TANA India Day Parade: ఆగస్టు 15న అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగిన ప్రపంచంలో అతి పెద్దదైన ఇండియా డే పరేడ్ లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) తన ప్రత్యేక ముద్ర వేసింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా తానా సభ్యులు ఉత్సాహభరితంగా పాల్గొని “జీరో ప్లాస్టిక్” సందేశాన్ని సమాజానికి అందించారు.
అంత వేడి వాతావరణంలోనూ రెండు మైళ్ల దూరం జెండాలను ఊపుతూ నడిచిన తానా సభ్యుల ఉత్సాహం, అంకితభావం అందరిని ఆకట్టుకుంది. వేడికీ అలసటకీ లొంగకుండా సమాజం పట్ల, మాతృభూమి పట్ల తమ ప్రేమను ప్రతిబింబించారు. 50 సంవత్సరాల వారసత్వాన్ని జరుపుకుంటున్న తానా ప్రతిసారీలా ఈసారి కూడా తన ప్రతిష్టను చాటుకుంది. తానా ప్రదర్శన చూసి జనసందోహం ఆనందంతో అభివాదాలు చేస్తూ, చేతులు ఊపుతూ ఆహ్వానించారు.

ఈ ఏడాది పరేడ్‌కి పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ -రష్మిక మంధానా గ్రాండ్ మార్షల్స్‌గా హాజరై, అభిమానులకు చిరునవ్వులతో అభివాదం చేశారు.

పరేడ్ అనంతరం తానా ఫౌండేషన్ ట్రస్టీలు శ్రీనివాస్ ఓరుగంటి, సతీష్ మేక తదుపరి తరానికి ప్రేరణనిచ్చే విధంగా భారత్‌లో, అమెరికాలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. తానా స్పెషల్ ప్రాజెక్ట్స్ కోఆర్డినేటర్ నాగ పంచుమర్తి మాట్లాడుతూ “దాతలు ఇచ్చే ప్రతి పైసా ఆడంబరానికి కాకుండా సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్టులకు నిస్వార్థంగా వినియోగించబడుతుంది” అని స్పష్టం చేశారు.

తానా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్, అమెరికన్ స్కూల్ కమిటీ సభ్యుడు కృష్ణ ప్రసాద్ సోంపల్లి మాట్లాడుతూ “ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌లో కేవలం పాల్గొనడం మాత్రమే కాకుండా, సమాజానికి స్ఫూర్తినిచ్చే సమర్థవంతమైన ప్రదర్శన ఇవ్వడం తానా లక్ష్యం” అని తెలిపారు.
ప్రపంచంలో అతి పెద్దదైన న్యూయార్క్ ఇండియా డే పరేడ్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి న్యూయార్క్ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ భర్తవరపు, న్యూ జెర్సీ రీజినల్ కోఆర్డినేటర్ సుధీర్ చంద్ నారెపలేపు, న్యూ ఇంగ్లాండ్ రీజినల్ కోఆర్డినేటర్ మౌనిక మణికొండ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వాలంటీర్లుగా పనిచేసిన నిశాంత్ కొల్లి, సాయి మిన్నకంటి, వినయ్ కూచిపూడి, రావు యలమంచలి, ప్రసాద్ కోయెలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తానా ఉనికి, ఉత్సాహం, సమాజం పట్ల అంకితభావం ఇవన్నీ మరోసారి న్యూయార్క్ వీధుల్లో ప్రతిధ్వనించాయి.
Also Read: నువ్వు లేని లోకంలో ఉండలేనని.. నెలలోపే కోటా శ్రీనివాసరావు సతీమణి కన్నుమూత