TANA And Lead the Path Foundation : ప్రార్థించే పెదవుల కన్నా.. చేసే సాయం మిన్న అంటారు. ఇప్పుడు ప్రవాస భారతీయులు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు ఎంతో మంది ఆకలి తీరుస్తున్నాయి. ఎంతోమంది అన్నార్థులకు సహాయం చేస్తున్నాయి.

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరియు లీడ్ ది పాత్ ఫౌండేషన్ సంయుక్తంగా “హాట్ లంచ్” కార్యక్రమాన్ని మే 31న మొట్టమొదటిసారిగా ఇల్లినాయిస్‌లోని ఆరోరాలో ఉన్న హేసెడ్ హౌస్ హోంలెస్ షెల్టర్‌లో విజయవంతంగా జరిగింది.


ఈ సేవా కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి ఇల్లినాయిస్ లో నిర్వహించడం విశేషం. దీనికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. “గివ్ ఎ మీల్, షేర్ ఎ స్మైల్” అనే స్ఫూర్తిదాయక నినాదంతో దాదాపు 300 మంది నిరాశ్రయులకు పౌష్టికమైన మధ్యాహ్న భోజనం అందించారు.

ఈ కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది.తానా కల్చరల్ సర్వీస్ కోఆర్డినేటర్ డా. ఉమా కటికి (ఆరమండ్ల) ఆధ్వర్యంలో అన్నపూర్ణ స్తోత్రంతో భోజన వితరణ మొదలైంది. ఆకలితో ఉన్నవారికి కేవలం ఆహారం అందించడమే కాకుండా, మానవత్వాన్ని, ప్రేమను పంచుకోవడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. ఇల్లినాయిస్‌లో జరిగిన ఈ కార్యక్రమం, తానా, లీడ్ ది పాత్ ఫౌండేషన్ మానవతా సేవలకు ఒక బలమైన నిదర్శనం.

-సేవా స్ఫూర్తిని చాటిన వాలంటీర్లు
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అనేక మంది వాలంటీర్లు అహర్నిశలు కృషి చేశారు. డా. ఉమా కటికి (ఆరమండ్ల ) సారథ్యంలో గుర్‌ప్రీత్ సింగ్, శాంతి, శ్రీదేవి, శీరీష, భాస్కర్, కీర్తి, స్వాతి, ఇందు, కళ్యాణ్, హేమలత, చెన్నకృష్ణ, సుహాసిని, వైష్ణవి, పృథ్వీ, లక్ష్మి, చిట్టిబాబు, లక్ష్మి.ఎం తదితరులు భోజన వితరణలో చురుగ్గా పాల్గొన్నారు.

ఈ విధమైన సేవా కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పునకు దోహదపడతాయని, ఆకలితో అలమటించే వారికి ఒక పూట భోజనం అందించి, వారి ముఖాల్లో చిరునవ్వులు చూడగలగడం మన సంస్కృతి గొప్పతనమని తానా సభ్యులు పేర్కొన్నారు.
తానా మరియు లీడ్ ది పాత్ ఫౌండేషన్ చేపట్టిన ఈ విశేష సేవకు సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిచ్చి, మరింత మందిని సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తుందని ఆశిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

*మరిన్ని ఫొటోలను కింద చూడొచ్చు

