UK MP: ఇటీవలే బ్రిటన్ పార్లమెంటు ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో వామపక్ష లేబర్‌పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో భాగంగా అక్కడి పార్లమెంటు దిగువ సభకు 27 మంది భారత సంతతి వ్యక్తులు ఎన్నికయ్యారు. వారు పార్లమెంటు సభ్యులుగా ప్రమాణం చేస్తున్నారు. ఈ క్రమంలో 27 మంది భారత సంతతి ఎంపీలో ఒకరైన శివాని రాజా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో తాను భగవద్గీతపై ప్రమాణం చేసినట్లు తెలిపారు.
లైసెస్టర్ ఈస్ట్ నుంచి ఎన్నిక..
శివాని రాజా బ్రిటన్‌లోని లేసెస్టర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి కన్జర్వేటివ్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. ఆమె గెలుపుతో లేబర్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. 37 ఏళ్లుగా లైసెస్టర్ ఈస్ట్ లేబర్ పార్టీ కంచుకోట. 37 ఏళ్లుగా ఇక్కడ ఆ పార్టీ విజయం సాధిస్తోంది. తాజా ఎన్నికల్లో భారత సంతతికి చెందిన శివాని రాజా ఆ రికార్డును బద్ధలు కొట్టింది. ఈ క్రమంలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన వీడియోను ఆమె ఎక్స్‌లో షేర్ చేశారు. లైసెస్టర్ ఈస్ట్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంటులో ప్రమాణం చేయడం గొప్ప గౌరవంగా భావిస్తునానని తెలిపారు. రాజుకు విధేయతగా ఉంటానని గీతపై ప్రమాణం చేయడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. గుజరాత్ మూలాలు ఉన్న 29 ఏళ్ల ఈ శివాని రాజా వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు.
లేబర్‌పార్టీ విజయం..
ఇదిలా ఉంటే 650 స్థానాలున్న పార్లమెంటుకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ 412 స్థానాలు గెలిచింది. అధికార కన్జర్వేటివ్ పార్టీ కేవలం 121 స్థానాలకు పరిమితమైంది. దీంతో ప్రధాని రిషి సునక్ అధికారం కోల్పోయారు. బ్రిటన్ నూతన ప్రధానిగా కీర్ స్టార్మర్ బాధ్యతలు స్వీకరించారు.
ప్రపంచానికి మార్గదర్శినిగా భగవద్గీత..
ఇక మన భగవద్గీత అనేక అద్భుతమైన రహస్యాలను తనలో ఇముడ్చుకుంది. ఇది అసంబద్ధమైన వాటిలో ఆచరణాత్మకం కాని వాటిని దాటి, వాస్తవిక జీవితానికి దగ్గరగా, స్పష్టమైన సమాధానాలను కలిగి ఉంది. భగవద్గీత దైవత్వం, మోక్షం గురించే కాకుండా అనేక జీవిత సత్యాలను తెలియజేస్తుంది. గీతలోని ప్రధాన అంశాలను అర్థం చేసుకోవడానికి తాత్వికమైన మనసు కావాలి. ఆధ్యాత్మిక భావనలు కలిగిన వారికి మాత్రమే పుస్తకం మంచి మార్గదర్శినిగా నిలుస్తుంది. భగవద్గీతను చదివి పునీతులైన వారిలో మన భారతీయులే కాక ఎందరో విదేశీయులు కూడా ఉన్నారు. గీతను చదివి ఆచరించి సారాన్ని ఇముడ్చుకుని, మార్గదర్శకత్వము పొందిన వారిలో ఎందరో యోగులు, మహనీయులు, తాత్త్వికులు ఉన్నారు. అందుకే విదేశీయులు, విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా పలు సందర్భాల్లో భగవద్గీతపై ప్రమాణం చేస్తున్నారు. వెంట ఉంచుకుంటున్నారు.
స్పేస్‌లోకి తీసుకెళ్లిన సునీత..
ఇదిలా ఉంటే అమెరికాకు చెందిన భారత సంతతి ఆస్ట్రోనాయిడ్ సునీతా విలియమ్స్ కూడా గతంలో భగవద్గీతను అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. ఇప్పటికే రెండుసార్లు అంతరిక్షంలోకి వెళ్లిన సునీత చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో తాను స్పేస్‌లోకి వెళ్లే సమయంలో భగవద్గీతను వెంట తీసుకెళ్లారు. మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లిన సమయంలో ఆమె తన వెంట వినాయకుడి ప్రతిమను వెంట తీసుకెళ్లారు.
భారత్‌లో భగవద్గీతపై ప్రమాణం..
ఇక మన దేశంలోని కోర్టుల్లో భగవద్గీతపై ప్రమాణం చేయించడం 1960 నుంచి వస్తుంది. గతంలో మత గ్రంథాలపై ప్రమాణం చేయించేవారు. కానీ 1960 నాటి లా కమిషన్ భగవద్గీతను ప్రమాణానికి ప్రాతిపదికగా సూచించింది. దీంతో అప్పటి నుంచి మన న్యాయస్థానాల్లో నేరస్తులు, సాక్షులు భగవద్గీతపైనే ప్రమాణం చేస్తున్నారు.