Venu Swamy : ఎల్లప్పుడూ వివాదాస్పద జాతకాలను చెప్తూ వార్తల్లో నిలిచే వేణు స్వామి, నేడు ఒక మంచి పని చేసాడు. సంధ్య థియేటర్ ఘటన లో తీవ్రంగా గాయపడి కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ని కలిసి, అతని తండ్రి భార్గవ్ ని పరామర్శించాడు. అనంతరం ఆయన తనకు తోచిన విధంగా రెండు లక్షల రూపాయిల విరాళం ని అందించి తన గొప్ప మనసు చాటుకున్నాడు. ఇతనితో పాటు జానీ మాస్టర్ కుటుంబ సభ్యులు కూడా శ్రీతేజ్ ని నేడు కలిసి పరామర్శించాడు. అనంతరం వేణు స్వామి మీడియాతో మాట్లాడుతూ శ్రీ తేజ్ ఆరోగ్యం ప్రస్తుతానికి చాలా వరకు కుదుట పడిందని, దేవుడు ఆశీస్సులు ఆ బిడ్డపై బలంగా ఉన్నాయని, త్వరలోనే శ్రీతేజ్ పూర్తిగా కోలుకొని మనలో కాలిపోయి తిరుగుతాడని, అతని పేరిట త్వరలోనే మృత్యుంజయ హోమం కూడా చేస్తానని ఈ సందర్భంగా వేణు స్వామి చెప్పుకొచ్చాడు.
అంతకు ముందే అల్లు అరవింద్, ప్రముఖ నిర్మాత ఫిల్మ్ ఫెడరేషన్ చైర్మన్ దిల్ రాజు కలిసి రెండు కోట్ల రూపాయిల చెక్కుని శ్రీ తేజ్ తండ్రి భాస్కర్ కి అందించారు. శ్రీతేజ్ ని చూసేందుకు ప్రతీ రోజు సినీ సెలెబ్రిటీలు క్యూలు కడుతున్నారు. ఈ కేసు చిక్కుముడి వీడిన తర్వాత శ్రీ తేజ్ ని అల్లు అర్జున్ కలుసుకోబోతున్నాడు. శ్రీ తేజ్ తండ్రి భాస్కర్ ఘటన జరిగిన రెండవ రోజు నుండి అల్లు అర్జున్ కి చాలా సపోర్టివ్ గా ఉంటూ వచ్చాడు. జరిగిన దుర్ఘటన కి అల్లు అర్జున్ కి ఎలాంటి సంబంధం లేదని ఆయన ఎన్నోసార్లు మీడియా కి చెప్పాడు. నిన్న కూడా ఆయన ఈ విషయాన్ని మీడియా తో చెప్తూ, అల్లు అర్జున్ మీద వేసిన కేసు ని వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపాడు. త్వరలోనే ఈ సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.
ఇది ఇలా ఉండగా మొన్న దిల్ రాజు ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి అతి త్వరలోనే సినీ పెద్దలందరూ సీఎం రేవంత్ రెడ్డి ని కలవబోతున్నారు అంటూ అధికారికంగా తెలిపిన సంగతి తెలిసిందే. ఇకపై విడుదలయ్యే సినిమాలకు, తాను ముఖ్యమంత్రి గా కొనసాగినన్ని రోజులు టికెట్ హైక్స్ , బెనిఫిట్ షోస్ ఇవ్వబోనని చాలా బలంగా చెప్పారు. ఈ సంక్రాంతికి రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘గేమ్ చేంజర్’ చిత్రం విడుదల కాబోతుంది. అదే విధంగా పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’, ప్రభాస్ ‘రాజాసాబ్’ , ఎన్టీఆర్ ‘వార్ 2 ‘, మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర వంటి చిత్రాలు వచ్చే ఏడాది విడుదల కాబోతున్నాయి. ఈ సినిమాలన్నిటికీ వందల కోట్ల రూపాయిల వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సినీ పరిశ్రమ వైపు కాస్త జాలి చూపాలని, టికెట్ హైక్స్, బెనిఫిట్ షోస్ కి అనుమతిని ఇవ్వాలని కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.