దుబాయ్: తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవాన్ని ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ (ETCA) ఆధ్వర్యంలో యూఏఈలో అత్యంత వైభవంగా నిర్వహించారు. జూలై 19న రాస్ అల్ ఖైమాలోని మైత్రి ఫార్మ్స్ వేదికగా జరిగిన ఈ వేడుకకు మైత్రి గ్రూప్ వ్యవస్థాపకులు కొత్త జైపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఎడారి నేలపై తెలంగాణ ఆత్మను సజీవంగా నిలిపారు: కొత్త జైపాల్ రెడ్డి
ఈ వేడుకల్లో పాల్గొన్న ముఖ్య అతిథి కొత్త జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ ప్రవాస తెలంగాణవాసులు తమ సంస్కృతిని, మూలాలను మర్చిపోకుండా బోనాలు, బతుకమ్మ వంటి పండుగలను ఇంత ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. సేవా కార్యక్రమాలతో పాటు మన సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందిస్తున్న ETCA ప్రతినిధులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఎడారి నేలపై తెలంగాణ ఆత్మను, పల్లె వాతావరణాన్ని సజీవంగా నిలిపిన తీరు ప్రశంసనీయమని కొనియాడారు.

దుబాయ్‌లో జరిగిన ETCA బోనాల మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మైత్రి గ్రూప్ వ్యవస్థాపకులు కొత్త జైపాల్ రెడ్డి.
ఎమిరేట్స్ నలుమూలల నుంచి కదిలివచ్చిన ప్రవాసులు
దుబాయ్, అబుదాబి, షార్జా, అజ్మాన్, ఉమ్ అల్ ఖువైన్, రాస్ అల్ ఖైమా, ఫుజైరా తదితర ఎమిరేట్స్ నుంచి సుమారు 400 మందికి పైగా తెలంగాణ ప్రవాసులు కుటుంబ సమేతంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. విదేశీ నేలపై ఈ బోనాల వేడుకను ETCA వరుసగా నాలుగో ఏడాది నిర్వహించడం విశేషం.

ఆధ్యాత్మికం.. సాంస్కృతిక వైభవం
కార్యక్రమం గౌరమ్మ పూజతో ప్రారంభమై, శ్రీ మహంకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, దీపప్రజ్వలనం, బోనాల సమర్పణ, కుంకుమార్చన, మహాహారతులతో ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. మహిళలు సంప్రదాయ పట్టు చీరలు ధరించి రంగురంగుల పూలతో అలంకరించిన బోనాలను తలపై మోసుకుంటూ నిర్వహించిన ఊరేగింపు అందరినీ ఆకట్టుకుంది. ఒగ్గు డోలు మోతలు, పోతురాజుల విన్యాసాలు, జానపద కళారూపాలు ఎడారి నేలపై తెలంగాణ పల్లె వాతావరణాన్ని తలపించాయి.
భావితరాలకు మన సంస్కృతిని పరిచయం చేయడమే లక్ష్యం
ETCA వ్యవస్థాపక అధ్యక్షుడు కిరణ్ కుమార్ పీచర, అధ్యక్షుడు జగదీష్ రావు మాట్లాడుతూ.. యూఏఈలో నివసిస్తున్న తెలంగాణ ప్రవాసులకు, ముఖ్యంగా విదేశాల్లో జన్మించిన పిల్లలకు మన పండుగల గొప్పతనాన్ని పరిచయం చేయడమే సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఈ సందర్భంగా కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన LSPMK గ్రూప్ చైర్మన్ రాధారపు సత్యం, లెమన్ స్టూడియో రమేశ్ (ఫోటో & వీడియో), విరాళాలు అందించిన సభ్యులు, వాలంటీర్లు, కళాకారులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం భక్తులకు మహాప్రసాదంతో పాటు సంప్రదాయ తెలంగాణ వంటకాలతో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.