America: అగ్రరాజ్యం అమెరికాలోని ప్రతిష్టాత్మక ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో చదువుతున్న ఒక భారతీయ సంతతికి చెందిన విద్యార్థిని అరెస్ట్ అయింది. యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల నిరసనలన నేపథ్యంలో ఈ అరెస్టు జరిగినట్లు తెలిసింది. వర్సిటీలో విద్యార్థులు శిబిరం ఏర్పాటుచేసుకుని నిరసన తెలుపుతున్నారు. దీంతో భారత కాలమానం ప్రకారం గురువారం(ఏప్రిల్ 25న) తెల్లవారుజామున యూనివర్సిటీ ప్రాంగణంలోకి వచ్చిన పోలీసులు ఆ నిరసనలో పాల్గొన్న తమిళనాడులో జన్మించిన అచింత్య శివలింగన్, హసన్ సయ్యద్‌ను అరెస్టు చేశారు. ఇద్దరూగ్రాడ్యుయేట్ విద్యార్థులే. నిబంధనలు అతిక్రమించినందుకే అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా విద్యార్థులు అరెస్టు కావడంతో వారిని క్యాంపస్ నుంచి నిషేధించినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. క్యాంపస్‌లో టెంట్‌లు ఏర్పాటు చేయడం ద్వారా యనివర్సిటీ నిబంధనలు ఉల్లంఘించారని యూనివర్సిటీ ప్రతినిధి జెన్నిఫర్ మోరిల్ తెలిపారు. ఈమేరకు హెచ్చరించినా తొలగించలేదని పేర్కొన్నారు.
నిరసనలు ఆపాలని..
నిరసనలు ఆపాలని విద్యార్థులకు యూనివర్సిటీ అధికారులు సూచించారు. అయినా పట్టించుకోలేదు. దీంతో పోలీసులు అరెస్ట్ చేయడంతోపాటు ఇప్పుడు యూనివర్సిటీ నుంచి కూడా నిషేధించబడ్డారు. విద్యార్థుల అరెస్ట్ తర్వాత మిగతా విద్యార్థులు స్వచ్ఛందంగా శిబిరాలను తొలగించారు. శివలింగం ప్రిన్స్‌టన్‌లో ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్‌లో పబ్లిక్ అఫైర్స్‌లో మాస్టర్స్ విద్యార్థి. సయ్యద్ అదే యూనివర్సిటీలో పీహెచ్‌డీ అభ్యర్థి.
నిషేధం విధించలేదు..
ఇదిలా ఉండగా విశ్వవిద్యాలయం గురువారం ఎవరినీ తొలగించలేదని, క్యాంపస్ నుంచి∙నిషేధించబడిన విద్యార్థులను వారి విశ్వవిద్యాలయ యాజమాన్యంలోని హాస్టల్స్‌లో ఉండటానికి అనుమతిస్తుందని Hotchkiss చెప్పారు. ఇదిలా ఉంటే.. నిరసనలో ప్రిన్స్‌టన్ విద్యార్థులు, అధ్యాపకులు, కమ్యూనిటీ సభ్యులు, బయటి వ్యక్తులు కూడా నిరసనలో పాల్గొన్నారు. పోలీసులు కావాలనే ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బలవంతంగా అరెస్ట్ చేశారని పేర్కొంటున్నారు.