TANA : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 24వ ద్వైవార్షిక మహాసభలు డిట్రాయిట్ నగరంలోని నోవై సబర్బన్ కలెక్షన్ షోప్లేస్‌లో రెండో రోజు అద్భుతంగా సాగాయి. ఈ మహాసభల్లో ఎన్నో సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో కృష్ణా జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రుల ప్రత్యేక సమావేశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

తానా ప్రస్తుత జాయింట్ సెక్రటరీ వెంకట్ కోగంటి సమన్వయంతో, ఈ.సి సభ్యులు నాగపంచుమర్తి, రవి వడ్లమూడి, రాజా కసుకుర్తి, నరేష్ రావూరి, రాజా సూరపనేని, ఠాగూర్ మల్లినేని, కిరణ్ దుగ్గిరాల, పరుచూరి రామకృష్ణల నేతృత్వంలో ఈ సమావేశం ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎ.బి.వి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, జగన్ పాలనలో కృష్ణా జిల్లాను అన్యాయంగా విడగొట్టి ఎన్టీఆర్ జిల్లాగా మార్చడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ వంటి మహానటుడు కృష్ణా జిల్లాకు చెందుతారని చెప్పుకునే గౌరవాన్ని ఈ విభజన ద్వారా కోల్పోయామని ఆయన ఆవేదన చెందారు. ఈ విషయంపై అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు స్పందిస్తూ, తాను కృష్ణా జిల్లావాసిగానే భావిస్తానని, తన జీవితం విజయవాడలోనే గడిచిందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాను “ఎన్టీఆర్ కృష్ణా జిల్లా”గా మార్చాలని అధికారులను కోరతానని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ప్రముఖులు సంధ్యారాణి, నవీన్ ఎర్నేని, ప్రసాద్ గారపాటి, లావు అంజయ్య చౌదరి, క్యాన్సర్ స్పెషలిస్ట్ నోరి దత్తాత్రేయుడు, తెలుగుటైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. తానా అధ్యక్షుడిగా కొత్తగా బాధ్యతలు స్వీకరించనున్న డా. కొడాలి నరేన్‌కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

కృష్ణా జిల్లా సామాజిక, సాంఘిక, రాజకీయ చరిత్రపై పలువురు వక్తలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. జిల్లావాసుల అభివృద్ధికి ప్రవాసాంధ్రులు ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమానికి హాజరైన నవీన్ ఎర్నేని, జయరాం కోమటి, ప్రసాద్ గారపాటి, నోరి దత్తాత్రేయుడు, చెన్నూరి వెంకట సుబ్బారావు, ఎబివి వెంకటేశ్వరరావు వంటి ప్రముఖులకు సత్కారాలు జరిగాయి.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో శ్రీనివాస వట్టికుట్టి, విజయ్ జెట్టి, నాగకుమార్ బెల్లంకొండ, భాను వేమూరి, శ్రీహరి తదితరులు కీలక పాత్ర పోషించారు. ఈ సమావేశం కృష్ణా జిల్లావాసుల ఐక్యతను, తమ స్వంత జిల్లాపై వారికి ఉన్న అపారమైన అభిమానాన్ని మరోసారి చాటిచెప్పింది.