Bridge: ఈ ప్రపంచంలో నీళ్ల మీద వంతెనలు నిర్మించడం చూసాం. నీళ్ల మీద కేబుల్ బ్రిడ్జిలు కట్టడం చూసాం. నీళ్లకు అనుసంధానంగా ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం చూశాం. కానీ, తొలిసారిగా కింది నుంచి మనుషులు వెళ్తుంటే పై నుంచి నీళ్లు ప్రవహించడం ఎప్పుడైనా చూసారా? పైగా ఒక్క చుక్క కూడా కింద కారకుండా.. ప్రవహించడం గమనించారా.. పైన నీళ్లు ప్రవహిస్తుంటే.. కింది నుంచి ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. అటు పక్కనే రైలు పట్టాలపై ట్రైన్స్ పరుగులు తీస్తుంటాయి. ఇంతకీ ఈ నిర్మాణం ఎక్కడుందంటే..
నాగార్జునసాగర్ ఎడమ కాలువ నీటిని తరలించేందుకు అప్పట్లో ఖమ్మం జిల్లా మీదుగా కాల్వలు తవ్వారు. నేటికీ ఆ జిల్లా వ్యవసాయానికి సాగర్ నీరే ఆధారం. ఈ ప్రాంతం మీదుగా నిర్మించిన కాలువ ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా లోని తిరువూరు వరకు వెళ్తుంది. ఈ కాల్వ పరిధిలో వేలాది ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టులో వరి, మొక్కజొన్న, పత్తి, మిరప, ఇతర ఉద్యాన పంటలు పండుతాయి. వాస్తవానికి ఎడమ కాలువ నిర్మాణానికి సంబంధించిన అలైన్మెంట్ బాగున్నప్పటికీ.. దానికి అప్పట్లో అడ్డుగా రైల్వే ట్రాక్ వచ్చింది. దాన్ని తొలగించేందుకు రైల్వే శాఖ ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో సాగర్ నీటి నడకనే అప్పటి ఇంజనీరింగ్ నిపుణులు పూర్తిగా మార్చేశారు.. ఖమ్మం జిల్లాలోని రామన్నపేట ప్రాంతంలో భారీ వంతెన నిర్మించి, దానిపై నీరు ప్రవహించేందుకు వీలుగా కాల్వ ఏర్పాటు చేశారు.
రైల్వే ట్రాక్ పై నుంచి ఒక భారీ కాల్వ నిర్మాణం వెళుతుంది. నిర్మాణానికి అనుసంధానంగా పెద్దపెద్ద పిల్లర్లు ఏర్పాటు చేశారు. చుక్క నీరు కూడా లీకేజ్ కాకుండా అత్యంత నాణ్యతతో నిర్మించారు. ఇలా కిలోమీటర్ల పొడవునా ఈ కాలువ నిర్మాణం ఉంటుంది. వర్షాకాలంలో సాగర్ నీటిని విడుదల చేసినప్పుడు ఈ కాలువ మీదుగా జలాలు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ కాల్వ నిర్మించి దశాబ్దాలు పూర్తవుతున్నప్పటికీ.. ఇప్పటికీ అలాగే ఉంది. టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలో నిర్మించిన వంతెనలు, కట్టిన ప్రాజెక్టులు కుంగిపోతున్న నేపథ్యంలో.. అప్పట్లో ఇంజనీరింగ్ నిపుణులు నిర్మించిన ఈ కాలువ.. వారి నిర్మాణ కౌశలానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ కాల్వ పైన రైతులు పంట పొలాలకు వెళ్లేందుకు చిన్నచిన్న దారులు కూడా నిర్మించడం విశేషం. కాల్వ పైకి ఎక్కిన తర్వాత కింది నుంచి రైళ్లు, వాహనాలు వెళుతుంటే.. చూసేందుకు ఆ దృశ్యం అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ యువతీ యువకులు ఫోటోషూట్లు కూడా నిర్వహిస్తుంటారు. తెలియని వారు ఆ నిర్మాణాన్ని చూస్తే ఒక వంతెన అని మాత్రమే అనుకుంటారు. అంతేతప్ప అందులో నుంచి నీరు వెళ్తుందని అస్సలు ఊహించలేరు.