Akul Dhawan: అమెరికాలో ఉన్నత చదువులు, ఉపాధి కోసం వెళ్లిన భారత సంతతి విద్యార్థి అకుల్ ధావన్ ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుమారుడి మృతి పై అనుమానాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. అకుల్ మృతి చెందిన కొద్దిరోజులకు అమెరికాలోని ఇల్లి నైస్ విశ్వవిద్యాలయం అసలు విషయాలు వెల్లడించింది. అకుల్ ధావన్ మృతికి ఆల్కహాల్ అధిక మోతాదులో తీసుకోవడం.. రక్తం గడ్డకట్టే చలిలో ఎక్కువసేపు ఉండటం వల్లే హైపోథెర్మియాకు గురై అతడు మృతి చెందినట్లు ప్రకటించారు. అకుల్ మృతి పై లోతైన విచారణ జరుపుతామని ఇల్లి నాయిస్ యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు.
అకుల్ గత నెల 20న తన మిత్రులతో కలిసి ఇల్లి నాయిస్ విశ్వవిద్యాలయం సమీపంలో ఉన్న కెనోపి క్లబ్ కు వెళ్ళిపోయాడు. కానీ అక్కడి సిబ్బంది అకుల్ ను లోపలికి వెళ్ళనీయలేదు. అతడు పలుమార్లు అందులోకి వెళ్ళేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.. అప్పటికి అతడు మిత్రులు వారించే ప్రయత్నం చేసినప్పటికీ వినిపించుకోలేదు.. వారు క్యాబ్ బుక్ చేసినప్పటికీ అందులో వెళ్లడానికి అతడు నిరాకరించాడు. సాధారణంగా ఇల్లి నాయిస్ లో జనవరిలో ఉష్ణోగ్రతలు -30 డిగ్రీలకు పడిపోతుంటాయి. రాత్రి సమయంలో ఆ ఉష్ణోగ్రతలు ఇంకా తక్కువ నమోదు అవుతుంటాయి. సాధారణంగా ఆ సమయంలో ఎవరూ రాత్రిపూట బయటికి రావడానికి ఇష్టపడరు.. అంతటి సంక్లిష్టమైన వాతావరణంలో అకుల్ బయటికి రావడం.. రక్తం గడ్డకట్టే చలిలో బయట ఉండటంతో హైపోథెర్మియాకు గురయ్యాడు.
అప్పటి సమయం ఆలస్యం అవుతున్న నేపథ్యంలో అకుల్ స్నేహితులు క్లబ్ దగ్గర నుంచి వారి గదులకు వెళ్లిపోయారు. స్నేహితులు వెళ్లిపోవడం, క్లబ్ సభ్యులు నిరాకరించడంతో అకుల్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గదులకు వచ్చిన తర్వాత స్నేహితులు అతడిని సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలు మొత్తం విఫలమయ్యాయి. దీంతో ఆ స్నేహితుల్లో ఒక వ్యక్తి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫలితంగా వారు గాలింపు చర్యలు చేపట్టారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఆకుల్ మృతదేహాన్ని వారు గుర్తించారు. అతడు చనిపోయిన తర్వాత నిర్వహించిన పోస్టుమార్టం లో హైపోథెర్మియా లక్షణాలు కనిపించాయని వైద్యులు వెల్లడించారు. “క్లబ్లోకి నిరాకరించడం.. స్నేహితులు అతడిని విడిచిపెట్టి వెళ్లిపోవడంతో అకుల్ ఎక్కువసేపు రక్తం గడ్డకట్టే చలిలో ఉన్నాడు. పైగా ఆల్కహాల్ మోతాదుకు మించి తీసుకున్నాడు. దీంతో శరీరంలో ఒక్కసారిగా అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి..అవి హైపోథెర్మియా కు దారి తీశాయని” అక్కడి పోలీసులు అంటున్నారు. హైపోథెర్మియా వల్ల శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మందగిస్తుంది. దీనివల్ల కీలకమైన అవయవాలకు ఆక్సిజన్ అందదు. గుండె కొట్టుకునే వేగం తగ్గిపోతుంది. అన్ని అవయవాలు ఒకదాని తర్వాత మరొకటి విఫలం అవుతూ ఉంటాయి. ఫలితంగా అకాలమైన మరణం సంభవిస్తుంది. అకుల్ విషయంలోనే ఇదే జరిగిందని ఇల్లి నాయిస్ విశ్వవిద్యాలయ అధికారులు అంటున్నారు.