Chicago Tana: క్రికెట్ అంటే భారతీయులకు పిచ్చి. మన దేశంలో అత్యంత ఆదరణ ఉన్న క్రీడ అందే. క్రికెట్ అన్నా.. క్రికెట్ ఆటగాళ్లన్నా పడిచచ్చేంత అభిమానులు ఉన్నారు. ఇక క్రి కెటర్లను దేవుళ్లుగా కూడా కొలుస్తున్నారు. ఈట్ క్రికెట్.. డ్రింక్ క్రికెట్.. స్లీప్ క్రికెట్.. ఇదీ భారతీయ క్రికెట్ అభిమానుల తీరు. అంతలా ఆసక్తి చూపుతారు క్రికెట్ అంటే. అందుకే భారత్‌లో అంత్యంత ఆదరణ ఉన్న క్రీడగా క్రికెట్ గుర్తింపు పొందింది. ఇక క్రికెట్‌కు వయోబేధం, వైకల్యం అడ్డు రావని నిరూపిస్తున్నారు భారతీయులు. అంతలా ఆదరణ ఉన్న క్రికెట్‌లో అంధులు కూడా రాణిస్తున్నారు. భారత్‌లో ఈమేరకు ఒక అంధ క్రికెట్ జట్టు కూడా ఉంది. క్రికెట్‌పై ఉన్న ఆసక్తితో అంధులు ఆడుతున్నారు. రాణిస్తున్నారు.

మన భారత అంధ క్రికెట్ జట్టు ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తోంది. అక్కడ మన క్రికెటర్లకు అనూహ్య మద్దతు లభిస్తోంది. టీమిండియా అంధ క్రికెటర్లను ‘తానా’ అక్కున చేర్చుకుంది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) ఆధ్వర్యంలో ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన, భారత పురుషుల అంధుల క్రికెట్ జట్టు కోసం మీట్–గ్రీట్ ఈవెంట్‌ను నేపర్‌విల్లేలోని మాల్ ఆఫ్ ఇండియాలో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భారత అంధ క్రికెటర్లు పాల్గొన్నారు. తానాతోపాటు తెలుగు, ఇతర భారతీయ స్వచ్చంధ సంస్థలు భారత అంధ క్రికెటర్లకు మద్దతుగా నిలిచారు. అంధ క్రికెటర్లు అందరిలో స్ఫూర్తి నింపుతున్నారని అభినందనలు తెలిపారు.

-అవగాహన కల్పించేందుకే..
బెంగళూరుకు చెందిన సమర్ధనం ట్రస్ట్, క్యాబి ఆధ్వర్యంలో భారత అంధ క్రికెటర్లు అమెరికాలోని పలు నగరాల్లో పర్యటిస్తున్నారు. అంధుల క్రికెట్‌పై అవగాహన కల్పించటం, 2028 పారా ఒలింపిక్స్‌లో భారత అంధుల క్రికెట్ జట్టు ప్రాతినిధ్యానికి ఆర్థిక వనరులు చేకూర్చటం వీరి అమెరికా పర్యటన ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా చికాగోలో తానా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలు సంస్థలు కూడా పాల్గొని భారత అంధ క్రికెటర్లకు తమ మద్దతు ప్రకటించాయి. వారి కోసం ‘‘షికాగో తానా’’ ఆధ్వర్యంలో విందు, పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భారత అంధుల క్రికెట్ జట్టు సభ్యులను మెంటార్ ధీరజ్ అంధుల క్రికెట్లో మూడు కేటగిరీలను, వాటి విభజనను తానా సభ్యులకు వివరించారు. ఈ మూడు గ్రూపుల ఆధారంగానే క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహిస్తామని తెలిపారు.

-తెలుగు, గుజరాతీ ఆటగాళ్లు..
ఈ అంధుల క్రికెట్ జట్టులో తెలుగు, గుజరాతీ ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు. అంధత్వాన్ని అధిగమించి ఆటను జయించిన ఈ ఆటగాళ్లను చూసి అందరం స్ఫూర్తి పొందాలని తానా కల్చరల్ సర్వీస్ కో-ఆర్డినేటర్ డా.ఉమా కటికి (ఆరమండ్ల) గారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అంధ క్రికెటర్లకు ‘తానా కల్చరల్ సర్వీస్ కో-ఆర్డినేటర్ డా.ఉమా కటికి (ఆరమండ్ల) గారు తానా పేరు మీద చెక్ నందించి ఆర్థిక సాయం చేశారు. ఇలాంటి క్రికెటర్లను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కొనియాడారు. ప్రవాస భారతీయులందరు వారందరికీ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన, భారత పురుషుల అంధుల క్రికెట్ జట్టు కోసం మీట్ –గ్రీట్ ఈవెంట్‌ను నేపర్‌విల్లేలోని మాల్ ఆఫ్ ఇండియాలో నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. అంధ క్రికెటర్లకు తానా మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. వారు ఆడే మ్యాచ్ లకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అంధ క్రికెటర్లు నిజమైన క్రీడాస్ఫూర్తి, స్థితిస్థాపకత, అచంచలమైన ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారన్నారు. సవాళ్లు, పరిమితులను నిర్వచించే ప్రపంచంలో ఈ బృందం పరిమితులను మనం సృష్టించినంత వాస్తవమని మాకు చూపిందన్నారు. వారు అసాధారణ నైపుణ్యం, సంకల్పం కోరుకునే క్రీడలో రాణించడమే కాకుండా, ఛాంపియన్‌గా ఉండటం గొప్ప విషయమన్నారు. మన భారతీయ హీరోలను గౌరవించేందుకు తానా పేరుతో చెక్కును అందించామని తెలిపారు.

తానా రీజినల్ రిప్రజెంటీటివ్ హర్ష గరికపాటి ఈ ఈవెంట్ ముఖ్య పాత్ర వహించారు. ఈ కార్యక్రమంలో హేమ కానురు, చిరంజీవి గల్ల, విజయ చంద్ర కొర్రపాటి, కృష్ణమోహన్ చిలమకూరు, రవి కాకర తదితరులు పాల్గొన్నారు.
