Gulf workers : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) అనగానే తెలుగు రాష్ట్రాల వలసలు గుర్తొస్తాయి. స్థానికంగా ఉపాధి లేక పని కోసం దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతం నుంచి లక్షల మంది గల్ఫ్ దేశాలక వెళ్లొస్తున్నారు. కొంతమంది ఆర్థికంగా స్థిరపడుతున్నారు. కొంతమంది అక్కడి పరిస్థితులకు అడ్జెస్ట్ కాలేక అనారోగ్యాలతో ఇళ్లు చేరుతున్నారు. కొందరు అక్కడే కాలం చేసి శవ పేటికల్లో స్వగ్రామాలకు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు బాధిత కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగులుస్తునాయి. గల్ఫ్ బాధితులను ఆదుకోవాలనే డిమాండ్ కూడా చాలాకాలంగా వస్తోంది. ఈ నేపథ్యంలో భారతీయ వలస కార్మికులను ఆదుకునేందకు భారత విదేశాంగ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
సాధారణంగా మరణించినా..
అక్కడికి ఉపాధి కోసం వెళ్లే కార్మికులకు, పనిచేస్తున్న కార్మికులకు ఇంతకాలం ప్రమాదవశాత్తు మరణిస్తేనే బీమా లబ్ధి చేకూరేది. ఇప్పుడు అమలు చేస్తున్న కొత్త విధానంతో సాధారణంగా మరణించినా బాధిత కుటుంబానికి లబ్ధి కలుగుతుంది. ఉపాధి కోసం యూఏఈ వెళ్లి అక్కడ వివిధ సంస్థల్లో పని చేస్తున్న భారతీయ కార్మికులకు లైఫ్ ప్రొటెక్షన్ ప్లాన్(ఎల్‌పీపీ) పథకం వర్తింపజేయాలని భారతీయ కాన్సులేట్ అధికారులు ఇటీవల నిర్ణయించారు.
5.50 లక్షల మందికి ప్రయోజనం..
ఈ కొత్త పథకంతో యూఏఈలో పనిచేస్తున్న తెలంగాణ వలస కార్మికులు 5.50 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది. ఓరియంట్ బీమా కంఎనీ మధ్యవర్తిత్వంతో వలస కార్మికులకు ఎల్‌పీపీని అమలు చేయనుంది. ఇదివరకు ప్రమాదవశాత్తు మరణించిన వారికి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు బీమా ప్రయోజనాలు దక్కేవి. ఇక సాధారణ మరణాలకు సైతం లబ్ధి చేకూరుతుంది. యూఏఈ తరణహాలో సౌదీ అరేబియా, ఒమన్, బహ్రెయిన్, కువైట్, ఖతార్ దేశాల్లోనూ భారతీయులకు బీమా వర్తింప చేయాలని కార్మిక సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.
అనారోగ్య సమస్యలే ఎక్కువ…
గల్ఫ్ దేశాల్లో ప్రమాదశాత్తు జరిగే మరణాలకంటే అనారోగ్యం కారణంగానే ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారు. గడిచిన నాలుగేళ్లలో తెలంగాణ వలస కార్మికులు 2 వేల మంది మరణించారు. కుటుంబాలను విడిచి దూరంగా ఉంంటూ మనో వేదన చెందుతున్నారు. ఆర్థిక సమస్యలు, పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలతో సతమతం అవుతున్న వలస కార్మికులు గల్ఫ్ దేశాల్లో ఉంటూ అనారోగ్యానికి గురవుతున్నారు. ఎల్‌పీపీ పథకం అన్ని గల్ఫ్ దేశాల్లోని వలస కార్మికులకు వర్తింపజేస్తూ విదేశాంగ శాఖ నిర్ణయం తీసుకుంటే ఎంతో మంది కార్మికుల కుటుంబాలకు మేలు చేసినట్లు అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.