Adi Shankaracharya : అగ్రరాజ్యం అమెరికాలో జగద్గురువు ఆదిశంకారాచార్యుడి భారీ విగ్రహం ప్రతిష్టించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తెలుగు వారైన మోచర్ల శశిభూషణ్ ఈ మహా నిర్మాణానికి మూలస్థంభంగా నిలుస్తున్నారు. సుమారు 500 ఎకరాల స్థలాన్ని ఇందుకోసం ఇప్పటికే సేకరించారు. అఖండ భారతఖ్యాతిని చాటేలా అనేక నిర్మాణాలు ఇక్కడ నెలకొల్పనున్నారు. అందులో శంకరాచార్య విగ్రహం ప్రధాన ఆకర్షణగా నిలువనుంది. విగ్రహా నిర్మాణంపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ విగ్రహ నిర్మాణానికి సుమారు రూ.200 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.
త్వరలో ఆవిష్కణ..
త్వరలోనే 108 అడుగుల ఆదిశంకరాచార్యుడి విగ్రహ నిర్మణ పనులను భారతీయ పీఠాధిపతులు, దేశాధినేతల సమక్షంలో ప్రారంభించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇందుకు అమెరికా ప్రభుత్వం నుంచి సహకారం అందుతున్నట్లుగా శశిభూషణ్ తెలిపారు. కుర్తాళ పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీస్వామి ఆశీస్సులతో ఈ ప్రాజెక్టుకు ప్రారంభించినట్లు సమాచారం.
నిర్మాణాలు ఇలా..
ఇక 500 ఎకరాల ప్రాంగణంలో దేవాలయాలు, యోగా కేంద్రాలు, సంప్రదాయ వ్యవసాయ క్షేత్రాలు, గోశాలలు, ఆరోగ్య నిలయాలు, 64 కళల స్వరూపాలు, వేద విద్యా భాండాగారాలు మొదలైన భారతీయ ప్రతిరూపాలు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్టు విలువ రూ.3 వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఆదిశంకరాచార్యుడి విశేషాలు..
– ఆదిశంకరుడు తత్త్వవేత్త. అపర శంకర స్వరూపంగా అభివర్ణిస్తారు. అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన తీరు, సమతను స్థాపించిన వైనం పరమాద్భుతం. ఆయన జనన, మరణ కాలాదులపై స్పష్టత లేకపోయినా, కేవలం కొన్ని వందల సంవత్సరాల క్రితం వరకూ ఈ భూమిపై నడయాడిన దైవ స్వరూపంగా విశ్వసిస్తారు.
– కేవలం 32 ఏళ్లు మాత్రమే భౌతికంగా ఈ భూమిపై నడయాడినా, అనంతకాలంలో నిలబడే సారస్వతాన్ని మనకు గొప్ప కానుకగా అందించి వెళ్లిపోయాడు. వందల ఏళ్లనాడే ఆసేతు శీతాచలం సంచరించి, విస్తృతంగా జ్ఞాన బోధ చేసి మానవాళి ఐక్యతకు పునాదులు వేశాడు.
– బ్రహ్మ సూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీతకు ఆదిశంకరుడు చెప్పిన భాష్యం అమృత తుల్యం. హిందూ మతంలోని సౌందర్యాన్ని శంకరాచార్యుడు దర్శించి, మనకు దర్శనం చేయించాడు. ఈ ప్రస్థానంలో బోధనలు, రచనలు, ఉపన్యాసాలు, చర్చలు వంటి మార్గాలను ఎంచుకున్నాడు. భారత భూమిలో నాలుగు ప్రాంతాలలో విశిష్ట పీఠాలను స్థాపించాడు.