Tana Mahasabhalu: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) మొదటి జాతీయ సమావేశం 1977 లో జరిగింది. లాభాపేక్షలేని సంస్థగా 1978లో అధికారికంగా ఏర్పాటైంది. 30 వేలకుపైగా సభ్యులు ఇందులో ఉన్నారు. తానా అతి పెద్ద ఇండో–అమెరికా సంఘాల్లో ఒకటి. ఏటా తానా వార్షికోత్సవం నిర్వహిస్తోంది. భారతీయ సెలబ్రిటీలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన నటీనటులు, గాయకులు, కమెడియన్లు ఈ తానా సభలకు హాజరవుతారు. అంగరంగ వైభవంగా, పండుగలా నిర్వహించే వేడుకల కోసం ఏటా తెలుగువారు ఎదురు చూస్తుంటారు. 2025లో నిర్వహించే తానా 24వ మహాసభలకు వేదికగా డెట్రాయిట్ నగరాన్ని ఎంపిక చేశారు. ఈ మహాసభలకు కోఆర్డినేటర్‌గా ఉదయ్‌కుమార్ చాపలమడుగును నియమించినట్లు తానా కార్యదర్శి రాజా కసుకుర్తి తెలిపారు. ఈ మేరకు బోర్డ్, ఎగ్జిక్యూటివ్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తానా 2025 మహాసభలు జరిగే ప్రాంతాన్ని ఎంపిక చేసేందుకు నియమించిన ముగ్గురితో కూడిన కమిటీ ఇచ్చిన నివేదికను ఈ సమావేశంలో ఆమోదించారు. ఈ కమిటీకి చైర్మన్‌గా శ్రీనివాస్ కోనేరు వ్యవహరించారు. సభ్యులుగా నరహరి కొడాలి, శ్రీనివాస్ దాసరి ఉన్నారు.
2025 జూలైలో సభలు..
ఇక వచ్చే ఏడాది నిర్వహించే తానా సభలను డెట్రాయిట్ వేదికగా జూలై మొదటి వారంలో నిర్వహించనున్నారు. పదేళ్లకు ఓసారి డిట్రాయిట్లో మహాసభలు జరగడం ఆనవాయితీగా కనిపిస్తోంది. 2005, 2015 సంవత్సరంలో కూడా డెట్రాయిట్ లో తానా మహాసభలు జరిగిన విషయం విధితమే. ఇప్పుడు ఆ ఆనవాయితీకి కొనసాగింపుగా 2025లో మహాసభలకు వేదికగా డెట్రాయిట్ నిలవడం విశేషం. డెట్రాయిట్ అయితే తెలుగు కమ్యూనిటీకి దగ్గరగా ఉంటుందని, వచ్చిన అతిథులకు వసతి సౌకర్యాలు కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉంటుందని కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన తరువాత ఈసీ, బోర్డ్ డెట్రాయిట్‌ను ఎంపిక చేసినట్లు రాజా కసుకుర్తి తెలియజేశారు.
మహాసభల చైర్మన్‌గా గంగాధర్..
ఇక ఈ తానా 2025 మహా సభలకు చైర్మన్‌గా గంగాధర్ నాదెళ్ళను కూడా నియమించారు. తానాలో పాతతరానికి, కొత్త తరానికి బాగా పరిచయం ఉన్న గంగాధర్ నాదెళ్ల ఈ మహాసభలను కూడా పర్యవేక్షించనున్నారు. ఈ మహాసభలకు కోఆర్డినేటర్ ఉదయకుమార్ చాపలమడుగు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని చల్లపల్లిలో జన్మించిన ఉదయకుమార్ చాపలమడుగు తానాలో వివిధ కీలక పదవులను నిర్వహించారు. తానాతో ఎంతో అనుబంధం ఉన్న ఉదయ్ కుమార్ వచ్చే సంవత్సరం డెట్రాయిట్లో జరిగే తానా 2025 మహాసభలకు కోఆర్డినేటర్‌గా వ్యవహరించనున్నారు. డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్(డీటీఏ) కార్యనిర్వాహక కమిటీలో అనేక పదవులను ఉదయ్‌కుమార్ నిర్వహించారు. ముఖ్యంగా, బాగా గుర్తింపు పొందిన డీటీఏ 25వ, 40వ వార్షికోత్సవాల నిర్వహణ కన్వీనర్‌గా ఆయన చేసిన కృషి అందరి ప్రశంసలను అందుకుంది. 2005 డెట్రాయిట్ తానా ద్వైవార్షిక సదస్సుకు డిప్యూటీ కోఆర్డినేటర్‌గా కూడా సేవలందించారు. 2007లో తానా చైతన్య స్రవంతి కోఆర్డినేటర్‌గా కూడా పనిచేశారు. ప్రముఖ నటుడు స్వర్గీయ తమ్మారెడ్డి చలపతిరావు అల్లుడైన ఆయన, తన అద్భుతమైన ప్రసంగ నైపుణ్యాల ద్వారా తెలుగు ప్రజలలో విశేషంగా గుర్తింపు పొందారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: The venue of tana mahasabhalu will be finalized in 2025 uday as coordinator gangadhar as chairman
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com