్థిరపడ్డారు. పురాతన కాలంలో గారో ప్రజలు అనేక స్వతంత్ర గ్రామాలలో నివసించారు. ప్రతి ఒక్కరు “నోక్మా” అనే వంశ అధిపతి నేతృత్వంలో ఉన్నారు. గారో తెగలో అటాంగ్, గాంచింగ్, చిబోక్, రుగాస్ వంటి 12 ఉప తెగలు ఉన్నాయి. ఇవి సాధారణ భాష, సంస్కృతి, నమ్మకాలు, మత విశ్వాసాల ద్వారా ఐక్యంగా ఉన్నాయి. వారి ప్రధాన మతం యానిమిజం (ప్రకృతి ఆరాధన). వీరు “తాటరా రబుగా” లేదా “దక్గిప రుగిపా” అనే అత్యున్నత దేవతను ఆరాధిస్తారు.
గారో తెగ ముఖ్యమైన సాంప్రదాయ ఆచారాన్ని “మంగోనా” అని పిలుస్తారు. ఇది మరణించిన వ్యక్తి చివరి కర్మల తర్వాత నిర్వహిస్తారు. అయితే వీరు ఈ ఆచారం ప్రకారం ఏం చేస్తారు అంటే? వీరు ఇంటి ఆవరణలో వెదురుతో చిన్న గుడిసె వేస్తారు, దానిని ‘డెలాంగ్’ అంటారు.
అయితే వీరు చనిపోయిన వ్యక్తి కాలిపోయిన అస్థిపంజరాలను ఒక మట్టి కుండలో ఉంచుతారు. తరువాత దానిని మరణించినవారి ఇంటి తలుపు దగ్గర ఖననం చేస్తారు. అంటే అక్కడే ఆ కుండ ఎప్పటికీ ఉంటుంది అన్నమాట. ఆ మట్టి కుండను ఖననం చేసి తర్వాత పాటలు, నృత్యాలు, సాంప్రదాయ సంగీత వాయిద్యాలతో రాత్రంతా జరుపుకుంటారు. వామ్మో ఇంటి ముందు కంటిన్యూగా ఇలా మట్టి కుండ ఉంటే చాలా మంది భయపడతారు కదా. కానీ వారికి అది మామూలు ప్రక్రియలా అనిపిస్తుంటుందట.
గారో తెగ ప్రజలు వ్యవసాయంలో ప్రత్యేకంగా ఝుమ్ సాగు (అడవులను తొలగించి వ్యవసాయం)పై ఆధారపడి ఉంటారు. వారి సాంప్రదాయ వ్యవసాయ ఆరాధనలో “అ’ ఓ’ పాట” అనే వేడుక ఉంటుంది, దీనిలో ప్రజలు గుడ్డు పగలగొట్టి పొలాలను సాగు చేయడానికి అనుమతి అడుగుతారు. దీని తరువాత, పంట భద్రత కోసం ప్రార్థించడానికి “మినీ రోకిమే” దేవతను పూజిస్తారు.
గారో తెగ అతి ముఖ్యమైన పండుగ వంగాలా. దీనిని “పోస్ట్-హార్వెస్ట్ ఫెస్టివల్” అని కూడా పిలుస్తారు. వ్యవసాయ పనులు, పంటలు పండిన తర్వాత ఈ పండుగను జరుపుకుంటారు. ఈ సమయంలో డప్పులు, పాటలు, సంగీతం, నృత్యాలతో గ్రామం మొత్తం ప్రతిధ్వనిస్తుంది. పురుషులు, మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి నృత్యం చేస్తారు. మాంసం, అన్నంతో నిండిన విందులు వడ్డిస్తారు.
గారో తెగకు చెందిన ప్రధాన సమూహం అయిన అటాంగ్, పంట పండిన తర్వాత కృతజ్ఞతలు తెలిపే సాధారణ రూపమైన “సరమ్ చా” అని పిలిచే వంగాలా పండుగను జరుపుకుంటారు. ఈ ఉత్సవంలో నృత్యం, సంగీతం ప్రధానంగా ఉంటాయి. కానీ ఇది కృతజ్ఞతలు తెలియజేయడానికి ఒక అవకాశం మాత్రమే అని పరిగణిస్తారు ఈ తెగ ప్రజలు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..