https://oktelugu.com/

Ajahn Siripanyo: 40 వేల కోట్లు వద్దనుకుని.. సన్యాసమే ముద్దనుకొని.. ఓ ధనవంతుడి వైరాగ్య గాథ

డబ్బుంటే ఎవరికి చేదు.. పైగా వేల కోట్ల ఆస్తి ఉంటే ఎవరు వద్దనుకుంటారు.. కానీ ఇతను మాత్రం తృణప్రాయంగా త్యజించాడు. పురాణాలలో గౌతమ బుద్ధుడి లాగా తాత్విక జీవన వైపు వెళ్ళాడు. ఏకంగా బౌద్ధ సన్యాసి లాగా మారాడు. వైరాగ్యాన్ని ముద్దనుకొని జీవితాన్ని సాగిస్తున్నాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 28, 2024 / 12:48 PM IST

    Ajahn Siripanyo

    Follow us on

    Ajahn Siripanyo: అతని పేరు వెన్ అజాన్ సిరిపన్యో.. అతడి తండ్రి పేరు ఆనందకృష్ణన్. మలేషియాలో టాప్ -3 ధనవంతులలో ఒకడు. వెన్ అజాన్ సిరిపన్యో తల్లిది థాయిలాండ్ ప్రాంతంలో రాయల్ కుటుంబం. వెన్ అజాన్ సిరిపన్యో 18 సంవత్సరాల వయసు వచ్చేవరకు బాగానే ఉన్నాడు. చక్కగా పాఠశాలకు వెళ్లాడు. స్నేహితులతో ఆడుకున్నాడు. తల్లిదండ్రులతో సరదాగా గడిపేవాడు.. ఇంట్లో సందడిగా ఉండేవాడు. ఉన్నట్టుండి ఏమైందో తెలియదు.. ఒకసారిగా తన చదువులకు ఫుల్ స్టాప్ పెట్టాడు. తన కుటుంబం వద్ద ఉండనని స్పష్టం చేశాడు. వెంటనే బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఆపై ఆశ్రమంలో ఉండడం మొదలుపెట్టాడు. సన్యాసిగా మారి బౌద్ధ మతానికి తన జీవితాన్ని అంకితం చేశాడు.వెన్ అజాన్ సిరిపన్యో వంశపారంపర్యంగా 40 వేల కోట్ల ఆస్తి ఉంది. అతడి తండ్రి ఆనంద్ కృష్ణన్ కు విస్తారమైన కంపెనీలు ఉన్నాయి. అనేకచోట్ల వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. వేలాదిమంది ఉద్యోగులు కూడా ఉన్నారు. అయినప్పటికీ ఆ జీవితం వెన్ అజాన్ సిరిపన్యో కు ఎందుకో నచ్చలేదు. ఆ డబ్బు, ఆ దర్పం అతనికి కృతకంగా అనిపించాయి. అందువల్లే అతడు ఆస్తిని మొత్తం వదులుకున్నాడు. కన్న తల్లిదండ్రులను, తోడ పుట్టిన ఇద్దరు చెల్లెళ్లను కాదనుకున్నాడు. మొత్తానికి తనకు నచ్చిన సన్యాసం వైపుకి వెళ్ళాడు. బుద్ధుడి సేవలో తరిస్తున్నాడు. నిరాడంబర జీవితాన్ని గడుపుతున్నాడు. ఒకప్పుడు షడ్రసోపేతమైన రుచులు ఆరగించిన అతడి నాలుక.. ఇప్పుడు తాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నది. మొత్తంగా చూస్తే డబ్బు అనేది తాత్కాలికమని.. మానసిక ప్రశాంతత అనేది శాశ్వతం అని వెన్ అజాన్ నిరూపించాడు.

    అప్పుడప్పుడు కుటుంబం వైపు

    వెన్ అజాన్ అప్పుడప్పుడు కుటుంబాన్ని కలుస్తుంటాడు. అయితే వారితో ఒక కుటుంబ సభ్యుడి లాగానే ఉంటాడు. అలాగని ఆస్తులు ఇవ్వాలని కోరడు. ఇప్పటికే తన ఆస్తులు మొత్తం ఇద్దరి చెల్లెళ్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. తన కుటుంబ సభ్యులను కలవడానికి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఆహారాన్ని ముట్టడు. చివరికి మంచి నీరు కూడా తాగడు. కేవలం పండ్లను మాత్రమే తీసుకుంటాడు. ఆ తర్వాత తన ఆశ్రమానికి వస్తుంటాడు.. బుద్దుని బోధనల గురించి అతడు ఆశ్రమానికి వచ్చే వారికి వివరిస్తుంటాడు. “వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు. పోతున్నప్పుడు ఏమీ తీసుకుపోయేది లేదు. భౌతికపరమైన ఆనందాలను స్వీకరించాలి. అంతర్గత సంతోషాలను పొందుకోవాలి. అప్పుడే జీవితం గొప్పగా ఉంటుంది. డబ్బు కోసం అడ్డదారులు తొక్కడం వల్ల కలిగే అనర్ధాలు తీవ్రంగా ఉంటాయి. అందువల్లే నేను ఈ దారిని ఎంచుకున్నానని” వెన్ అజాన్ సిరిపన్యో చెబుతున్నాడు.