TANA: ప్రకృతి విపత్తు మంథా తుఫాన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాల కోసం తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) మానవతా దృక్పథంతో ముందుకు వచ్చింది. తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ లావు, కార్యదర్శి రాజా కసుకుర్తి మార్గదర్శకత్వంలో, సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని దత్తాత్రేయ కాలనీ మరియు బలరాం కాలనీ ప్రాంతాలలో సుమారు 600 మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.
బాధితులకు వేడి భోజనం, అరటి పండ్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేసి, తానా తమ సేవా భావాన్ని మరోసారి ప్రతిబింబించింది. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ, “ప్రకృతి విపత్తుల సమయంలో మనసున్నవారు ముందుకు రావడం సమాజం యొక్క అసలైన బలం. తానా సహకారంతో ఈ రోజు ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు అన్నదానం చేయడం ఎంతో సంతోషంగా ఉంది,” అని తెలిపారు.

అలాగే, భవిష్యత్తులో కూడా వరదలు లేదా ఇతర విపత్తుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు తానా మరియు సూర్యశ్రీ ట్రస్ట్ కలిసి మరింత సహాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ సయ్యద్ సహనాజ్, కార్యదర్శి షేక్ సర్దార్ భాష, గౌరవ సలహాదారుడు మండవ సుబ్బారావు, జనసేవ శ్రీనివాస్, మేడిశెట్టి సుబ్బారావు, కల్లూరి లక్ష్మయ్య మరియు పలువురు సేవాభావులు పాల్గొన్నారు.

తానా ప్రతినిధులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, “మా సేవలు కేవలం విదేశాల్లో మాత్రమే కాకుండా, స్వదేశంలో కూడా ప్రతి అవసరమైన వ్యక్తికి చేరాలనే లక్ష్యంతో కొనసాగుతున్నాయి. సమాజం కోసం తానా ఎల్లప్పుడూ ముందుంటుంది,” అని తెలిపారు.
ఈ కార్యక్రమం తానా సేవా దృక్పథాన్ని ప్రతిబింబిస్తూ, మంథా తుఫాన్ బాధితులకు కొంత ఊరటనిచ్చింది.