Viral News: నాగదేవతను పూజించడం హిందూ సాంప్రదాయం. ప్రత్యేక పర్వదినాల్లో పుట్టలు, గుడుల్లో పూజలు చేస్తుంటాం. ఏటా నాగుల చవితి నాడు నేరుగా పుట్ట వద్దకు వెళ్లి పాలు పోస్తుంటాం. భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని జరిపిస్తాం. అయితే ఓ కుటుంబం భక్తిమాటున చేసిన అతి అంతా ఇంతా కాదు. దానిని భక్తి అనాలో.. మూర్ఖత్వం అనాలో తెలియడం లేదు. వారు చేసిన ఘనకార్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వాస్తవానికి నాగుపామును మనము పూజిస్తాం. పొలాలకు వెళ్లేటప్పుడు ఎటువంటి హాని కలిగించవద్దని.. నాగుపాములకు పూజ చేస్తాం. నిజానికి నాగుపాముని విష్ణువు, శివ స్వరూపాలుగా హిందువులు భావిస్తారు. విష్ణువుకి పాన్పుగా ఆదిశేషుడు, శివుని మెడలో వాసుకిగా నాగులు ఉండడంతో వాటికి పురాణాల్లో అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే ప్రతి నెలలో వచ్చే పంచమి,చవితి తిధులకు పుట్టలో పాలు పోయడం, పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అంతవరకు ఓకే కానీ ఓ కుటుంబం ఏకంగా నాగుపామును తెచ్చి ఓ ప్లేట్లో ఉంచి పూజలు చేశారు. ఆ పాము భయంతో బుసలు కొడుతున్నా లెక్కచేయడం లేదు. వారు మాత్రం భక్తి పారవశ్యంతో పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే ఈ వీడియో ఎక్కడిది.. ఆ కుటుంబం ఏ రాష్ట్రానికి చెందినది.. ఎందుకలా చేశారు అన్నది మాత్రం తెలియడం లేదు. వారు పూజలు చేస్తుండగా తీసిన వీడియోను మాత్రం ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు. అది దేశవ్యాప్తంగా ట్రోల్ అవుతోంది. అయితే అందులో ఉన్న మనుషులు మాత్రం ఉత్తరాది రాష్ట్రానికి చెందినవారుగా తెలుస్తోంది. భక్తిమాటున ఇలా మూర్ఖత్వంగా ప్రవర్తించడం తగదని.. ఇది ప్రాణాలకు హానికరం అంటూ ఎక్కువ మంది వ్యాఖ్యానిస్తున్నారు. వారి చేసిన పనిని తప్పుపడుతున్నారు.