Texas Mall Shoot: అమెరికాలో గన్ కల్చర్.. భారతీయులు సహా విదేశీయులకు ఆందోళన కలిగిస్తోంది. ఎప్పుడు ఎవరి ప్రాణాలు గాల్లో కలుస్తాయో అనే టెన్షన్ ఉంటోంది. తాజాగా తెలుగమ్మాయి.. ప్రాణాలు కోల్పోయింది. టెక్సాస్‌లో శనివారం దుండగుడు జరిపిన కాల్పుల్లో… ఓ తెలుగమ్మాయి కూడా చనిపోయింది. రంగారెడ్డి జిల్లా జడ్జి నర్సిరెడ్డి కూతురు ఐశ్వర్య(25) టెక్సాజ్ రాష్ట్రంలోని డల్లాస్‌లోని ఓ మాల్‌లో దుండగుడు శనివారం జరిపిన కాల్పుల్లో 9 మంది మృతిచెందారు. చాలామంది గాయపడ్డారు. మృతుల్లో ఐశ్వర్య ఉన్నట్లు అమెరికా అధికారులు నిర్ధారించారు. ఈమేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
షాపింగ్ మాల్‌లో ఘటన..
అమెరికాలోని డాల్లాస్‌లో భారతీయులు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా తెలుగు వారు ఎక్కువ. అమెరికా వెళ్లిన వారు ఇక్కడే స్థిరపడ్డారు. తాటికొండ ఐశ్వర్య కూడా టెక్సాస్‌లోని ఓ సంస్థలో ఆమె ప్రాజెక్ట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తోంది. శనివారం సెలవు కావడంతో ఉత్తర డల్లాస్‌కి 40 కిలోమీటర్ల దూరంలోని ఓ ఔట్‌లెట్ మాల్‌కి వెళ్లింది. చాలా మంది మాల్‌లో వాహనంలో వచ్చిన ఓ దుండగుడు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో.. 9 మంది చనిపోయారు. మరికొంతమంది గాయపడ్డారు. బాధితుల్లో కొంతమంది యువకులు, ఐదేళ్ల వయసు పిల్లలు కూడా ఉన్నారు. కాల్పుల తర్వాత పోలీసులు ఆ దుండగుడిని కాల్చిచంపారు.
జడ్జి కుటుంబంలో విషాదం..
ఐశ్వర్య మరణంతో జడ్జి నర్సిరెడ్డి కుటుంబంలో విషాదం నెలకొంది. బాధిత కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. కాల్పుల తర్వాత షాపింగ్ మాల్‌లోని కస్టమర్లు, ఉద్యోగులూ… పార్కింగ్ లాట్స్‌లోకి పరుగులు తీశారు. టాక్టికల్ గేర్ ధరించిన దుండగుడిని పోలీసులు కాల్చి చంపారు. అయితే దుండగుడు ఎందుకు కాల్పులు జరిపాడో తెలియలేదు.
పెరుగుతున్న కాల్పుల ఘటనలు..
అమెరికాలో తరచూ గన్ ఫైరింగ్ ఘటనలు జరుగుతున్నాయి. 2021లో 49 వేల మంది ఇలాంటి ఘటనల్లో చనిపోగా… 2020లో 45 వేల మంది ప్రాణాలు విడిచారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువగా గన్ ఫైరింగ్ జరుగుతున్నది అమెరికాలోనే. ఈ సంవత్సరం ఇప్పటివరకూ 195 ఘటనలు జరిగినట్లు గన్ వయలెన్స్ ఆర్కైవ్ తెలిపింది.
గన్ కల్చర్‌ను ఎందుకు ఆపలేకపోతున్నారు?
అమెరికాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 200కుపైగా కాల్పుల ఘటనలు జరిగాయి. కాల్పులు జరిగిన ప్రతిసారి అమెరికాలో గన్ కల్చర్ పై చర్చ జరుగుతుంది. 50 ఏళ్ల క్రితమే నాటి అమెరికా అధ్యక్షుడు లిండన్ బైన్స్ జాన్సన్ ‘అమెరికాలో నేరాల వల్ల మరణిస్తున్న వారిలో ఎక్కువ మరణాలు తుపాకుల వల్లే సంభవిస్తున్నాయి. మన దేశంలో పెరుగుతున్న ఆయుధ సంస్కృతే దీనికి ప్రధాన కారణం’’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సమయంలో, అమెరికాలో దాదాపు 9 కోట్ల తుపాకులు ఉన్నాయి. కానీ నేడు అంతకన్నా ఎక్కువ తుపాకులు ఉన్నాయి. ఏటా వేలాది మంది కాల్పుల్లో చనిపోతున్నారు. అమెరికాలో ఇలాంటి కాల్పుల ఘటనలను ఎందుకు ఆపడం లేదన్న ప్రశ్న వినిపిస్తూ ఉంటుంది.
ఎన్ని తుపాకులు ఉన్నాయి?
ప్రపంచవ్యాప్తంగా ఎన్ని తుపాకులు ఉన్నాయో చెప్పడం కష్టం. కానీ స్విట్జర్లాండ్‌లోని ఒక ప్రసిద్ధ పరిశోధనా సంస్థ స్మాల్ ఆరమ్స్ సర్వే అనే అధ్యయనంలో 2018 లో ప్రపంచవ్యాప్తంగా 3.9 కోట్ల తుపాకులు ఉన్నాయని అంచనా వేసింది. అమెరికాలో ప్రతీ 100 మంది పౌరులకు 120.5 ఆయుధాలు ఉన్నాయి. 2011లో ఈ సంఖ్య 88కి తగ్గింది. ప్రపంచంలోని ఇతర దేశాల కంటే అమెరికా ప్రజల వద్ద ఎక్కువ ఆయుధాలు ఉన్నాయి. కొన్నేళ్లుగా అమెరికాలో తుపాకీ యజమానుల సంఖ్య భారీగా పెరిగినట్లు ఇటీవల వచ్చిన గణాంకాలు కూడా సూచిస్తున్నాయి. ఒక నివేదిక ప్రకారం, జనవరి 2019, ఏప్రిల్ 2021 మధ్య, 7.5 మిలియన్ల అమెరికన్లు మొదటిసారిగా తుపాకులను కొనుగోలు చేశారు. అంటే అమెరికాలో మరో కోటి మంది తమ ఇళ్లకు తుపాకులను తెచ్చుకున్నారు. అందులో 50 లక్షల మంది పిల్లలు ఉన్నారు. తుపాకులు కొనుగోలు చేసిన వారిలో సగం మంది మహిళలే.
ఎంతమంది చనిపోయారు?
1968 నుంచి 2017 మధ్య, అమెరికాలో తుపాకుల వల్ల సుమారు 15 లక్షల మంది మరణించారు. ఈ సంఖ్య 1775 స్వాతంత్య్ర యుద్ధం నుంచి అమెరికాలో జరిగిన ఏ యుద్ధంలో కూడా ఇంత మంది మరణించలేదు. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం, 2020లోనే అమెరికాలో 45 వేల మందికిపైగా తుపాకుల కారణంగా మరణించారు.
రాజకీయ సమస్య..
తుపాకులను ఎందుకు నియంత్రించడం లేదు అంటే.. అమెరికాకు ఇది రాజకీయ సమస్య అని చెప్పవచ్చు. ఈ చర్చలో ఒక వైపు ఆయుధాలపై నిషేధం గురించి మాట్లాడేవాళ్లు, మరోవైపు అమెరికా రాజ్యాంగం కల్పించిన ఆయుధాలు ధరించే హక్కును కాపాడటం గురించి మాట్లాడేవాళ్లు ఉన్నారు. తుపాకుల నియంత్రణ కోసం చట్టాలను కఠినతరం చేయడం అవసరమా అనే అంశంపై 2020లో అమెరికాలో నిర్వహించిన ఒక సర్వేలో కేవలం 52% మంది మాత్రమే దీనికి మద్దతు ఇవ్వగా, ప్రస్తుత చట్టాలలో ఎటువంటి మార్పు అవసరం లేదని 35% మంది అభిప్రాయపడ్డారు.