Akiya Houses: ఆ దేశంలో లక్షల ఇళ్లు ఖాళీ.. కారణం అదే

2018లో ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య కంటే.. 2023 నాటికి అర మిలియన్ పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇక్కడ ఖాళీగా ఉన్న ఇళ్లను ఐకియా అని పిలుస్తారు. అయితే ఇలా ఖాళీ ఇళ్లు పెరగడానికి కారణం నగరీకరణ.

Written By: Dharma, Updated On : May 2, 2024 1:04 pm

Akiya Houses

Follow us on

Akiya Houses: ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుతోంది. ఈ జనాభాకు మౌలిక వసతులు కల్పించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కానీ కొన్ని దేశాల్లో మాత్రం విరుద్ధ పరిస్థితి ఉంది. అక్కడ జనాభా తగ్గుముఖం పట్టగా.. వారికోసం ఏర్పాటు చేసిన మౌలిక వసతులు వృధాగా మారాయి. నివసించేవారు లేక ఇళ్లు శిధిలావస్థకు చేరుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో రోజురోజుకీ జనాభా తగ్గుముఖం పడుతోంది. ఇలా తగ్గుతున్న జనాభాతో ఆ దేశాలు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. జపాన్ లో అయితే నిరంతరం తగ్గుతున్న జనాభా ఆ దేశానికి పెను సవాల్ గా మారింది. జనాభా లేకపోవడంతో అక్కడ ఖాళీగా ఉండే ఇళ్ళ సంఖ్య క్రమేపి పెరుగుతోంది.

2018లో ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య కంటే.. 2023 నాటికి అర మిలియన్ పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇక్కడ ఖాళీగా ఉన్న ఇళ్లను ఐకియా అని పిలుస్తారు. అయితే ఇలా ఖాళీ ఇళ్లు పెరగడానికి కారణం నగరీకరణ. గ్రామీణ ప్రాంతాల నుంచి జనాభా భారీగా నగర ప్రాంతాలకు తరలిపోతున్నారు. అయితే ప్రజలు విడిచి పెడుతున్న ఇళ్లను కూల్చడానికి ఇష్టపడడం లేదు. తొలగించడానికి వారికి మనసు రావడం లేదు. అలాగే మరమ్మత్తులు కూడా చేయడం లేదు. దీంతో ఈ శిధిల ఇళ్ల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూ వస్తోంది. జపాన్ లోని మొత్తం ఇళ్లలో ఖాళీ గృహాల సంఖ్య 14% ఉండడం ఆశ్చర్యకరం.

అయితే ఇదంతా పన్ను ఆదా కోసమేనని తెలుస్తోంది. జపాన్ చట్టం ప్రకారం ఖాళీ స్థలాల కంటే భవనాలు ఉన్న సైట్లపై పన్ను తక్కువగా ఉంటుంది. పాత ఇళ్ళను కూల్చివేస్తే.. ఎక్కువ పన్నులు కట్టాల్సి ఉంటుంది. అయితే ఈ పరిణామాలు జపాన్ కు వెళ్లే పర్యాటకులకు కలిసి వస్తున్నాయి. అక్కడ ఖాళీగా ఉండే ఇల్లు చౌకగా అద్దెకు దొరుకుతున్నాయి.మొత్తానికైతే ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇళ్లను సమకూర్చలేని స్థితిలో ఉంటే.. జపాన్ లో మాత్రం జనాభా తగ్గి ఇళ్ల సంఖ్య పెరుగుతుండడం ఆశ్చర్యం వేస్తోంది.