NRI TDP : అమెరికాలోని ఛార్లెట్ నగరంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి (మార్కాపురం), కూన రవికుమార్ (ఆముదాలవలస)తో ఎన్నారై టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు. పని దినం అయినప్పటికీ, దాదాపు 200 మంది ఛార్లెట్ ఎన్నారైలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఛార్లెట్‌లోని వెడ్డింగ్‌టన్ రోడ్డులో ఉన్న బావర్చి ఇండియన్ గ్రిల్ రెస్టారెంట్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

Also Read : నాట్స్ మేరీల్యాండ్ చాప్టర్ ప్రారంభం.. ఉగాది వేడుకలతో సాంస్కృతిక సందడి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. తొలుత సినిమా నటుడి పార్టీ అని విమర్శించిన వారే తర్వాత ఆ పార్టీలో చేరి అధికారం చేపట్టారని ఆయన అన్నారు. నేడు అమెరికాలో లక్షలాది మంది తెలుగువారు ఐటీ రంగంలో రాణిస్తున్నారంటే దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కారణమని కొనియాడారు. చంద్రబాబు విజనరీ నాయకత్వం మరే రాజకీయ నాయకుడికీ లేదని ఆయన ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడిపించేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని, ఈ ప్రయత్నంలో ఎన్నారైలు ఆయనకు మద్దతు ఇవ్వాలని కోరారు. గతంలో ఎన్నికల సమయంలో పార్టీని గెలిపించినట్లే, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆయన ఎన్నారైలకు విజ్ఞప్తి చేశారు.

మరో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి తమవంతు సహకారం అందించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న మంచి పనులకు, ప్రవేశపెడుతున్న పథకాలకు మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమాన్ని ఛార్లెట్ ఎన్నారై టీడీపీ స్థానిక నాయకులు నాగ పంచుమర్తి, ఠాగూర్ మల్లినేని, రమేష్ ముకుళ్ళ, సతీష్ నాగభైరవ, రాజేష్ వెలమల మరియు ఇతర ఎన్నారై టీడీపీ కార్యవర్గ సభ్యులు సమన్వయంతో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. చివరగా, ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read : పెద్ద కొడుకు పుట్టినరోజున చిన్న కొడుక్కి ఇలాంటి పరిస్థితి వచ్చింది – పవన్ కళ్యాణ్