ట్రంప్ తిరిగి పీఠం దక్కించు కుంటాడా?

గత సోమవారం నుంచి నాలుగు రోజులు రిపబ్లికన్ పార్టీ కన్వెన్షన్ జరిగింది. అంతకుముందు వారం డెమోక్రటిక్ పార్టీ కన్వెన్షన్ జరిగిన తీరుతెన్నులు వివరించాము. అలాగే ఈ కన్వెన్షన్ తీరుతెన్నులను కూడా మీ ముందుంచుతాము. డెమోక్రటిక్ కన్వెన్షన్ దాదాపుగా దృశ్య మాధ్యమం ద్వారానే జరిగింది. కానీ రిపబ్లికన్ కన్వెన్షన్ ఎక్కువభాగం స్వయంగా కన్వెన్షన్ నుంచే మాట్లాడటం జరిగింది. మిగతా కొద్దిమంది మాత్రమే దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడారు. అయితే అధ్యక్షుడు ట్రంప్ మాత్రం చివరిరోజు వైట్ హౌస్ బయట […]

Written By: Ram, Updated On : August 29, 2020 9:46 am
Follow us on

గత సోమవారం నుంచి నాలుగు రోజులు రిపబ్లికన్ పార్టీ కన్వెన్షన్ జరిగింది. అంతకుముందు వారం డెమోక్రటిక్ పార్టీ కన్వెన్షన్ జరిగిన తీరుతెన్నులు వివరించాము. అలాగే ఈ కన్వెన్షన్ తీరుతెన్నులను కూడా మీ ముందుంచుతాము. డెమోక్రటిక్ కన్వెన్షన్ దాదాపుగా దృశ్య మాధ్యమం ద్వారానే జరిగింది. కానీ రిపబ్లికన్ కన్వెన్షన్ ఎక్కువభాగం స్వయంగా కన్వెన్షన్ నుంచే మాట్లాడటం జరిగింది. మిగతా కొద్దిమంది మాత్రమే దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడారు. అయితే అధ్యక్షుడు ట్రంప్ మాత్రం చివరిరోజు వైట్ హౌస్ బయట పచ్చికల్లో కొన్ని వేలమంది మద్దతుదారుల ఈలలు, చప్పట్ల మధ్య తన నామినేషన్ అంగీకార సందర్భ సమావేశం లో మాట్లాడాడు. అలాగే ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ చారిత్రాత్మక బాల్టిమోర్ కోట నుంచి ప్రసంగించాడు. ఇంకో ముఖ్య ప్రభుత్వ అధికారి పాంపియో ( విదేశాంగమంత్రి ) ఇజ్రాయిల్ రాజధాని జరూసలెం నుంచి ప్రసంగించాడు. ఈ మూడు ఉపన్యాసాలు అధికార దుర్వినియోగం కిందకు వస్తాయని డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా వైట్ హౌస్ ని ఎన్నికల వేదికగా ఉపయోగించటం దుస్సంప్రదాయమని , చట్ట వ్యతిరేకమని దీనిపై తగు చర్యలు తీసుకుంటామని డెమోక్రాట్లు చెబుతున్నారు. ( ప్రతినిధుల సభ లో డెమోక్రాట్లు పూర్తి మెజారిటీ లో వున్నారు). ఇకపోతే కన్వెన్షన్ వివరాల లోకి వెళ్దాం.

Also Read : అందుకే ఆ మూడు దేశాలలో అన్ని కేసులు?

ఇది ట్రంప్ పూర్తి ఆధిపత్యంలో జరిగిన సమావేశం 

2016 లో ఒహాయో లో జరిగిన సమావేశానికి ఇది పూర్తి భిన్నం. ఆ సమావేశం రసాభాసగా జరగటం, ట్రంప్ అతికొద్ది తేడాతో నామినేట్ కావటం అందరికీ తెలిసిందే. దానితో పోలిస్తే ఈ సమావేశం పూర్తిగా ట్రంప్ నాయకత్వం లో జరిగింది. ఒకవిధంగా చెప్పాలంటే పూర్తి ఇక్యతతో ఈ సమావేశం జరిగిందని చెప్పొచ్చు. సమావేశం లో మాట్లాడిన ప్రతి ఒక్కరూ ట్రంప్ నాయకత్వాన్ని పొగుడుతూ ఈ నాలుగు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడారు. ఈ సమావేశం లో ఇంకో విశేషమేమంటే పాత రిపబ్లికన్ నాయకులు అధ్యక్షుడు బుష్ గానీ, ఉపాధ్యక్షులు , ఉపాధ్యక్ష అభ్యర్దులెవ్వరూ పాల్గొనక పోవటం. కాకపోతే అదో పెద్ద అంశంగా ఎవరూ పరిగణించక పొవటం. అంతా ట్రంప్ మయమే. ఒకవిధంగా చెప్పాలంటే రీగన్ తర్వాత వ్యక్తి ఆరాధన తో జరిగిన సమావేశం ఇది. ట్రంప్ క్యారక్టర్, ప్రవర్తన, ప్రవృత్తి పై ఎన్నో వివాదాలున్నా రిపబ్లికన్ పార్టీ లో ట్రంప్ నాయకత్వం పై మంచి ఉత్సాహం తోనే వున్నారని చెప్పొచ్చు. ఇంకో గుణాత్మకమైన మార్పు, పోయిన ఎన్నికల్లో కొత్తగా ఏర్పడిన పారిశ్రామిక కార్మిక వర్గ మొగ్గు మరింత ట్రంప్ వైపు ఉన్నట్లే కనబడుతుంది. వీరందరూ కాలేజీలో చదువుకోని తెల్ల జాతీయులే. ట్రంప్ విధానాలే మమ్మల్ని కాపాడతాయని బలంగా నమ్ముతున్నారు. సమావేశం లో ఇంకో కొట్టొచ్చిన మార్పు మైనారిటీలు ట్రంప్ ప్రభుత్వం లో ఏ విధంగా ప్రయోజనం పొందారో ఏకరువు పెడుతూ వీళ్ళ చేత మాట్లాడించటం. నల్ల జాతీయులు , ఇస్పానిక్కులు ( స్పానిష్ భాష మాట్లాడే మధ్య , దక్షిణ లాటిన్ అమెరికా ప్రజలు), క్యూబన్లు , ఆసియా మూలాల ప్రజలు, యూదులు, అమెరికన్ ఇండియన్లు ఈ సమావేశాల్లో మాట్లాడటం జరిగింది. ఒకవైపు నల్ల జాతీయులు ‘నల్లవాళ్ళ జీవితాలు కూడా జీవితాలే’ అనే నినాదం తో దేశవ్యాప్తంగా హోరెత్తిస్తుంటే ఈ సమావేశం లో మైనారిటీల చేత మాట్లాడించి మా ప్రభుత్వం మైనారిటీలకు వ్యతిరేకం కాదనే భావన తీసుకురావటం కోసం ప్రయత్నం జరిగింది. అయినా పోయిన ఎన్నికల్లో కేవలం 8 శాతం మంది నల్ల జాతీయులు, 25 శాతానికి అటూ ఇటుగా ఇస్పానిక్కులు, ఆసియా మూలాల ప్రజలు మాత్రమే రిపబ్లికన్లకు ఓటు వేశారు. ఇస్పానిక్కుల్ని, నల్ల జాతీయుల్నిఆకర్షించే పనిలో భాగంగా ‘ ఇష్టమొచ్చిన పాటశాలను ఎన్నుకొనే స్వేచ్చ’ విధానాన్ని ట్రంప్ ప్రభుత్వం చేసిందని ప్రచారం చేసారు. ముఖ్యంగా ఇస్పానిక్కుల్లో ఈ నినాదం బాగా ఆకర్షిస్తుందని ట్రంప్ అనుయాయులు నమ్ముతున్నారు. అలాగే క్రిమినల్ న్యాయ వ్యవస్థ లో మార్పులకు స్వీకారం చుట్టామని కూడా చెప్పుకొచ్చారు. అసలు నల్ల జాతీయులకు ఈ ప్రభుత్వం లో జరిగినంత మేలు ఏ ప్రభుత్వం లో జరగలేదని కూడా చెప్పారు. కరోనా మహమ్మారి రాకముందు నల్ల జాతీయుల్లో చరిత్రలోనే అతి తక్కువ నిరుద్యోగ సమస్య వుందని ఇది తమ ప్రభుత్వ ఘనతగా చెప్పుకొచ్చారు. మొత్తం మీద మైనారిటీలకు మా ప్రభుత్వం లో జరిగినంత ప్రయోజనం ఇంతకుముందు ఏ ప్రభుత్వం లో జరగలేదని వక్తలందరూ చెప్పారు. అయినా ఇప్పటికీ శ్వేత జాతీయేతరుల్లో అత్యధికులు డెమొక్రాట్ల వైపే వున్నారు. కారణం తెల్లవాళ్ళు ఎక్కువగా రిపబ్లికన్ల వైపు సమీకరించబడటం, నల్లవాళ్ళ పై దాడులు జరగటం లాంటి సామాజిక ఉద్రిక్తతల వలన ఈ సమీకరణ జరగటం సహజమే. ఇకపోతే భారతీయ అమెరికన్లలో కూడా ఎక్కువమంది డెమొక్రాట్ల వైపే వున్నారు. అయితే ఈ నాలుగు సంవత్సరాల్లో కొంత మార్పు కనబడుతుంది. మోడీ -ట్రంప్ హ్యుస్టన్ సభ , డెమోక్రాట్లు కాశ్మీర్ సమస్యపై భారత్ కి వ్యతిరేకంగా మాట్లాడటం, ట్రంప్ పాకిస్తాన్ కి వ్యతిరేకంగా గట్టిగా నిలబడటం లాంటి అంశాలతో భారతీయ అమెరికన్లలో చీలిక బాగానే ఉండొచ్చని అనుకుంటున్నారు. నిక్కీ హేలి సమావేశం లో మాట్లాడిన దానిపై కొంతమంది చేసిన ట్వీట్లు వివాద మయ్యాయి. అదికూడా భారతీయ అమెరికన్ల లో డెమొక్రాట్ల పై కోపం తెప్పించింది.

Also Read : గెలుపు కోసం మోదీ నే నమ్ముకున్న ట్రంప్

సమావేశ ఫోకస్ ఎలావుంది?

ప్రధానంగా సమావేశం అమెరికా మూల విలువలు, స్వేచ్చ, స్వాతంత్రాల పై ఎక్కువగా కేంద్రీకరించారు. డెమోక్రాట్లు ఏ విధంగా అమెరికా విలువలను తూట్లు పొడుస్తున్నారో చెప్పటానికి ప్రయత్నించారు. అలాగే రాడికల్ లెఫ్ట్ ( తీవ్రవాద వామపక్షం) మెల్లి మెల్లిగా డెమోక్రటిక్ పార్టీ పై ఆధిపత్యం ఏర్పరుచుకొని తమ ఎజండా ని అమలుచేస్తారని ప్రచారం చేసారు. సోషలిస్టు సమాజాన్ని తీసుకురావాలని జరిగే ప్రయత్నానికి పరోక్షంగా జో బైడెన్ మద్దతిస్తున్నాడని తీవ్ర ఆరోపణలు చేసారు. ట్రంప్ దాదాపు 70 నిముషాలు ముగింపు ఉపన్యాసం వైట్ హౌస్ నుంచి ఇచ్చాడు. నేను ‘అమెరికా ఫస్టు’ కోసం ప్రయత్నిస్తుంటే డెమోక్రాట్లు ‘రాజకీయ నాయకులు ఫస్టు’ గా పనిచేస్తున్నారని చెప్పాడు. నేను ‘మేడ్ ఇన్ అమెరికా’ కోసం ప్రయత్నిస్తుంటే జో బైడెన్ ‘మేడ్ ఇన్ చైనా’ కోసం ప్రయత్నిస్తున్నాడని విమర్శించాడు. చైనాకు వ్యతిరేకంగా నేను గట్టిగా నిలబడితే జో బైడెన్ చైనాకు దాసోహ మయ్యాడని మన లక్షలాది ఉద్యోగాలు చైనా కు తరలిపోవటానికి దోహదపడ్డాడని ఆరోపించాడు. వ్యాపార ఒప్పందాలు నా హయాం లో అమెరికాకి ప్రయోజనం కలిగించే విధంగా మారాయని ఇది ఈ నాలుగు సంవత్సరాల్లో మేము సాధించిన ఘనతగా చెప్పుకొచ్చాడు. ఒక్క నాటో కూటమి తోనే అదనంగా 130 కోట్ల బిలియన్ డాలర్లు చెల్లించే ఒప్పందం చేసుకున్నానని ఇది ముందు ముందు 400 బిలియన్లు గా మారుతుందని చెప్పాడు.

వలస విధానం పై మాట్లాడుతూ  నా హయాం లో ఇప్పటికే 300 మైళ్ళ సరిహద్దుగోడ నిర్మించానని అదే డెమోక్రాట్లు అధికారం లోకి వస్తే సరిహద్దులు బార్లా తెరుస్తారని ఆరోపించాడు. అక్రమ వలసల పై ఖటిన వైఖరిని అవలంబించానని చెప్పాడు. అమెరికా మిలిటరీ ని మరింత శక్తివంతం గా తీర్చిదిద్దానని కొత్తగా అంతరిక్ష రక్షణ దళాన్ని ఏర్పాటు చేసానని, సిరియా లో ఇసిస్ ని తుదముట్టించానని దాని నేత అబూ బెకర్ ని మట్టుబెట్టానని కూడా చెప్పాడు. కరుడుగట్టిన ఉగ్రవాది ఇరాన్ మిలిటరీ నేత ఖస్సిం సులేమాని ని అంతమొందించానని ప్రకటించాడు.   అదే బైడెన్ హయాం లో ఏమీ చేయలేకపోయారని కూడా చెప్పాడు. తిరిగి అధికారం లోకి వస్తే ఇష్టమొచ్చిన స్కూల్ ని ఎంచుకునే విధానాన్ని అందరికీ విస్తరిస్తానని కూడా చెప్పాడు. మరింత పన్ను తగ్గింపు లుంటాయని ప్రకటించాడు. ఇటీవలి కాలంలో జరుగుతున్న హింసపై మాట్లాడుతూ ఎటువంటి పరిస్థితుల్లో మాబ్ రూల్ ని ఒప్పుకోమని మరింత ప్రజలకు రక్షణ కల్పిస్తామని చెప్పాడు. వచ్చే నాలుగేళ్లలో అమెరికా ని ప్రపంచ తయారీ హబ్ గా తయారు చేస్తానని , మెడికల్ డివైజెస్ తయారీ హబ్ గా కూడా తయారు చేస్తానని చెప్పాడు. మొత్తం మీద ఈలలు, చప్పట్ల మధ్య క్యాడర్ ని ఉత్తేజపరిచే విధంగా ప్రసంగించాడు.

Also Read : మూడు సెకండ్ల వీడియో.. అమెరికాలో హల్చల్

ఎన్నికల వేడి రాజుకుంది 

రెండు పార్టీల నాలుగురోజుల సమావేశాలతో అమెరికాలో ఎన్నికల వేడి రాజుకుంది. తర్వాత సెప్టెంబర్ చివరలో మొదలై మూడు డిబేట్లు జరుగుతాయి. దీనిలో ఇరువురి అధ్యక్ష అభ్యర్ధులు చెప్పే సమాధానాలు అమెరికా ప్రజలు జాగ్రత్తగా గమనిస్తారు. ఈ చర్చలు అమెరికా ఓటింగ్ పై ప్రభావం చూపుతాయి. ఇప్పటికున్న అంచనా ప్రకారం బైడెన్ ట్రంప్ పై 9 పాయింట్ల ఆధిక్యతలో వున్నాడు. అయినా పాపులర్ వోటు సూచిక మాత్రమే. అధ్యక్షుడిని ఎన్నుకునేది రాష్ట్రాలనుంచి ఎన్నికైన డెలిగేట్లు. అందులో ఎవరి తరఫున ఎక్కువమంది ఎన్నికైతే వాళ్ళే అధ్యక్షులవుతారు. దీనిపై వివరంగా వచ్చే వారాల్లో చర్చించుకుందాము. అమెరికా ఎన్నికల పై మేమిచ్చే లోతైన విశ్లేషణ ఆసక్తిగల భారతీయ చదువరులకు కనువిందు కలిగిస్తుందని హామీ ఇస్తున్నాము. సెలవు మరి.