https://oktelugu.com/

Study US: అమెరికా చదువులు మరీ.. 35 శాతం పెరిగిన భారతీయ విద్యార్థులు!

అమెరికా యూనివర్సిటీల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లే విద్యార్థుల తాకిడి పెరుగుతోంది. క్రమంగా కరోనా ముందు పరిస్థితికి చేరుకుంటోంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 14, 2023 3:22 pm
    Study US

    Study US

    Follow us on

    Study US: విదేశీ చదువులపై భారతీయుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. తమ పిల్లల మంచి భవిష్యత్‌ కోసం తల్లిదండ్రులు పిల్లలను ఫారిన్‌ పంపేందుకు వెనుకాడడం లేదు. మరోవైపు విద్యార్థులు కూడా విదేశాల్లో చదువుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఫలితంగా ఏటా విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇక ఫారిన్‌ చదువులు అనగానే అందరూ అమెరికా, బ్రిటన్‌ గురించే ఆలోచిస్తారు. అమెరికా యూనివర్సిటీల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లే విద్యార్థుల తాకిడి పెరుగుతోంది. క్రమంగా కరోనా ముందు పరిస్థితికి చేరుకుంటోంది. అమెరికా విదేశాంగ శాఖ, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఓపెన్‌ డోర్స్‌ అనే స్వచంద సంస్థ గణాంకాల ప్రకారం 2022–23 విద్యాసంవత్సరానికి అమెరికా యూనివర్సిటీల్లో చేరిన అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 12 శాతం పెరిగింది. 40 ఏళ్లలో ఈ స్థాయిలో విద్యార్థులు పెరగడం ఇదే మొదటిసారి. మరోవైపు ఈ ఏడాది విదేశీ విద్యార్థుల్లో భారత్‌ నుంచి వచ్చిన వారి సంఖ్య 35 శాతం పెరగడం గమనార్హం.

    రెండో స్థానం మనదే..
    అమెరికా యూనివర్సిటీల్లో నమోదు చేసుకున్న విదేశీ విద్యార్థుల్లో చైనా అగ్రస్థానంలో కొనసాగుతోంది. చైనా నుంచి దాదాపు 2.9 లక్షల మంది( 27 శాతం) ఉండగా.. రెండో స్థానంలో ఉన్న భారత్‌ నుంచి 2,69,000 మంది(25శాతం) అమెరికాలో ఉన్నత చదువుల కోసం వేర్వేరు విశ్వవిద్యాలయాల్లో నమోదు చేసుకున్నారు. మొత్తం విదేశీ విద్యార్థుల్లో ఈ రెండు దేశాలనుంచే దాదాపు 53 శాతం ఉన్నారు. భారత్‌నుంచి ఏటా ఈ సంఖ్య పెరుగుతుండగా చైనా నుంచి మాత్రం గత మూడేళ్లుగా తగ్గుముఖం పడుతోంది. అమెరికాలో పైచదువులు చదివే విదేశీ విద్యార్థుల సంఖ్య ఏటా పది లక్షలకు పైగా ఉండగా, అందులో 25 శాతం మంది భారతీయ విద్యార్థులే ఉన్నారని, వరసగా మూడో ఏడాది భారత్‌ నుంచి అమెరికాకు రికార్డు స్థాయిలో ప్రయాణం చేశారని ఓపెన్‌ డోర్స్‌ నివేదిక పేర్కొంది.

    ఏయే దేశాలు ఎంత శాతం..
    చెనా, భారత్‌ల తర్వాత దక్షిణ కొరియా,కెనడా, వియత్నాం, తైవాన్, నైజీరియా దేశాలున్నాయి. ఈ ఏడాది మాత్రం బంగ్లాదేశ్‌( 28 శాతం), కొలంబియా, ఘనా(32%), భారత్‌(35%), ఇటలీ, నేపాల్‌(28%), పాకిస్థాన్‌(16%), స్పెయిన్‌ దేశాల నుంచి అమెరికా బాట పట్టిన విద్యార్థుల్లో భారీ పెరుగుదల కనిపించింది.

    సైన్, బిజిన్‌స్‌ కోర్సులపై మక్కువ..
    అమెరికా గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లలో విదేశీ విద్యార్థులు ఎక్కువగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, బిజినెస్‌ విభాగాల్లోనే నమోదు చేసుకుంటున్నారు. కొంత కాలంగా ఈ ప్రోగ్రామ్‌లలో 21 శాతం పెరుగుదల కనిపించగా, యుజీలలో ఒక శాతం పెరుగుదల కనిపించింది. గణితం, కంప్యూటర్‌ సైన్స్‌ ప్రోగ్రామ్‌లలో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. ఆ తర్వాత ఇంజనీరింగ్, బిజినెస్‌ విభాగాలున్నాయి.

    24 రాష్ట్రాల్లో భారతీయ విద్యార్థులు..
    ఇక అంతర్జాతీయ విద్యార్థులకు గమ్యస్థానాలుగా ఉన్న ఇల్లినోయ్, మిషిగాన్‌ , టెక్సాస్‌ సహా 24 రాష్ట్రాల్లో చైనాకన్నా భారతీయ విద్యార్థులే అధికంగా ఉండడం విశేషం. కొవిడ్‌కంటే ముందు( 2018లో) అమెరికాలో ఉన్నతవిద్య కోసం నమోదు చేసుకునే విదేశీ విద్యార్థుల సంఖ్య 2015–16 నుంచి ఏటా దాదాపు 11 లక్షలుగా ఉండేది. అయితే కొవిడ్‌ తర్వాత రెండేళ్లపాటు ఈ సంఖ్య తగ్గింది. తాజాగా ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూ ఈ ఏడాది 11 లక్షలకు చేరువైంది.

    విదేశీ విద్యార్థులను గణనీయంగా ఆకర్షిస్తున్నప్పటికీ అమెరికా విశ్వవిద్యాలయాలు స్థానిక విద్యార్థులను రప్పించడంలోమాత్రం అష్టకష్టాలు పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 2009 10 నుంచి మొట్టమొదటిసారి అమెరికాలోని అంతర్జాతీయ గ్రాడ్యుయేట్‌ విద్యార్థుల్లో భారత్‌ చైనాను దాటేసిందని ఓపెన్‌ డోర్స్‌ నివేదిక గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఈ ఏడాది భారతీయ గ్రాడ్యుయట్‌ విద్యార్థుల సంఖ్య 63 శాతం పెరిగి 1,65,936కు చేరుకుందని, గత ఏడాదితో పోలిస్తే దాదాపు 64 వేల మంది విద్యార్థులు పెరగ్గా, అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థుల సంఖ్య కూడా 16 శాతం మేర పెరిగింది.