New Jersey : శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ మహా శివరాత్రి. ఈ పర్వదినాన అగ్రరాజ్యం అమెరికా ‘హర హర మహాదేవ శంభో శంకర’ నినాదంతో మార్మోగింది. ఎన్నారైలు ముక్తకంఠంలో శివనామ స్మరణ చేశారు. న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్‌లో సాయిదత్త పీఠం శ్రీశివ విష్ణు ఆలయంలో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించారు. రఘు శర్మ శంకరమంచి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. పరమ శివుడికి పూజలు చేశారు. మహా పుణ్యక్షేత్రాన్ని తలపించేలా శ్రీశివ విష్ణు ఆలయ ప్రాంగణ శివనామస్మరణతో మార్మోగింది.
9 వేల మంది హాజరు..
న్యూజెర్సీలోని శ్రీశివ విష్ణు ఆలయంలో నిర్వహించిన మహా శివరాత్రి వేడుకల్లో అమెరికాలోని ఎన్నారైలు సుమారు 9 వేల మంది పాల్గొన్నారు. చలిని సైతం లెక్కచేయకుండా దైవ దర్శనం కోసం బారులు తీశారు. శివనామస్మరణ చేసుకుంటూ పరమ శివుడిని దర్శించుకున్నారు. పరమేశ్వరుడికి అభిషేకాలు చేశారు. భక్తిపారవశ్యంతో ఆలయ ప్రాంగణం అలరారింది.
ఉపవాసాలు, జాగరణ..
ఇక భారత్‌లో జరిగినట్లుగానే అమెరికాలోనూ 8, 9 తేదీల్లో మహాశివరాత్రి వేడుకలు నిర్వహించారు. రఘుశర్మ శంకరమంచి ఆధ్వర్యంలో పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నారైలు భక్తిశ్రద్ధలతో మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు. పూజల అనంతరం ఉపవాసాలు ఉన్నారు. రాత్రి జాగరణ చేశారు. భజనలు, శివనామ సంకీర్తనలు, శివపంచాక్షరి మంత్రాలు, శివతాండవ స్త్రోత్రాలు పఠించారు. దైవ సన్నిధిలో ఉండి భక్తిభావంతో పులకించిపోయారు.
శివ కల్యాణం..
శుక్రవారం మహా శివరాత్రి వేడుకల్లో పాల్గొన్న భక్తులు శనివారం శివకల్యాణంలోనూ పాల్గొన్నారు. పార్వతీ పరమేశ్వరుల కల్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు. ఆది దంపతుల కళ్యాణం తిలకించిన ఎన్నారైలు పులకించిపోయారు. మహా శివరాత్రి విశిష్టతను రఘుశర్మ శంకరమంచి భక్తులకు వివరించారు. సర్వాంతర్యామి శివుడి గాథలు వినిపించారు.