TANA: అమెరికాలో తెలుగువారి ఐక్యత కోసం కృషి చేస్తున్న సంఘం తానా. 1977లో ఏర్పడిన ఈ సంఘం ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు పాటుపడుతోంది. అగ్రరాజ్యంలోని తెలుగువారి అభివృద్ధికి కృషి చేస్తోంది. కొత్తగా వచ్చేవారికి సహాకారం అందిస్తోంది. అక్కడే స్థిరపడినవారి వారసులకు తెలుగు పండుగలు, వేడుకలు, ఉత్సవాలతోపాటు, భారతీయ నృత్యాలు, క్రీడలు, భారతీయ భాషలపై శిక్షణ అందిస్తోంది. వేసవి కాలంలో పిల్లల కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తోంది. అనాథ వృద్ధులు, ఆడపిల్లల కోసం సేవా కార్యక్రమాలు చేపడుతోంది. అమెరికాలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని పేద పిల్లలకు కూడా తానా తనవంతు సహాయ సహకారాలు అందిస్తోంది. తానా చేస్తున్న కార్యక్రమాల్లో వేలాదిమంది భాగస్వాములు అవుతున్నారు. తాజాగా తానా మహిళల కోసం కొత్త ఫోరం ప్రారంభించింది. ‘హార్మొనీ హెవెన్: మహిళల వెల్‌నెస్ ఎక్స్చేంజ్’ అనే పేరుతో దీనిని ప్రారంభించింది.
మహిళల కోసం ప్రత్యేకం..
మహిళల అనుభవాలు, ఆలోచనలు పంచుకోవడానికి కొత్తగా హార్మొనీ హెవెన్… మహిళల వెల్‌నెస్ ఎక్స్చేంజ్ ఫోరం ఏర్పాటు చేశారు. దీనిగురించి తానా ఉమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్ సోహిని అయినాల వెల్లడించారు. ఈ ప్లాట్‌ఫాం మహిళలు తమ అనుభవాలు, ఆలోచనలు పంచుకోవడానికి అనువైన వాతావరణం కల్పిస్తుందని తెలిపారు. స్వీయ వ్యక్తీకరణ, పరస్పర మద్దతు కోసం సురక్షితమైన స్థలం సృష్టించడం ఈ ఫోరం ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. భావోద్వేగాల మద్దతు, సాంస్కృతిక సంరక్షణ, గుర్తింపు, వనరుల భాగస్వామ్యం, నెట్‌వర్కింగ్, పరస్పర గౌరవం అనే ఐదు ప్రధాన అంశాల ఆధారంగా దీనిని ఏర్పాటు చేసినట్లు వివరించారు.
తమను తాము ఆవిష్కరించుకునేలా..
‘హార్మొనీ హెవెన్’ మహిళలు తమను తాము ఆవిష్కరించుకునేలా, తమ భావాలను వ్యక్తపరిచేలా కొత్త అనుభూతి చెందేలా కృషి చేస్తుందని సోహిని వెల్లడించారు. హార్మొనీ హెవెన్ ప్లాన్ చేసిన ఈవెంట్‌లు పేరెంటింగ్, ఆర్థిక సాక్షరత నుంచి మానసిక ఆరోగ్యం, రోపోజ్, కాలేజ్ కౌన్సెలింగ్ వరకు విస్తృత శ్రేణి అంశాలను కవర్ చేస్తాయని వివరించారు. సమాజం భావాన్ని పెంపొందించడానికి, వివిధ ముఖ్యమైన అంశాలపై విలువైన చర్చలు చేయడానికి వర్క్‌షాప్‌లు, సాంస్కృతిక విషయాలపై మద్దతు వంటి వాటిని ఈ ఫోరమ్ ద్వారా అందిస్తామని తెలిపారు.
విజయవంతంగా మొదటి ఈవెంట్..
‘‘నావిగేటింగ్ ది టీనేజ్ ఇయర్స్ అండ్ ప్రొవైడింగ్ సపోర్ట్’’ పేరుతో హార్మొనీ హెవెన్ ఫోరం నిర్వహించిన మొదటి ఈవెంట్ విజయవంతమైంది. ఈ ఈవెంట్ మానసిక సమస్యలను తొలగించడంపై దృష్టిపెట్టింది. లోతైన చర్చలకు వేదికగా నిలిచింది. ఈ ఈవెంట్‌లో డాక్టర్ గౌరి తుమ్మల, డాక్టర్ ఆయేషా సునేజా–సేయమూర్, నమ్‌రత దేసాయ్ దేవాన్, పావని గద్దె తో సహా నిపుణుల బృందం పాల్గొంది.
రెండో కార్యక్రమానికి సన్నాహాలు..
మొదటి కార్యక్రమం విజయవంతం కావడంతో హార్మొనీ హెæవెన్ తన తదుపరి ఈవెంట్‌కు సన్నాహాలు చేస్తోంది, ది హార్మోనల్ జర్నీ ఆఫ్ ఎ ఉమెన్ పేరుతో దీనిని నిర్వహించబోతోంది. ఇది పరిపక్వత, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్, మోనోపాజ్ వంటి ముఖ్యమైన అంశాలను కవర్ చేస్తుంది. ‘సంక్రాంతి రెస్టారెంట్’ యజమాని కవిత కాట్రగడ్డ ఈవెంట్‌కు స్థలం ఇవ్వడంతోపాటు పూర్తి మద్దతు ఇచ్చారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఈవెంట్లు నిర్వహించేలా హార్మొని హెవెన్ చర్యలు తీసుకుంటుందని, మహిళలకు ఉపయోగపడేలా కార్యక్రమాలను తీర్చిదిద్దుతుందని తానా ఉమెన్ సర్వీసెస్ కో ఆర్డినేటర్ సోహిని అయినాల తెలిపారు.