https://oktelugu.com/

Dubai: క్యాబ్ మిస్ అయింది.. ప్రాణం పోయింది

దుబాయ్‌లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన విదిశ అనే యువతి దుర్మరణం చెందింది. మంగళూరు ఉళ్లాలకు చెందిన విదిశ దుబాయ్‌లో పనిచేస్తోంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : February 25, 2024 / 07:55 AM IST

    Dubai

    Follow us on

    Dubai: పిల్లలను ఉన్నత స్థానాల్లో చూడాలని తల్లిదండ్రులు కలలు కంటారు. ఇందు కోసం శ్రమిస్తారు. నేటితరం తల్లిదండ్రులు తమ పిల్లలు అమెరికా, బ్రిటన్‌, కెనడా లాంటి దేశాల్లో ఉన్నత చదువులు చదివి అక్కడే స్థిర పడాలని కోరుకుంటున్నారు. ఒకప్పుడు సంపన్నులకే సాధ్యమైన విదేశీ విద్య ఇప్పుడు మధ్య తరగతి విద్యార్థులకు అందుతోంది. రుణాలు, అప్పులతో పిల్లలను విదేశాలకు పంపిస్తున్నారు. ఇందుకోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అక‍్కడ స్థిర పడిన పిల్లలను చూసి పొంగిపోతున్నారు. గొప్పగా చెప్పుకుంటున్నారు. అయితే అక్కడకు వెళ్లిన తర్వాత ఊహించని పరిణామాలతో ఏదైనా జరిగితే తల్లడిల్లిపోతున్నారు. అమెరికాలో ఇటీవల భారతీయ విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయి. ఇక అమెరికాలో 2023 జనవరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాహ్నవి కందుల రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. ఈ ఘటనపై అక్కడి కోర్టు ఫిబ్రవరి 23న తీర్పు వెల్లడించింది. ఈ ఘటన మరువక ముందే మరో భారతీయ అమ్మాయి ఇలాగే రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడింది.

    దుబాయ్‌లో కర్ణాటక యువతి..
    దుబాయ్‌లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన విదిశ అనే యువతి దుర్మరణం చెందింది. మంగళూరు ఉళ్లాలకు చెందిన విదిశ దుబాయ్‌లో పనిచేస్తోంది. ఈమె తండ్రి విఠల్‌ కులాల్‌ మంగళూరు తాలుకా పంచాయతీ మాజీ ఉపాధ్యక్షుడు. ఏకైక కుమార్తె కావడంతో ఉన్నత చదువులు చదివించారు. కర్ణాటకలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసింది. బెంగళూరులో ప్రైవేట్ సంస్థలో ఏడాదిపాటు పని చేసిన విదిశ 2019లో దుబాయ్ వెళ్లింది. అక్కడ ఎయిర్‌ పోర్టులో అధికారిగా పనిచేస్తోంది. నిత్యం సంస్థ క్యాంబ్‌లో జాబ్‌కు వెళ్లేది. గురువారం ఆ వాహనం మిస్ కావడంతో తన సొంత కారు డ్రైవ్‌ చేసుకుంటూ ఎయిర్‌ పోర్టుకు బయల్దేరింది.

    కారు అదుపు తప్పి..
    విదిశ నడుపుతున్న కారు మార్గ మధ్యంలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు విదిశను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. ఇదిలా ఉండగా విదిశ ఆరు నెలల క్రితమే దుబాయ్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకుంది. తర్వాత కొత్త కారు కొనుగోలు చేసింది. ఆ వాహనంలో వెళ్తుండగానే యాక్సిడెంట్‌ జరిగింది. ఒక్కగానొక్క కూతురు పరాయి దేశంలో దుర్మరణం చెందడంతో ఆమె తండ్రి కన్నీరు మున్నీరవుతున్నాడు. విదిశ మృతదేహాన్ని మంగళూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.