America: కేరళలో పుట్టారు.. ఉన్నత చదువులు చదివారు.. ఉద్యోగం నిమిత్తం అమెరికాలో అడుగుపెట్టారు. ఆర్థికంగా స్థిరత్వం సంపాదించారు. దాంపత్యానికి ప్రతీకగా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు.. సాఫీగా సాగిపోతున్న వారి సంసారంలో అనుకోకుండా జరిగిన ఓ ఘటన పెను చిచ్చును రేపింది. దీంతో ఆ కుటుంబం మొత్తం చిన్నా భిన్నామైపోయింది..
అమెరికాలోని కాలిఫోర్నియా శాన్ మాటియో లో కేరళ రాష్ట్రానికి చెందిన భారత సంతతి కుటుంబం ఆనంద్ సుజిత్ హెన్రీ(42), భార్య అలిస్ ప్రియాంక (40), వారి కవల పిల్లలు నోహ్, నిథాన్(4) తో కలిసి అలమెడ లాస్ పుల గాస్ లో నివసిస్తున్నారు. ఆర్థికంగా స్థిరపడడంతో ఈ కుటుంబానికి ఎటువంటి సమస్యలు లేవు. అయితే సుజిత్ బంధువు ఒకరు పలుమార్లు ఫోన్ చేయగా అతడు లిఫ్ట్ చేయలేదు. ప్రియాంకకు ఫోన్ చేసినా అదే పరిస్థితి. దీంతో అనుమానం వచ్చి అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. అతడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సుజిత్ ఇంటిని తనిఖీ చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో అతడి ఇంటి కిటికీలు, తలుపులు మొత్తం మూసి ఉన్నాయి. అయితే ఒక కిటికీ మాత్రం కొంచెం తేల్చి ఉంది.. పోలీసులు తమ వద్ద ఉన్న తుపాకీతో ఆ కిటికి ద్వారాన్ని కాల్చి దాని మీదుగా ఇంట్లోకి వెళ్లారు.
లోపలికి వెళ్ళిన పోలీసులకు దిగ్బ్రాంతి కరమైన దృశ్యాలు కనిపించాయి. సుజిత్, భార్య ప్రియాంక రక్తపు మడుగులో విగత జీవులై పడి ఉన్నారు. వారి శరీరంపై తుపాకీతో కాల్చిన గాయాలు ఉన్నాయి. పక్కనే ఓ తుపాకి, తూటాలు ఉండగా.. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. కొంత దూరంలోనే పడక సుజిత్ ఇద్దరి కవల పిల్లల మృతదేహాలు పడి ఉన్నాయి. ఆ ఇద్దరి పిల్లల మృతదేహాలపై ఎటువంటి గాయాలు లేవు. పోస్టుమార్టం అనంతరం వారి మరణానికి కారణం ఏంటనేది తేలుతుందని పోలీసులు చెబుతున్నారు.
కాగా సుజిత్ చాలా సంవత్సరాల క్రితమే తన కుటుంబంతో అమెరికా వెళ్లిపోయాడు. అక్కడ భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఆర్థికంగా స్థిరత్వం సాధించారు. పెద్దగా ఇబ్బందులు కూడా లేవు. అలాంటప్పుడు మీరు ఎందుకు చనిపోయారా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. పోనీ ఎవరైనా డబ్బు కోసం వచ్చి వీరిని చంపేశారా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు పిల్లలపై ఎటువంటి గాయాలు లేకపోవడం, సుజిత్, ప్రియాంక మాత్రమే రక్తపు మడుగులో ఉండటం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి.. ముందు పిల్లలను చంపేసి.. తర్వాత వారు ఆత్మహత్య చేసుకుని ఉంటారా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఒకే కుటుంబం అనుమానాస్పద స్థితి మృతిచెందడం అటు అమెరికాలోని కాలిఫోర్నియాలోనే కాదు కేరళలోనూ సంచలనాన్ని రేకెత్తించింది.