TANA 5K Run Walk : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) న్యూ ఇంగ్లాండ్ విభాగం, బోస్టన్‌కి చెందిన గ్రేస్ ఫౌండేషన్ సహకారంతో మాన్స్ఫీల్డ్ టౌన్‌లో 5కె రన్/వాక్‌ను విజయవంతంగా నిర్వహించింది. గ్లోబల్ గ్రేస్ హెల్త్‌తో కలిసి తానా చేపట్టిన ఆరోగ్య, సేవా కార్యక్రమాల పరంపరలో భాగంగా ఈ వాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఉదయం ప్రారంభమైన ఈ వాక్‌లో ఫిట్‌నెస్ ఔత్సాహికులు, కుటుంబాలు, వాలంటీర్లు, మహిళా రన్నర్లు, చిన్నారులు ఒకే చోట చేరి ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన టీ-షర్టులు, క్యాప్‌లు ధరించిన పాల్గొనేవారు ఒక గొప్ప కారణం కోసం ఏకతాటిపైకి వచ్చినట్లు కనిపించారు. వాక్ అనంతరం అల్పాహార విందుతో పాటు తానా ప్రతినిధులు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలపై వివరణ ఇచ్చారు.

తానా న్యూ ఇంగ్లాండ్ రీజినల్ కోఆర్డినేటర్ మౌనిక మానికొండ, న్యూజెర్సీ నుండి విచ్చేసిన తానా ఫౌండేషన్ ట్రస్టీ సతీష్ మేక ఈ సందర్భంలో మాట్లాడుతూ “మంచి కార్యక్రమాల నిర్వహణలో అందరూ భాగస్వాములు కావాలన్న తలంపుతో తానా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది” అన్నారు.

తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి తన సందేశంలో “ఫౌండేషన్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విద్య, ఆరోగ్యం, సాంస్కృతిక అవగాహన వంటి విభిన్న సేవా కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. సేవకు స్పందిస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద సేవకులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం” అన్నారు.

తానా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ కృష్ణ ప్రసాద్ సోంపల్లి మాట్లాడుతూ “ఇలాంటి ఆరోగ్య కార్యక్రమాలు రాబోయే తరాలకు స్ఫూర్తి కలిగిస్తాయి” అని పేర్కొన్నారు.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గోండి మాట్లాడుతూ “సేవా కార్యక్రమాలలో ఐకమత్యంగా అందరూ పాల్గొనాలి” అని సూచించారు.
ఈ వాక్ విజయవంతం కావడానికి మురళీ పసుమర్తి ప్రధాన నిర్వాహకుడిగా వ్యవహరించగా.. అంకినీడు ప్రసాద్, సూర్య తేలప్రోలు, రమేష్ బాబు తల్లం, అనిల్ పొట్లూరి, చాంద్ పాషా, రామకృష్ణ కొల్లా, సురేష్ దగ్గుబాటి తదితరులు తమ వంతు సహకారం అందించారు. మహిళా వాలంటీర్లు, రన్నర్లు తమ కుటుంబాలతో కలిసి ఉత్సాహంగా పాల్గొనడం విశేషం.
కార్యక్రమం ముగింపులో తానా న్యూ ఇంగ్లాండ్ రీజినల్ కోఆర్డినేటర్ మౌనిక మానికొండ వందన సమర్పణ చేసి ఈవెంట్‌ను విజయవంతంగా ముగించారు.