90s Fashion Trends: మారుతున్న కాలానికి తగ్గట్టుగానే మనుషుల వస్త్రధారణ కూడా మారిపోతున్నది.. ఒకప్పుడు ఛీ కొట్టిందే ఇప్పుడు ఫ్యాషన్ అవుతున్నది. ఈ కథనంలో అలాంటి ఫ్యాషన్ గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు అది సృష్టించిన సంచలనం గురించి కూడా గుర్తు చేసుకుందాం.
మీరు 90 కాలంలో పుట్టారా.. అప్పట్లో నూనూగు మీసాల వయసులో మీరు ధరించిన ప్యాంట్లు గుర్తుకున్నాయా? అయితే ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి.. అప్పుడప్పుడే ప్రౌడ దశలోకి వస్తున్న తరుణంలో మీ ఒంటికి సరికొత్త అందాన్ని తీసుకొచ్చి.. మిమ్మల్ని ఫ్యాషన్ ఐకాన్ చేసిన ఆ ప్యాంటు ను ఒకసారి యాదికి చేసుకోండి. గొప్పగా అనిపిస్తోందా? కళ్ళముందు నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయా? ఆనాడు ధరించిన ప్యాంట్ ఇప్పుడు మళ్ళీ వేసుకుంటే బాగుండు అనిపిస్తోందా? డౌటే లేదు మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. మరోసారి ప్రత్యేకంగా కుట్టించుకుని వేసుకోవాలి అనిపిస్తుంది. మీకే కాదు, మీ కాలంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ అలానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్యాంటు సృష్టించిన సంచలనం అటువంటిది కాబట్టి.
Also Read: Rishabh Pant : పూర్ రిషబ్..27 కోట్లు పెట్టి కొంటే 128 పరుగులు.. ఎంత నామర్ద!
బూట్ కట్ అని పిలిచేవారు
వెనుకటి రోజుల్లో సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి వారు బెల్ బాటం ప్యాంట్లు ధరించేవారు. అవి తొడ భాగం వద్ద కాస్త బిగుతుగా.. ఆ తర్వాత నుంచి కాస్త వదులుగా ఉండేవి. నాటి రోజుల్లో పాదం వద్ద కాస్త వెడల్పుగా ఉండేవి. నడుస్తుంటే ఒక రకమైన అనుభూతి కలిగేది. కాల క్రమంలో ఆ ప్యాంటు కాస్త బూట్ కట్ గా మారిపోయింది. అయితే 90 కాలంలో పుట్టిన పిల్లలు ప్యాంట్ చివర్లో జిప్ లాంటి ఆకృతిని కుట్టించుకునేవారు. అంతేకాదు దానిని చూసుకుంటూ మురిసిపోయేవారు. అప్పట్లో ఈ ప్యాంటు సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. ఈ ప్యాంట్లను కుట్టేవారికి సపరేట్ అభిమానులు ఉండేవారు. వారంతా కూడా ఆ తరహాలో ప్యాంట్ లు కుట్టించుకోవడానికి క్యూ కట్టేవారు. అప్పట్లో ఈ స్థాయిలో రెడీమేడ్ దుకాణాలు ఉండేవి కావు. ఒక రకంగా టైలర్లకు కూడా చేతినిండా పని ఉండేది. ముఖ్యంగా కాటన్ జీన్ వస్త్రాన్ని కొనుగోలు చేసి బూట్ కట్ పాయింట్లు కుట్టించుకునేవారు. తల్లిదండ్రులు అలాంటి ప్యాంట్లు వద్దని అన్నప్పటికీ యువతరం ఊరుకునేది కాదు. ఇంకా కొందరైతే చివర్లో జిప్ మాత్రమే కాకుండా.. సైడ్లకు వేరే క్లాత్ కలిపి కుట్టించుకునేవారు. మొత్తంగా అప్పట్లో ఒక్కొక్క యువకుడు ఫ్యాషన్ ఐకాన్ లాగా దర్శనమిచ్చేవారు. అందుకే బూట్ కట్ పాయింట్లు కనిపించగానే 90 కాలం నాటి యువకులు ఒక్కసారిగా తమ జ్ఞాపకాలను రివైండ్ చేసుకుంటారు. ఆ కాలంలో విహరిస్తూ ఉంటారు. కాల క్రమంలో బూట్ కట్ ప్యాంట్లు కొత్త రూపు సంతరించుకున్నాయి. క్రమేపి అవి మాయమైపోయి సిక్స్ ప్యాక్ లాగా దర్శనమిచ్చాయి. ఆ తర్వాత పెన్సిల్ కట్.. స్కిన్ టైట్ ప్యాంట్లు మార్కెట్ ను ముంచెత్తాయి.