TANA 24th Conference : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతి రెండు సంవత్సరాలకోసారి ఘనంగా నిర్వహించే ద్వైవార్షిక మహాసభలకు ఈసారి ప్రత్యేకతలు పెరిగిపోతున్నాయి. జూలై 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు అమెరికా డిట్రాయిట్ సబర్బన్ నోవైలోని సబర్బన్ కలెక్షన్ షోప్లేస్‌లో 24వ తానా మహాసభలు అత్యంత అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇప్పటికే ఈ మహాసభలకు అన్ని ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. అమెరికా నలుమూలల నుండి వచ్చనున్న తెలుగు ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, ప్రముఖులు, సినీ ప్రముఖులు హాజరుకాబోతున్నారు.
ఇటీవల ఈ మహాసభలకు మరో విశేష ఆకర్షణగా టాలీవుడ్ అగ్ర నటి సమంత రానున్నట్లు ప్రకటించడమే ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. సమంత తానా మహాసభలకు హాజరయ్యే అంశం అధికారికంగా నిర్ధారించబడటంతో మహాసభల నిర్వహకుల్లోనూ, అభిమానుల్లోనూ కొత్త ఉత్సాహం నెలకొంది. సమంత మొదటిసారి తెలుగు మహాసభలకు హాజరవుతోంది.
టాలీవుడ్ యూత్ ఆల్‌టైమ్ ఫేవరెట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న సమంత.. కెరీర్ ప్రారంభం నుంచే వరుస విజయాలతో తన ప్రత్యేకతను చాటుకుంది. స్టార్ హీరోలతో చేసిన పలు హిట్ సినిమాలతో స్టార్‌డమ్ సాధించింది. ఇటీవల కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు స్వల్ప విరామం తీసుకున్నప్పటికీ, మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చి సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అంతేకాదు, నిర్మాతగా కూడా మారి ‘శుభం’ వంటి చిత్రాలను నిర్మించడం ప్రారంభించింది.
సమంత తానా మహాసభలకు హాజరుకాబోతున్న వార్త తెలియగానే అమెరికాలోని తెలుగు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమంతతోపాటు హీరో నిఖిల్, మరో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ కూడా హాజరుకాబోతుండడం విశేషం. ఈ ముగ్గురు నటులను ప్రత్యక్షంగా చూసే అవకాశం రావడంతో అక్కడి ప్రేక్షకుల్లో వేడుకలపై ఆసక్తి పెరిగింది. తానా మహాసభలు మరింత వైభవంగా సాగేందుకు ఈ వార్త మరింత జోష్ తీసుకొచ్చినట్లైంది.
ఈ సారి తానా మహాసభలు తెలుగువారి కూటమిగా, సంస్కృతికి ప్రతీకగా మరపురాని ఘట్టంగా నిలిచే అవకాశముంది.