US Green Card: అమెరికాలో స్థిరపడాలనుకున్న ప్రవాస భారతీయులకు శుభవార్త. శాశ్వత నివాసానికి గాను అమెరికా ప్రభుత్వం అందించే గ్రీన్ కార్డు జారీ ప్రక్రియ మరింత సులభతరం, వేగవంతం కానుంది. ఏళ్ల తరబడి జాప్యానికి చెక్ పడనుంది. దరఖాస్తు చేసుకున్న రోజు నుంచి ఆరు నెలలలోపే ప్రక్రియ అంతా పూర్తి అయ్యే విధంగా విధానపరమైన మార్పులు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు 25 మంది సభ్యులతో కూడిన అమెరికా అధ్యక్షుని సలహాదారుల మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపితే గ్రీన్ కార్డు జారీ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ప్రవాస భారతీయుల సంఘం నాయకుడు అజయ్ జైన్ బుతోరియా గ్రీన్ కార్డుల జారీలో జరుగుతున్న జాప్యం అంశాన్ని సలహామండలి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సలహామండలి.. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్)కు పలు సిఫారసులు చేసింది.
ఏటా వేలాది మంది..
అమెరికాలో స్థిరపడాలనే కోరికతో గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న విదేశీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. భారత్ విషయానికొస్తే పెద్ద సంఖ్యలో ఐటీ నిపుణులు హెచ్-1బీ వర్క్ వీసాలతో అమెరికా వెళుతుంటారు. గ్రీన్ కార్డు కోసం వ్యయప్రయాసలకు గురవుతుంటారు. ఏళ్ల తరబడి వేచి చూస్తుంటారు. కొన్ని వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. భారతీయులు పడుతున్న బాధలను ప్రవాస భారతీయుల సంఘం ప్రతినిధులు ఎప్పటికప్పుడు అమెరికా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లేవారు. ఎట్టకేలకు ఆ విన్నపాలపై అమెరికా అధ్యక్షుని సలహా మండలి స్పందించింది.
గ్రీన్ కార్డు జారీలో జరుగుతున్న జాప్యాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించింది.ఇందుకోసం ప్రస్తుతం తాము పాటిస్తున్న విధానాలను, అమల్లో ఉన్న నిబంధనలను, ఇతర అంశాలను పునఃపరిశీలించుకుని అవసరమైన మార్పులు చేసుకోవాలని పేర్కొంది. ఇక, వచ్చే ఆగస్టులోపు అవసరానికి అనుగుణంగా సిబ్బంది సంఖ్యను పెంచుకుని ఇంటర్వ్యూల ప్రక్రియను వేగవంతం చేయాలని నేషనల్ వీసా సెంటర్(ఎన్‌వీసీ) విభాగానికి సూచించింది. అంతేకాక వర్క్‌పర్మిట్లు, ట్రావెల్ డాక్యుమెంట్లు, టెంపరరీ స్టేటస్ ఎక్స్‌టెన్షన్స్/ సవరణలకు సంబంధించిన వ్యవహారాలను మూడు నెలలోపు పూర్తి చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని యూఎ్‌ససీఐఎ్‌సకు ప్రతిపాదించింది. అంతేకాక ప్రీమియం ప్రొసెసింగ్ కింద 2500 డాలర్లు చెల్లించిన వారి దరఖాస్తులపై 45 రోజుల్లోనే తుది నిర్ణయం తీసుకోవాలని కూడా సిఫారసు చేసింది.
ని‘బంధన’లు
గ్రీన్ కార్డుల జారీ ప్రక్రియలో నిబంధనలు సవాల్ గా మారుతున్నాయి. ఏటా 2,26,000 గ్రీన్ కార్డులు జారీకి మాత్రమే అవకాశం ఉంది. ఉద్యోగ, ఉపాధికి వచ్చే అన్ని దేశాల వారికి సమానంగా కేటాయింపులు చేయాలి. అయితే భారత్ విషయానికి వచ్చసరికి కేవలం ఏడు శాతమే కేటాయించారు. ప్రస్తుతం భారత దేశం నుంచి అమెరికా వెళ్లేవారి సంఖ్య పెరిగింది. ఈ ఏడు శాతం ఏ మూలకూ చాలదు. ఈ నిబంధన వల్ల వేల మంది భారతీయులు గ్రీన్‌కార్డు పొందేందుకు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. ఇక, వేర్వేరు కారణాలతో 2021లో 65,452 గ్రీన్ కార్డులను మాత్రమే జారీ చేశారు. ఇంటర్వ్యూల వాయిదా కూడా సాధారణం అయిపోయింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లో మార్పులు చేసుకోకపోవడమే ఈ సమస్యకు కారణంగా భావిస్తున్నారు. తాజా ప్రతిపాదనలకు అధ్యక్షుడు ఆమోదం లభిస్తే గ్రీన్‌కార్డు జారీ ప్రక్రియ మరింత సులభతరం అయ్యే అవకాశం ఉంది. వేలమంది ప్రవాస భారతీయులు లబ్ధి పొందనున్నారు.
Also Read:R Krishnaiah: విఫల ప్రయోగాన్ని నమ్ముకున్న జగన్.. ఆర్.క్రిష్ణయ్య రాజ్యసభ ఎంపిక వెనుక కథా ఇదా?
Recommended Videos