https://oktelugu.com/

US Citizenship: అగ్రరాజ్యం వృద్ధిలో భారతీయులే ముందు.. మన వాటా ఎంతో తెలుసా?

భారతీయులు అమెరికాకు వెళ్లడం 17వ శతాబ్దం నుంచే మొదలైంది. కొందరు అక్కడే జీవిస్తున్నారు. వాళ్ల అవసరాల కోసం నాడు మనవాళ్లను సేవకులుగా తీసుకెళ్లారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 25, 2024 / 03:36 PM IST

    US Citizenship

    Follow us on

    US Citizenship: భారత్‌ లేనిదే అమెరికా లేదు.. స్వయంగా ఆ దేశ అధినేతలే అంగీకరిస్తున్న మాట ఇది. మన దేశంలో చదువుకుంటున్న అనేక మంది నిపుణులు.. అధిక వేతనాలు.. ఆధునిక సౌకర్యాల నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికాకు వలస వెళ్తున్నారు. ఆదేశ అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు. మన నైపుణ్యంతోనే అమెరికా అభివృద్ధి మరింత పుంజుకుంటోంది. తాజా నివేదిక ప్రకారం అమెరికాలో నివసిస్తున్న భారతీయుల్లో 65,960 మందికి అగ్రరాజ్యం పౌరసత్వం అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. అనేకమంది మనవారు అక్కడ ఎప్పటి నుంచో నివసిస్తున్నా అందరికీ పౌరసత్వం లేదు. భారత్‌లో పుట్టి అమెరికాలో జీవిస్తున్నవారిలో దాదాపు 42 శాతం మందికి అక్కడి పౌరసత్వం పొందే అర్హత లేదని సీఆర్‌ఎస్‌ నివేదిక తెలుపుతోంది. 2023 నాటికి గ్రీన్‌ కార్డ్‌ లేదా లీగల్‌ పర్మినెంట్‌ రెసిడెన్సీ వున్న 2,90,000 మంది భారతీయులకు సహజ విధానంలో పౌరసత్వం పొందే అవకాశం ఉంది.

    అమెరికా జనాభాలో 14 శాతం మనమే..
    ఇక అమెరికాలో నివసిస్తున్న విదేశీయులు ఆ దేశ జనాభాలో 14 శాతం వున్నట్లు అమెరికన్‌ కమ్యూనిటీ సర్వే డేటా చెబుతోంది. గతంతో పోల్చుకుంటే అమెరికాలో నివసించే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. సాఫ్ట్‌వేర్‌ రంగం పెరుగుతున్న కొద్దీ మనవాళ్ల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఉన్నత చదువుల కోసం వెళ్లే విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోంది. 50 లక్షల మందికి పైగా భారతీయులు అమెరికాలో నివసిస్తున్నారు.

    17వ శతాబ్దం నుంచే వలస..
    ఇక భారతీయులు అమెరికాకు వెళ్లడం 17వ శతాబ్దం నుంచే మొదలైంది. కొందరు అక్కడే జీవిస్తున్నారు. వాళ్ల అవసరాల కోసం నాడు మనవాళ్లను సేవకులుగా తీసుకెళ్లారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇది మరో రూపం తీసుకుంది. కొంత మంది ఉపాధి, మరికొంత మంది విద్య కోసం అమెరికా వెళ్లారు. గడిచిన నాలుగు దశాబ్దాలలో ఆ సంఖ్య గణనీయంగా పెరిగింది.

    ఉన్నత చదువులతోనే..
    మన దేశ జనాభా అమెరికాలో పెరగడానికి ప్రధాన కారణం నాణ్యమైన ఉన్నత విద్య. దానికి మూలం మన ప్రతిభ. 1920ల్లో మన ప్రతిభ చూపించి వాళ్లను గెలిచినవారిలో మన యల్లాప్రగడ సుబ్బారావు పేరెన్నిక కన్నవారు. గోవింద్‌ బిహారీ లాల్‌ కూడా చాలా గొప్పవారు. జర్నలిజంలో ప్రతిష్ఠాత్మకమైన పులిట్జర్‌ పురస్కారాన్ని పొందిన తొలి భారతీయుడు. అక్కడి నుంచి మొదలైన భారతీయ ప్రతిభా ప్రయాణం నేడు ఐటీ దిగ్గజాలు సత్య నాదెండ్ల, సుందర పిచాయ్‌ వంటివారు వరకూ సాగింది. భారతీయ మూలాలు కలిగిన కమలా హ్యారిస్‌ ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. బానిసలుగా వెళ్లి బాసుల స్థాయికి భారతీయులు ఎదగడం గర్వకారణం. వ్యాపార, వాణిజ్యాల్లో మనవారు అక్కడ అద్భుతంగా రాణిస్తున్నారు.

    మాన వనరుల్లో మనమే..
    మానవ వనరులలో మనది గౌరవనీయమైన స్థానం. వైట్‌ హౌస్‌ లోనూ మనవారి ప్రాతినిధ్యం పెరుగుతోంది. అమెరికా ఎన్నికల్లో ఆర్ధిక సహాయం అందించేవారిలో మనవాళ్లు కీలకంగా వున్నారు. కాకపోతే, రాజకీయ భాగస్వామ్యంలో మాత్రం వెనుకబడి వున్నారు. అమెరికాలో ఓటు హక్కున్న మనవాళ్లు చాలామంది అస్సలు ఓటే వేయరని మన వాళ్లే అంటారు.

    అంతర్జాతీయ సంబంధాలలో..
    ఇక అంతర్జాతీయ సంబంధాల్లో అమెరికా ఒకప్పుడు పాకిస్థాన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేది. పీవీ నర్సింహారావు ప్రధాన మంత్రి అయ్యాక, మన విదేశాంగ విధానంలో కొత్త వ్యూహాలు అల్లడం మొదలుపెట్టారు. అందులో అమెరికా బంధాలు కీలకమైనవి. చైనాతో ఎప్పటికైనా ఇబ్బందులు వస్తాయని ముందే గ్రహించి ఈ అడుగు వేశారు. మన్‌మోహన్‌సింగ్‌ కూడా అదే బాటలో నడిచారు. నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయ్యాక సరికొత్త రూపును తెచ్చారు. ముఖ్యంగా డోనాల్డ్‌ ట్రంప్‌తో వ్యక్తిగత స్నేహాన్ని నెరిపారు. ట్రంప్‌ ఎన్నికలకు అమెరికా వెళ్లి ప్రచారం చేసి వచ్చారు. ట్రంప్‌ను ఇండియాకు ఆహ్వానించి గుజరాత్‌ లో లక్ష మందితో పెద్ద సభ ఏర్పాటు చేసి, ట్రంప్‌ను తన్మయంలో మునకలు వేయించారు.

    అధ్యక్షులతో సత్సంబంధాలు..
    ఇక అమెరికా అధ్యక్షుల్లో చాలా మంది కూడా భారత్‌తో సత్సంబంధాలు కోరుకున్నవారే బిల్‌ క్లింటన్‌ నుంచి బైడెన్‌ వరకు భారత్‌తో స్నేహానికే మొగ్గు చూపారు. భారతదేశంపై ప్రత్యేక ప్రేమ చూపించారు. అయితే పాకిస్థాన్‌పైనా మక్కువ చూపారు. డోనాల్డ్‌ ట్రంప్‌కు భారత్‌ పట్ల ఆకర్షణ, అనురాగం ఎక్కువని కొందరు అంటారు.

    అమెరికా అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న భారతీయులు భవిష్యత్‌లో మరింత కీలకమైన వ్యక్తులుగా, వ్యవస్థలుగా మారతారనడంలో సందేహం లేదు. అగ్రరాజ్యంలో భారతీయుల అధికారిక అమెరికా పౌరుల సంఖ్య భవిష్యత్తులో గణనీయంగా పెరుగుతుంది. ఇప్పటికే పౌరసత్వం ఉన్న కొందరికి సంపూర్ణమైన స్వేచ్ఛ లేదు. దానికి కూడా పరిష్కారం లభించాలి.