TANA 2025 : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో 2025 జూలై 3, 4, 5 తేదీల్లో జరగనున్న 24వ ద్వైవార్షిక మహాసభలకు ప్రాథమిక కార్యక్రమాల భాగంగా దేశవ్యాప్తంగా వివిధ నగరాలలో ‘ధీమ్ తానా’ పోటీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా లాస్ ఏంజెల్స్ నగరంలో జరిగిన పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నందన్ పొట్లూరి గారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం క్లాసికల్ సోలో సింగింగ్, ఫిల్మీ సింగింగ్, గ్రూప్ డ్యాన్స్ విభాగాల్లో యువ కళాకారులు తమ ప్రతిభను ఆవిష్కరించారు. జూనియర్ మరియు సబ్ జూనియర్ కేటగిరీల్లో పాల్గొన్న చిన్నారులు తమ పాటలు, నృత్యాలతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు. ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

కార్యక్రమానికి టాస్క్, లాటా, నాట్స్, ఆలంబన ఫౌండేషన్, ఏకం USA, లారా సంస్థల ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు మెడల్స్ మరియు ట్రోఫీలు ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి లాస్ ఏంజెల్స్ తానా నాయకులు, లోకల్ ఆర్గనైజేషన్ సభ్యులు తమ అసామాన్యమైన కృషిని చేశారు. పూర్వపు తానా రీజినల్ ప్రతినిధి సురేష్ కందేపు మాట్లాడుతూ తానా టీమ్ స్క్వైర్ ప్రాజెక్టు గురించి వివరించారు. ప్రస్తుత తానా రీజినల్ ప్రతినిధి హేమకుమార్ గొట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ విధంగా లాస్ ఏంజెల్స్ లోని ‘ధీమ్ తానా – 2025’ పోటీలు ఉత్తమ ప్రదర్శనలతో, మంచి సంబర వాతావరణంలో ముగిశాయి. తానా మహాసభలకు ఇది ఒక మంచి నాంది అనిపించింది.
